తెలుగులో ఇప్పటికి సుమారు 400 స్వీయ చరిత్రలు అనండి, ఆత్మకథలు అనండి, జీవితానుభవాల నుండి వచ్చాయి. వీటిలో అత్యద్భుతమైన స్వీయ చరిత్ర దరిసి చెంచయ్య గారి ‘నేనూ–నా దేశం’. ఇటీవల పునర్ముద్రణం కూడా పొందిన వైనం తెలుస్తున్నది. ఆనాటి బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం, క్రూరత్వం, అణచివేత దరిసి వారి స్వీయ చరిత్రలో వర్ణితమైనట్లు మరి వేరే వారి ఆత్మకథలో ప్రసక్తమయ్యే అవకాశం లేదు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్కలీ నగరంలో గదర్ పార్టీ (అంటే సాయుధ విప్లవం ద్వారా ఇంగ్లిష్ వారిని ఈ దేశం నుంచి పారద్రోలడం) అత్యంత ఉత్తేజకరంగా వర్ణితమైనది. చెంచయ్యగారు నేటి ప్రకాశం జిల్లా దరిసి గ్రామం వారు. ప్రతి తెలుగు వ్యక్తీ చదవవలసిన మహోద్గ్రంథం ‘నేనూ– నా దేశం’.
ఇందులో చెంచయ్య భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గూర్చి ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగపూరితమైన విషయాలు రాశారు. చదవటం మొదలుపెడితే పూర్తి అయ్యే వరకు విడిచిపెట్టలేము. ఇటువంటి విషయాలలో ‘ఖుదీ రామ్ బోస్’ను గూర్చి చెంచయ్య ఉద్విగ్నభరితంగా చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన అమరవీరులలో వయసు రీత్యా బహు తరుణ వయస్కుడు ఖుదీరాం బోస్. క్రూర దుర్మార్గ ఆటవిక పాలనను మన దేశానికి అందించిన బ్రిటిష్ ప్రభుత్వం పద్దెని మిదేళ్ల వయసని కూడా చూడకుండా ఆయనకు మరణ శిక్ష విధించింది. ఖుదీరామ్ జీవయాత్ర 1889–1908.
ఖుదీరామ్ పెదవులపై చిరునవ్వుతో, చేతిలో భగవద్గీతనుంచుకొని ఉరికంబం ఎక్కాడు. చెంచయ్య గారు రాసిన అద్భుత విషయం ఏమంటే ఉరిశిక్షకు గురైన వ్యక్తిని జైలు అధికారులు వారం రోజుల ముందు నుంచి తూకం వేయటం. అది ముఖ్యమైన అంశం అనీ, ఉరి ప్రక్రియకు అది అవసరం అనీ, ఖుదీరాం బోస్ ఉరితీతకు గురి కాబోయే ముందు రోజులలో బరువు పెరిగినట్లు చెంచయ్య రాశారు. అది ఖుదీరామ్ మనో నిశ్చలత్వం. దేశ మాత పరదాస్య విముక్తికి ఓంకారం పలుకుతున్నానని ఆయన సంతోషంతో బరువు పెరిగినట్లు చెంచయ్య కథనం. ఖుదీరామ్ తల్లిదండ్రులు, లక్ష్మీప్రియదేవి, త్రైలోక్యనాథ బోస్.
– అక్కిరాజు రమాపతిరావు
రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment