Khudiram Bose
-
ఖుదీరామ్ కష్టాలు
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో అతి చిన్న వయసులో అమరులైన ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి టైటిల్ రోల్లో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో, అలాగే గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ఈ సినిమాని ప్రదర్శించగా ప్రశంసించారని యూనిట్ పేర్కొంది. అయితే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో విజయ్ జాగర్లమూడి గుండె పొటుకు గురై, చికిత్స తీసుకుంటున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన 'కిడ', 'ఖుదీరామ్ బోస్'
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా 'కిడ', స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ఖుదీరామ్ బోస్’ ఎంపికయ్యాయి. ఈ చిత్రాలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో ప్రదర్శించబడతాయి. 'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమ చిత్రం ఇండియన్ పనోరమాకు ఎంపికవడం పట్ల నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డివిఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. -
మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!
ఖుదీరాం బోస్ భారత స్వాతంత్య్ర సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్నవయస్కుడు. బ్రిటిష్ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహసవీరుడు. బాంబు వేసిన కారణంగానే అతడిని ఉరి తీసేనాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాలు. ఖుదీరాం పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్ జిల్లా హబిబ్‌పూర్‌లో 1889 డిసెంబర్ 3న జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఖుదీరాం చిన్నవయస్సులోనే కన్నుమూశారు. ఖుదీరాం పాఠశాలలో చదువుతున్న రోజుల్లో స్వాతంత్య్ర సమర యోధుల గురించి విని జాతీయోద్యమానికి ప్రభావితుడయ్యాడు. నిరంతరం తీవ్రమైన స్వాతంత్య్ర సాధనేచ్ఛతో రగిలిపోతుండే వాడు. మొదట్లో ‘అఖ్రా’ అనే విప్లవ సంస్థలో చేరాడు. 1905లో బెంగాల్ విభజన ఖుదీరాంలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను బాంబులతో పేల్చివేశాడు. ఆ తర్వాత ఒక ఘటన జరిగింది. 1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా అనేకమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్ని కొద్దిదూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ల యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లిషు అధికారి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్‌ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి అతడు పెట్టింది పేరు. ‘యుగాంతర్ ’ పత్రిక మీద అతను ఎప్పుడూ ప్రతికూల నిబంధనలు విధిస్తూ, ఆ పత్రికా కార్యకర్తలకు నరకయాతన పెట్టేవాడు. చిన్నవాడన్న దయ లేకుండా సుశీల్ కుమార్‌కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదిస్తూనే ఉన్నాడు. ఈ ఘటన తరువాత స్వతంత్ర వీరులంతా కింగ్స్‌ఫోర్డ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1908 ఏప్రిల్ మొదటివారంలో యుగాంతర్ విప్లవ సంస్థకి చెందిన విప్లవ కారులు కొందరు కలకత్తాలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ఫోర్ట్ ను అంతం చెయ్యడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవిందఘోష్ కూడా ఉన్నాడు. ఖుదీరాం బోస్‌ను, ప్రఫుల్లచాకి అనే మరో నవ యువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్‌పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒక బాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్‌ఫోర్డ్ క్లబ్ వాహనం బయటకు రాగానే దానిపై బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తి వెళ్లిపోయారు. అయితే ఆ వాహనంలో కింగ్స్‌ఫోర్డ్ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగా ఖుదీరాం బోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణ చేశారు. ముజఫర్‌పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికి కారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగస్టు 11న ఈ శిక్ష అమలైంది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు. నేడు ఖుదీరాం వర్ధంతి. -
ఖుదీరాం బోస్: ఉరిశిక్షకు ముందు బరువు పెరిగారు!
తెలుగులో ఇప్పటికి సుమారు 400 స్వీయ చరిత్రలు అనండి, ఆత్మకథలు అనండి, జీవితానుభవాల నుండి వచ్చాయి. వీటిలో అత్యద్భుతమైన స్వీయ చరిత్ర దరిసి చెంచయ్య గారి ‘నేనూ–నా దేశం’. ఇటీవల పునర్ముద్రణం కూడా పొందిన వైనం తెలుస్తున్నది. ఆనాటి బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం, క్రూరత్వం, అణచివేత దరిసి వారి స్వీయ చరిత్రలో వర్ణితమైనట్లు మరి వేరే వారి ఆత్మకథలో ప్రసక్తమయ్యే అవకాశం లేదు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్కలీ నగరంలో గదర్ పార్టీ (అంటే సాయుధ విప్లవం ద్వారా ఇంగ్లిష్ వారిని ఈ దేశం నుంచి పారద్రోలడం) అత్యంత ఉత్తేజకరంగా వర్ణితమైనది. చెంచయ్యగారు నేటి ప్రకాశం జిల్లా దరిసి గ్రామం వారు. ప్రతి తెలుగు వ్యక్తీ చదవవలసిన మహోద్గ్రంథం ‘నేనూ– నా దేశం’. ఇందులో చెంచయ్య భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గూర్చి ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగపూరితమైన విషయాలు రాశారు. చదవటం మొదలుపెడితే పూర్తి అయ్యే వరకు విడిచిపెట్టలేము. ఇటువంటి విషయాలలో ‘ఖుదీ రామ్ బోస్’ను గూర్చి చెంచయ్య ఉద్విగ్నభరితంగా చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన అమరవీరులలో వయసు రీత్యా బహు తరుణ వయస్కుడు ఖుదీరాం బోస్. క్రూర దుర్మార్గ ఆటవిక పాలనను మన దేశానికి అందించిన బ్రిటిష్ ప్రభుత్వం పద్దెని మిదేళ్ల వయసని కూడా చూడకుండా ఆయనకు మరణ శిక్ష విధించింది. ఖుదీరామ్ జీవయాత్ర 1889–1908. ఖుదీరామ్ పెదవులపై చిరునవ్వుతో, చేతిలో భగవద్గీతనుంచుకొని ఉరికంబం ఎక్కాడు. చెంచయ్య గారు రాసిన అద్భుత విషయం ఏమంటే ఉరిశిక్షకు గురైన వ్యక్తిని జైలు అధికారులు వారం రోజుల ముందు నుంచి తూకం వేయటం. అది ముఖ్యమైన అంశం అనీ, ఉరి ప్రక్రియకు అది అవసరం అనీ, ఖుదీరాం బోస్ ఉరితీతకు గురి కాబోయే ముందు రోజులలో బరువు పెరిగినట్లు చెంచయ్య రాశారు. అది ఖుదీరామ్ మనో నిశ్చలత్వం. దేశ మాత పరదాస్య విముక్తికి ఓంకారం పలుకుతున్నానని ఆయన సంతోషంతో బరువు పెరిగినట్లు చెంచయ్య కథనం. ఖుదీరామ్ తల్లిదండ్రులు, లక్ష్మీప్రియదేవి, త్రైలోక్యనాథ బోస్. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
వారిద్దరు ఉగ్రవాదులట!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో పాఠశాల సిలబస్‌లో స్వాతంత్ర్య సమరయోధులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. విప్లవ వీరులు కుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీల చర్రితను బెంగాల్లో పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు. అయితే వారిని ఉగ్రవాదులంటూ తప్పుగా ముద్రించారు. దీనిపై రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగింది. సంబంధిత అంశంపై ప్రతిపక్ష వామపక్షాలు, కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్యం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఏంటనీ ప్రశ్నించారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు. అతివాదులుగా ముద్రించబోయి ఉగ్రవాదులుగా తప్పద్దం జరిగిందని వివరించారు. కాగా వారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై జేడీయూ ఇదివరకే తప్పుబట్టిన విషయం తెలిసిందే. అతివాదులైన వారిద్దరి పేర్లు సిలబస్ నుంచి తక్షణం తొలగించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జేడీయూ లేఖ రాసింది. -
స్వాతంత్ర్య సమరయోధులపై ఉగ్రవాద ముద్ర!
పాట్నా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్కూల్ సిలబస్ లో విప్లవ నేతల పేర్లను ఉగ్రవాదులుగా చూపడంపై వివాదాలకు దారి తీస్తోంది. విప్లవ నేతలైన కుదిరం బోస్ మరియు ప్రఫుల్లా చాకీల పేర్లను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ స్కూల్ సిలబస్ లో చేర్చుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ లో ప్రవేశపెట్టడాన్నిజేడీయూ తప్పుబట్టింది. ఆ నేతల పేర్లను వెంటనే సరిచేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసింది. విప్లవకారులైన ఆ ఇద్దరీ పేర్లను అతివాదులుగా చేర్చడాన్ని మమతా ప్రభుత్వం తిరిగి సరిచేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మమతా బెనర్జీకి జేడీయూ ఎమ్మెల్సీ మరియు అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఒక లేఖను రాశారు. పశ్చిమ బెంగాల్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఎనిమిదో తరగతిలో చేర్చిన ఆ విప్లవ నేతల పేర్లను సరిచేయాలని విన్నవించారు. ప్రఫుల్లా చాకీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉందని..ఆమె బోస్ తో కలిసి పనిచేసిందన్నారు. 1908, ఏప్రిల్ 30 వ తేదీన కుదిరం బోస్ ఒక బ్రిటీష్ వాహనంపై దాడి చేసిన సంగతి ఈ సందర్భంగా కుమార్ గుర్తు చేశారు.