అండమాన్ జైలు జీవిత నరకం అనుభవించిన మహా వీరులలో ప్రతివాది భయంకరాచార్యుల వారు ప్రముఖులు. వీరి పేరు అసలు వేంకటాచార్యులు. ప్రతివాది భయంకర అనేది వీరి బిరుదనామం. వంశ పారంపర్య సంబంధి కావచ్చు. అండమాన్ జీవితం అని తెలుగులోనూ, ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని ఇంగ్లిష్‌లోనూ వీరు తమ జైలు జీవితానుభవాలు రాశారు. భారత స్వాతంత్య్ర ఫలసిద్ధి అమృతోత్సవం జరుపుకుంటున్న శుభవేళ ఇటువంటి పుస్తకాలు మళ్ళీ ముద్రించాలి. ఈ పుస్తకాన్ని కాకినాడ శ్రీరామ బాలభక్త సమాజం లైబ్రరీ నుంచి నేను సంపాదించగలిగాను.
కాకినాడ పురవీధిలో ఇంగ్లిష్ వారి క్లబ్బు నుంచి వస్తూనో పోతూనో ఒక ఇంగ్లిష్ సార్జంట్ కనబడగా, కోపల్లె కృష్ణారావు అనే పన్నెండేళ్ల బాలుడు ‘వందేమాతరం’ అని కౌమారోత్సుకతతో నినదించినట్లూ, దీనికి కోపించి ఆ ఇంగ్లిష్ సార్జంట్ బాలుణ్ణి కొరడాతో చితకబాదినట్లూ ప్రతివాద భయంకరాచారి గారి కథనం. పరాభవ దుఃఖ తీవ్రోద్విగ్నతలో భయంకరాచారి ప్రభృతులు బాంబులు తయారుచేసే పనిలో నిమగ్నం కాగా, సర్కారు వారు అది తెలిసి ఆచార్యుల వారిని అండమాన్ పంపించినట్లు ఐతిహ్యం!
అండమాన్ సెల్యులర్ కారాగారంలో ఆచార్యుల వారు కఠిన శిక్షననుభవిస్తుండగా, అక్కడి అరాచకాలను ఆ జైలు అధికారి అయిన మేజర్ క్రూక్స్‌కు ఫిర్యాదు చేసినట్లూ, ఈ క్రూక్స్‌ను జైళ్ల పరిస్థితుల విచారణసంఘం వారు సంజాయిషీ కోరగా ఆయన అండమాన్‌లో ఉన్నది జైలు కాదు, ప్యారడైజ్ అనాలి అని సమాధానించాడుట. దీనితో భయంకరాచార్యుల వారు క్రూక్స్‌ను ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని పుస్తకం రాశారు. అది రహస్యంగా ఇండియా చేరింది. అండమాన్ జైలు బీభత్సాలు బట్టబయలైనాయి.
ఆచార్యుల వారి అండమాన్ జీవితం జప్తుకు, నిషేధానికి గురి అయింది. అండమాన్ సెల్యూలర్ జైలుకు పత్రికలు కూడా రానిచ్చేది కాదట బ్రిటిష్ ప్రభుత్వం. ఖైదీలు ఆందోళన చేయగా సత్యాగ్రహ వార్తలపై తారు పూసి, ఆ పత్రికలను ఖైదీలను చదవనిచ్చేవారని ఆచార్యుల వారు తమ జైలు జీవిత స్వాత్మకథలో రాశారు. ఇదీ క్రూక్స్ ప్యారడైజ్, అండమాన్ జీవిత రచనల నేపథ్యం.
– అక్కిరాజు రమాపతిరావు
రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment