అప్పుడు చిలుమూరులో ఉన్నాను. కృష్ణానది పాయ ‘అదిగో, ఆ ముందునుంచే’ పారుతుందంటే బయల్దేరాం. ఎవరి వ్యవహారం తెమలడాన్ని బట్టి వాళ్లు జట్లు కడుతూ వెళ్లారు. నేను కారణం తెలియకుండా ఒంటరినై ఆ గుంపులను వెతుక్కుంటూ నడుస్తున్నా. బహుశా, వెయ్యేళ్ల నాటి శివాలయంలో కనబడిన అర్థంకాని తెలుగు రాతల్ని చదవడంలో మునిగిపోయి, అందరూ నన్ను దాటి వెళ్లిపోయినట్టు చూసుకుని ఉండను!
పొద్దు గుంకుతోంది. రాత్రి కురిసిన వాన ఆనవాలు తెలుస్తోంది. చేలలో పని ముగించుకుని వస్తున్నవాళ్లు ఎక్కడైనా ఎదురవుతున్నారు. మట్టిబాట, పసుపు గాలి, తమలపాకుల తీగలు సాయంత్రాన్ని మరింత సార్థకం చేస్తున్నాయి. ఒక మలుపు తిరుగుతూనే, నాకు ముందున్న తక్షణ కూటమి కనబడింది. కొంతదూరంలో రఘోత్తమ్ సర్, అక్కిరాజు, ముళ్లపూడి కొబ్బరిబోండాల కోసం నిలిచిపోయినట్టుగా అర్థమవుతోంది. ఎదురుగా సైకిల్ మీద గంపతో వస్తున్నాయన ఆగాడు, ‘‘మూడా?’’ అనుకుంటూ.
సరిగ్గా ఆ సమయానికే నేను వాళ్లను అందుకుంటున్నాను. మిన్నకుండా వెళ్లిపోదాం అనిపించింది. ఆగకపోతే వాళ్లేమైనా అనుకుంటారా? తెలిసినవాళ్లు అయినప్పుడు కిమ్మనకుండా, అక్కడ ఎవరూ లేనంత మామూలుగా వెళ్లిపోవడం ఎలా? అలా దాటి పోవడం సబబేనా? మరి ఉంటే వాళ్లు ముగ్గురుగా అనుభవించగలిగే ఏకాంతానికి నేను మధ్యలో దూరి భంగం వాటించినవాణ్ని అవుతానా?
‘రా, తీసుకో’ అనే అనివార్యమైన ఆహ్వానపు ఒత్తిడిని కలిగిస్తాననే స్పృహ నన్ను మరింత కలవరపరిచింది. ఈ అసౌకర్యమైన స్థితికి నన్ను నేను నెట్టుకోవడంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను వెళ్లేసరికి వాళ్లు అక్కడ ఉండటం యాక్సిడెంట్. ఒక్క నిమిషం ఆలస్యమైనా బోండాలతను వెళ్లిపోయుండేవాడు కావొచ్చు. అప్పుడు ఈ అనుకోని అతిథితో ఎలా రియాక్టవ్వాలో తెలియని డైలమాలోకి వాళ్లను నేను నెట్టివేసేవాణ్ని కాకపోవచ్చు. ఎవరూ దేనికీ బాధ్యులు కారు. అయినా విధివశాత్తూ అలా తారసపడ్డాం. ఒక్క క్షణంలోనే నా మొహమాటాన్ని చొరవగా కన్వర్ట్ చేసుకుని వాళ్లతో కలిశాను; ‘‘ఇంకోటి కొట్టు,’’ అన్నాను.
నిజానికి ఇదంతా వాళ్లు ఆలోచించివుండరు. నన్ను చాలా ప్రేమగానే ఆ తాత్కాలిక సమూహంలోకి ఆహ్వానించివుంటారు. అయినా, వాటికి డబ్బులు చెల్లించడం ద్వారా నా గిల్టును తగ్గించుకోవడానికి ప్రయత్నించాను. అప్పటికీ అది సరైనపని అని మాత్రం అనుకోలేకపోయాను. ఒకవేళ వాళ్లు నిజంగా ఆశించివుంటే, వాళ్ల ప్రైవసీకి అది పరిహారం ఎలా కాగలదు?
చిన్న శివుడు - పెద్ద శివుడు
ఒక సందర్భంలో, ఒక కామెంట్ కోసం, ఈ ఫోన్ చేయడం తప్పనిసరైంది. రింగ్‌టోన్ చాలా బాగుంది. ‘నాలోన శివుడు గలడు... నీలోన శివుడు గలడు...’ పాట విన్నకొద్దీ వినబుద్ధేస్తోంది. తనికెళ్ల భరణి గొంతు దీనికి బాగా సూట్ అయ్యింది. ఎదుటివ్యక్తి ఫోన్ తియ్యడంలేదనే విషయాన్ని గుర్తించలేనంతగా అందులో లీనమైపోవచ్చు. నిజంగా కూడా ఆయన తీయలేదు.
శివుడు నాకూ ఇష్టమే. నా చిన్నప్పటి ప్రియమైన దేవుడు శివుడే! కాళికాదేవి శివుణ్ని కిందపడేసి తొక్కుతున్న చిత్రపటం ఎవరింట్లోనో చూసి విలవిల్లాడిపోయాను. శివుడినేమిటి? ఈమె తొక్కడమేమిటి? ఆ అవమానానికి నా నరాలు కోపంతో పొంగిపోయాయి; పళ్లు పటపటలాడాయి; ఇక నేను పైకి వెళ్లి, ఆమెతో యుద్ధం చేసేద్దామనుకున్నాను. ఇంతలో మా రాంరెడ్డి మల్లయ్య మామ అన్నాడు: ‘‘ఏ నిజం శంకరుడు గాదు రాజూ! వాడెవడో రాక్షసుడు శంకరుని లెక్క వేషం ఏసుకుంటే, వాణ్ని దొక్కింది.’’ అమ్మయ్య! మనసు తేలికైపోయింది. పెద్ద యుద్ధం తప్పిపోయింది.
కాబట్టి శివుడంటే నాకు అంత ఇష్టం.
అయితే, నాలోనూ శివుడు ఉంటే, నాలోని శివుడు ఆయనలోని శివుడితో ఎందుకు మాట్లాడ్డానికి ప్రయత్నించినట్టు? పోనీ ఆయనలోని శివుడు నాలోని శివుడేదో మాట్లాడాలనుకుంటున్నాడని ఎందుకు గుర్తించలేదు? అంటే, ఇద్దరిలోనూ ఉన్న శివులు ఒక్కరు కారు. ఆయన తనికెళ్ల శివుడు, ఈయన పూడూరి శివుడు. అంటే దేవుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు దేవుడు. దేవుడు దేవుడికే సమానం కానప్పుడు, మనిషితో మనిషి మాత్రం ఎలా సమానం అవుతాడు?
- పూడూరి రాజిరెడ్డి
ఆజన్మం: సాయంత్రపు వాలులో ఒక తారసపాటు
Published Sun, Aug 11 2013 2:16 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement