డీఛీఛీబీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంటిపేరు కస్తూరి వారు..ఇల్లంతా గబ్బిలాల కంపు అన్నట్టు ఉంది జిల్లాలో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పరిస్థితి. నమ్మకమే పెట్టుబడిగా ఈ బ్యాంకులో ఇన్నాళ్లూ లావాదేవీలు జరిగాయి. ప్రజలకు చెందిన కోట్లాది రూపాయల డిపాజిట్లు ఇందులో ఉన్నాయి. జిల్లాలోని రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. దానిపై ఆధారపడి సుమారు రూ.350మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదంతా గతం. అయితే బ్యాంకు వ్యవహారాల్లో మాత్రం ఎప్పుడూ అంత పారదర్శకత కనిపించడం లేదు. తరచూ అక్రమాల ఆరోపణలతో వార్తల్లోకి వస్తోంది.
దీనికంతటికీ ఇక్కడ కేంద్రంగా తిష్ఠ వేసిన రాజకీయ పక్షాలు, వాళ్ల ఇష్టారాజ్యమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులొచ్చినప్పుడు సంబంధిత శాఖల ఉన్నత స్థాయి వర్గాలు విచారణ చేసి వీరికి భయపడి చేతులు దులిపేస్తున్నాయి తప్పిస్తే..విచారణలో తేలిన అక్రమాలను బహిర్గతం చేయడం లేదు. ఇక అక్రమార్కులపై చర్యలు సరేసరి. డీసీసీబీలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు విజయనగరానికి చెందిన హరోన్ రషీద్ అనే వ్యక్తి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్, ఆప్కాబ్ మేనేజింగ్ డెరైక్టర్కు 2013డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఆప్కాబ్ చీఫ్ జనరల్ మేనేజర్ (విజిలెన్స్)తో ప్రాథమిక విచారణ చేయించారు. ఈ ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. అందులో పలు అవినీతి అభియోగాలను పొందుపరిచారు.