Allegations of assault
-
ఆ మహిళలపై బీబర్ పరువునష్టం దావా
పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఇద్దరు మహిళలపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తనపై ఆరోపణలు చేసిన ఒక్కో మహిళపై 10 యూఎస్ మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 75.6 కోట్లు) పరువు నష్టం దావా వేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని బీబర్ స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు నిరాధరమైనవని నిరూపించడానిని తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాలను ఓ ప్రముఖ మీడియా వెబ్సైట్ వెల్లడించింది.(చదవండి : స్వీయ నిర్బంధంలో ‘ముద్దు’ ముచ్చట) ఈ ఆరోపణలు చేసినవారిలో ఒకరు.. 2014లో అస్టిన్‌లో జరిగిన సౌత్‌వెస్ట్ ఫెస్టివల్ చూసేందుకు వచ్చిన సమయంలో బీబర్ తనపై దాడి చేసినట్టుగా చెప్పారు. మరో మహిళ 2015 న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీబర్ తనపై దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. అయితే ఇవి రెండు కూడా పూర్తిగా కల్పితమైనవని.. ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే కుట్ర దాగి ఉందని బీబర్ పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు చర్యల వల్ల ఇతరుల పరువుకు భంగం వాటిల్లడమే కాకుండా.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఇదివరకే తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేయనున్నట్టు బీబర్.. ట్విటర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మౌనం అంగీకారం కాదు
‘‘ఎవరో హర్ట్ అవుతారని చెప్పి మౌనంగా ఉండిపోకండి. జరిగిన చేదు అనుభవాలను ధైర్యంగా బయటకు చెప్పండి. మార్పు మొదలైంది’’ అంటూ ‘మీటూ’ గురించి రాశారు సోనమ్ కపూర్ అహూజా. ప్రస్తుతం జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమం గురించి సోనమ్ కపూర్ రాసుకొచ్చారు. ‘‘మార్పుని అందరం కోరుకుంటాం. ఆ మార్పు రావాల్సిన మార్గంలో ప్రయాణించడానికి మాత్రం సంకోచిస్తాం. కానీ మార్పు అనేది పెద్ద కష్టం కూడా కాదు. చాలా సింపుల్. కొన్ని చిన్న చిన్న విషయాలు పాటిస్తే సులువే’’ అంటూ పలు పాయింట్స్ ప్రస్తావించారు. ‘‘బాధితులను నమ్మండి’. చాలా మంది బాధితురాలిని ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు. తప్పు మీవైపే ఉంది అన్నట్టు కూడా మాట్లాడతారు. కానీ వాటిని పట్టించుకోకండి. ఎంతో ధైర్యం కూడదీసుకుని బయటకు వచ్చి చెబుతున్నవారికి మనం చేయగలిగింది కేవలం వాళ్లను నమ్మడమే. ఇప్పటికీ చాలామంది తల్లులు మగపిల్లలే ఎక్కువ అన్నట్టుగా భావిస్తున్నారు. అలానే పెంచుతున్నారు. అందులో మార్పు రావాలి. ఇద్దరూ సమానమే అన్నట్టుగా పిల్లల్ని పెంచాలి. ఎవరైనా మరొకర్ని కావాలనుకున్నా, తాకాలనుకున్నా కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. మౌనం అంగీకారం కాదు. నో అంటే నో అని. లింగ వివక్ష జోక్స్‌ని మొహమాటానికి కూడా అభినందించకండి. ట్యాగ్ తగిలించడం మానేయండి. ఐటమ్ సాంగ్స్ చేయడం తప్పు కాదు. వాటిని ఐటమ్ నంబర్స్ అని ముద్ర వేయడం పొరపాటు. నా స్నేహితురాలు ఒకామె మీటూ గురించి మాట్లాడటానికి భయపడుతోంది. ఎందుకంటే తనకి ఎప్పటికీ ‘బాధితురాలు’ అనే ట్యాగ్ తగిలిస్తారని. పని ప్రదేశాల్లో స్త్రీలు కూడా ఎక్కువగా పని చేసే వాతావరణాన్ని తీసుకురండి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొని, నిజం నిరూపితమైన వాళ్లతో పని చేయకండి’’ అని పేర్కొన్నారు సోనమ్. -
సెల్ఫీ తీసుకోవాల్సింది
నటుడు అర్జున్‌పై కన్నడ నటి శ్రుతీ హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రుతికి మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు మరో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్. ‘‘2016 నవంబర్‌లో ఓ టాక్ షో టైమ్‌లో శ్రుతీ నాకు ఈ సంఘటన చెప్పింది. కాకపోతే అప్పుడు పేరు చెప్పలేదు. ఏం జరిగిందో ఇప్పుడు బయటకు చెప్పింది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని షేర్ చేశారు శ్రద్ధా. ‘‘ఓసారి బెంగళూరు నుంచి కొచ్చిన్‌కి బస్‌లో వెళుతున్నాను. ఓ వ్యక్తి చేయి నన్ను అసభ్యంగా తాకడంతో నిద్ర నుంచి మేల్కొన్నాను. అందుకు నా దగ్గర ఏటువంటి ఆధారం లేదు. ఆ చేదు అనుభవం మాత్రం మిగిలింది. ఈ సంఘటన జరిగినప్పుడు అతనితో పాటు, ఆ చేయితో కూడా ఓ సెల్ఫీ తీసుకొని ఉంటే అది సాక్ష్యంగా ఉండేదేమో?’’ అని పేర్కొన్నారామె. మరోవైపు శ్రుతీ హరిహరన్‌కు నటుడు ప్రకాష్‌రాజ్ మద్దతు తెలిపారు. ‘‘నా వృత్తిపరమైన కారణాల వల్ల నా పేరును చెప్పదలచుకోలేదు. శ్రుతీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. అర్జున్‌తో ఓ సందర్భంలో ఇబ్బంది పడ్డాను. ముందు అతడిని ‘జెంటిల్మెన్’ అని పిలవడం ఆపండి’’అంటూ మరో మహిళ అర్జున్ను ఆరోపించినట్లుగా, ట్వీటర్లో పోస్ట్ చేశారు శ్రుతీ హరిహరన్. ఇదిలా ఉంటే అర్జున్ పరిపూర్ణమైన ‘జెంటిల్మెన్’ అంటూ ఆయనతో ‘కాంట్రాక్ట్’ సినిమాలో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ సోనీ చరిష్టా పేర్కొన్నారు. -
వాళ్లతో ఎందుకు పని చేయకూడదు?
‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల బాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు డైరెక్టర్లు వాళ్లు చేస్తున్న సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్, ముఖేష్ చాబ్రాలు ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమం గురించి తాజాగా సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా స్పందించారు. ‘‘నా 40 ఏళ్ల కెరీర్లో ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళతోనూ చాలా మర్యాదతో నడుచుకుంటున్నాను’’ అన్నారు. మరి.. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ ఘాయ్‌తో కలిసి మీరు పని చేస్తారా? అంటే.. ‘‘ఎందుకు పని చేయకూడదు. అతను ఇప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. అతను దోషిగా తేలినప్పటికీ కలిసి పని చేస్తాను. ఎందుకంటే... అతని తప్పు నిరూపితమైతే ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అయినా.. సంజయ్ దత్ దోషిగా తేలి జైలుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా?. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయమని కొందరు అంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో వాళ్లు హీరోలుగా హైలైట్ కావడానికి అలా మాట్లాడుతున్నారేమో?’’ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్ ఖాన్‌తో(హౌస్‌ఫుల్ 4) వర్క్ చేయనని అక్షయ్ కుమార్, ‘మొఘల్’ సినిమాలో సుభాష్ కపూర్‌తో పని చేయనని ఆమిర్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. -
‘మీ టూ’కు తొలి వికెట్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది. వ్యక్తిగతంగానే పోరాడుతా.. వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు. దోవల్‌ను కలిశాకే నిర్ణయం.. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యాకే అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్‌కు దోవల్ తెలిపారు. అక్బర్ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్‌పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్ రాజీనామా చేసినట్లు సమాచారం. -
రాజీనామా బాటలో ఎంజే అక్బర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: ‘మీ టూ’ ప్రచారంలో భాగంగా మహిళా జర్నలిస్టులు పలువురు తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ రాజీనామాకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. పదవి నుంచి తప్పుకోవడం మినహా మరో మార్గం ఆయనకు లేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్..పర్యటనను అర్థంతరంగా ముగించుకుని స్వదేశానికి చేరుకుంటారని భావిస్తున్నారు. కాగా, అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టుల సంఖ్య పదికి చేరుకుంది. వీరంతా 1980ల నుంచి ఎంజే అక్బర్ వద్ద వివిధ పత్రికల్లో వివిధ సమయాల్లో పనిచేసిన వారే. మంత్రి అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ నాయకత్వం మౌనం వహించగా అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం సీరియస్‌గా ఉంది. ఆయన పదవికి రాజీనామా చేయాలంటోంది. అసలే ఎన్నికల సమయం..పైగా రాఫెల్ డీల్‌పై పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం మంత్రి అక్బర్ రూపంలో ప్రతిపక్షాలకు మరో అవకాశం ఇవ్వదలుచుకోలేదు. విదేశీ పర్యటన నుంచి స్వదేశం వచ్చిన వెంటనే మంత్రి రాజీనామా సమర్పించడం మంచిదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా కాకుండా, ఆయన ప్రత్యారోపణలకు పూనుకుంటే పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ప్రధానిని కలిసి నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తానని చెప్పినా కూడా ఆరోపణలను అంగీకరించినట్లే అవుతుందని అంటున్నాయి. ఈ ఆరోపణలపై మంత్రి అక్బర్ ఎలాంటి వివరణ ఇచ్చినా అది సంతృప్తికరం కాబోదు. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా పది మంది మహిళలు ఆరోపిస్తున్నందున వివరణ పరీక్షకు నిలబడలేదని బీజేపీ నేత ఒకరన్నారు. ఎలాంటి వివరణలు ఇచ్చే ప్రయత్నం చేయకుండా మౌనంగా వైదొలగడమే అక్బర్ ముందున్న ఏకైక అవకాశమని అన్నారు. అదే జరిగితే, పాత్రికేయ వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మంత్రి ఎంజే అక్బర్‌కు అవమానకరమైన నిష్క్రమణ అవుతుంది. కాగా,అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిరాకరించారు. -
‘ట్రంప్ లైంగికంగా వేధించింది అక్షరాల నిజం’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల కేసును దాఖలు చేసిన మేకప్ ఆర్టిస్ట్ జిల్ హార్త్ తన 20 ఏళ్ల మౌనాన్ని వీడి బుధవారం నాడు మొదటిసారి మీడియా ముందు నోరు విప్పారు. తాను ఏ మాత్రం అబద్ధాలకోరునుకాదని, తాను చెబుతున్నది అక్షరాల వాస్తవమని, పలు పర్యాయాలు లైంగికంగా తనను లోబర్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారని ఆమె న్యూయార్క్‌లోని గార్డియన్ పత్రిక కార్యాలయంలో ఇచ్చిన మొదటి మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఒక రోజు అందాల పోటీలో భాగంగా ఇచ్చిన విందులో నాకు ఎదురుగానే ట్రంప్ కూర్చున్నారు. టేబుల్ కింద నుంచి నా శరీరాన్ని తడిమేందుకు ప్రయత్నించారు. ఎంత వారించినా వినిపించుకోకపోవడంతో నేనే నిష్ర్కమించాల్సి వచ్చింది. మరోసారి ట్రంప్ తన నివాసంలోని చిన్న పిల్లల గదిలోకి తీసుకెళ్లి నన్ను గోడకు అదిమిపెట్టి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఎంత వారించినా వినిపించుకోలేదు. పక్క గదిలోనే నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి, మరికొందరు మిత్రులు ఉన్నారు. ఆరోజు ఏలాగో తప్పించుకొని బయటకు వచ్చాను. ట్రంప్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నన్ను ప్రేమిస్తున్నట్లు, నేను లేకుండా ఉండలేనంటూ ఎన్నోసార్లు ఫోన్లు చేశారు. కుదరదని చెప్పినా వినిపించుకోకుండా చాలాకాలం వేధిస్తూ వచ్చారు. నేను, నా ఫియాన్సి చేపట్టిన ప్రాజెక్టుకు ఆయన స్పాన్సర్ అవడం వల్ల ఆయన వద్దకు నేను పలుసార్లు వెళ్లాల్సి వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్‌గా ట్రంప్ తీసుకుంటూ వచ్చారు. చివరకు వేధింపులు భరించలేక న్యాయవాదిని సంప్రదించాను. ఆయన అత్యాచార యత్నం కింద కేసు పెట్టారు’ అని జిల్ వివరించారు. ఒకప్పుడు తన వెంటబడి లైంగికంగా లోబర్చుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని, అయితే పూర్వ వేధింపులను మరచిపోవడానికే ప్రయత్నించానని, ఈ అంశాన్ని మళ్లీ ఎప్పుడూ తిరగతోడేందుకు ప్రయత్నించలేదని ఆమె చెప్పారు. కానీ తాను 1997లో అత్యాచార యత్నం కింద ట్రంప్‌పై తాను దాఖలు చేసిన కేసును ఓ మీడియా తవ్వి తీయడంతో మళ్లీ ఈ అంశం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. ఎన్నో మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూల కోసం ఎగబడినా నోరు విప్పకూడదనే ఉద్దేశంతోనే వ్యవహరించానన్నారు. గత చేదు అనుభవాలను తవ్వుకుంటే నాడు పడిన మానసిక వేదనన మళ్లీ అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఇంతకాలం మౌనంగా ఉంటూ వచ్చానని ఆమె చెప్పారు. కానీ ఓ మీడియాలో వచ్చిన తన లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ట్రంప్ వివరణ ఇస్తూ తనను పచ్చి అబద్ధాల కోరుగా చెప్పడం, తన తండ్రి అలాంటి వ్యక్తి కాదంటూ ట్రంప్ కూతురు ఆయన్ని వెనకేసుకు రావడంలో సమాజం దృష్టిలో తాను చెడ్డదాన్ని అయిపోతున్నానని, అందుకనే ఇప్పుడు నోరు విప్పాల్సి వచ్చిందని జిల్ హార్త్ చెప్పారు. ‘ఓ తండ్రిని కూతురు సమర్థించడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నాపై ట్రంప్ అత్యాచారానికి యత్నించినప్పుడు ఆయన కూతురుకు పదేళ్ల వయస్సు ఉంటుంది. నాపై జరిగిన లైంగిక దాడి గురించి ఆమెకు అర్థమయ్యే వయస్సు కూడా ఆమెది కాదు. ఈ అంశం ఇప్పుడూ ఎలాగు బహిరంగమైంది. నా బెజినెస్ దెబ్బతిన్నది. నన్ను అనుమానంగా చూస్తున్నారు. కనుక ఇప్పుడు నన్ను నేను సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది. గతానుభవాన్ని తవ్వుకోవడం ఎంత బాధాకరమైనప్పటికీ సంఘంలో పరువు కోసం అసలు విషయాన్ని చెప్పక తప్పడం లేదు. పత్రికలో వచ్చిన వార్త పట్ల ట్రంప్ మౌనం పాటించి ఉన్నట్లయితే నేను కూడా మౌనంగానే ఉండేదాన్ని. ఇప్పటికి కూడా నేను ట్రంప్‌ను పెద్దగా కోరుతున్నది ఏమీ లేదు. నాటి ఆయన ప్రవర్తనకు క్షమాపణలు చెబితేచాలు. అంతకుమించి నాకు కావాల్సింది ఏమీ లేదు’ అంటూ జిల్ తన సుదీర్ఘ ఇంటర్వ్యూను సంక్షిప్తంగా ముగించారు.