‘ట్రంప్ లైంగికంగా వేధించింది అక్షరాల నిజం’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల కేసును దాఖలు చేసిన మేకప్ ఆర్టిస్ట్ జిల్ హార్త్ తన 20 ఏళ్ల మౌనాన్ని వీడి బుధవారం నాడు మొదటిసారి మీడియా ముందు నోరు విప్పారు. తాను ఏ మాత్రం అబద్ధాలకోరునుకాదని, తాను చెబుతున్నది అక్షరాల వాస్తవమని, పలు పర్యాయాలు లైంగికంగా తనను లోబర్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నించారని ఆమె న్యూయార్క్‌లోని గార్డియన్ పత్రిక కార్యాలయంలో ఇచ్చిన మొదటి మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ఒక రోజు అందాల పోటీలో భాగంగా ఇచ్చిన విందులో నాకు ఎదురుగానే ట్రంప్ కూర్చున్నారు. టేబుల్ కింద నుంచి నా శరీరాన్ని తడిమేందుకు ప్రయత్నించారు. ఎంత వారించినా వినిపించుకోకపోవడంతో నేనే నిష్ర్కమించాల్సి వచ్చింది. మరోసారి ట్రంప్ తన నివాసంలోని చిన్న పిల్లల గదిలోకి తీసుకెళ్లి నన్ను గోడకు అదిమిపెట్టి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఎంత వారించినా వినిపించుకోలేదు. పక్క గదిలోనే నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి, మరికొందరు మిత్రులు ఉన్నారు. ఆరోజు ఏలాగో తప్పించుకొని బయటకు వచ్చాను. ట్రంప్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నన్ను ప్రేమిస్తున్నట్లు, నేను లేకుండా ఉండలేనంటూ ఎన్నోసార్లు ఫోన్లు చేశారు. కుదరదని చెప్పినా వినిపించుకోకుండా చాలాకాలం వేధిస్తూ వచ్చారు. నేను, నా ఫియాన్సి చేపట్టిన ప్రాజెక్టుకు ఆయన స్పాన్సర్ అవడం వల్ల ఆయన వద్దకు నేను పలుసార్లు వెళ్లాల్సి వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్‌గా ట్రంప్ తీసుకుంటూ వచ్చారు. చివరకు వేధింపులు భరించలేక న్యాయవాదిని సంప్రదించాను. ఆయన అత్యాచార యత్నం కింద కేసు పెట్టారు’ అని జిల్ వివరించారు.
ఒకప్పుడు తన వెంటబడి లైంగికంగా లోబర్చుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని, అయితే పూర్వ వేధింపులను మరచిపోవడానికే ప్రయత్నించానని, ఈ అంశాన్ని మళ్లీ ఎప్పుడూ తిరగతోడేందుకు ప్రయత్నించలేదని ఆమె చెప్పారు. కానీ తాను 1997లో అత్యాచార యత్నం కింద ట్రంప్‌పై తాను దాఖలు చేసిన కేసును ఓ మీడియా తవ్వి తీయడంతో మళ్లీ ఈ అంశం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. ఎన్నో మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూల కోసం ఎగబడినా నోరు విప్పకూడదనే ఉద్దేశంతోనే వ్యవహరించానన్నారు.
గత చేదు అనుభవాలను తవ్వుకుంటే నాడు పడిన మానసిక వేదనన మళ్లీ అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఇంతకాలం మౌనంగా ఉంటూ వచ్చానని ఆమె చెప్పారు. కానీ ఓ మీడియాలో వచ్చిన తన లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ట్రంప్ వివరణ ఇస్తూ తనను పచ్చి అబద్ధాల కోరుగా చెప్పడం, తన తండ్రి అలాంటి వ్యక్తి కాదంటూ ట్రంప్ కూతురు ఆయన్ని వెనకేసుకు రావడంలో సమాజం దృష్టిలో తాను చెడ్డదాన్ని అయిపోతున్నానని, అందుకనే ఇప్పుడు నోరు విప్పాల్సి వచ్చిందని జిల్ హార్త్ చెప్పారు.
‘ఓ తండ్రిని కూతురు సమర్థించడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నాపై ట్రంప్ అత్యాచారానికి యత్నించినప్పుడు ఆయన కూతురుకు పదేళ్ల వయస్సు ఉంటుంది. నాపై జరిగిన లైంగిక దాడి గురించి ఆమెకు అర్థమయ్యే వయస్సు కూడా ఆమెది కాదు. ఈ అంశం ఇప్పుడూ ఎలాగు బహిరంగమైంది. నా బెజినెస్ దెబ్బతిన్నది. నన్ను అనుమానంగా చూస్తున్నారు.
కనుక ఇప్పుడు నన్ను నేను సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది. గతానుభవాన్ని తవ్వుకోవడం ఎంత బాధాకరమైనప్పటికీ సంఘంలో పరువు కోసం అసలు విషయాన్ని చెప్పక తప్పడం లేదు. పత్రికలో వచ్చిన వార్త పట్ల ట్రంప్ మౌనం పాటించి ఉన్నట్లయితే నేను కూడా మౌనంగానే ఉండేదాన్ని. ఇప్పటికి కూడా నేను ట్రంప్‌ను పెద్దగా కోరుతున్నది ఏమీ లేదు. నాటి ఆయన ప్రవర్తనకు క్షమాపణలు చెబితేచాలు. అంతకుమించి నాకు కావాల్సింది ఏమీ లేదు’ అంటూ జిల్ తన సుదీర్ఘ ఇంటర్వ్యూను సంక్షిప్తంగా ముగించారు.