మహిళలపై ఉన్నత స్థానాల్లోని వ్యక్తుల లైంగిక వేధింపుల ఉదంతాలు లెక్కకు మించి బయటపడుతున్నాయి. ‘నేను సైతం’ ఉద్యమం కాస్తా ‘మేము సైతం’ అనేంత స్థాయిలో అవి వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ‘మీ టూ’ ఉచ్చులో చిక్కుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడిన దరిమిలా ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవి మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో 54 మంది డెమోక్రటిక్ పార్టీ మహిళా కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ రాజీనామా చేయాలని, ఆయనపై వచ్చిన పలు ఆరోపణలపై కాంగ్రెస్‌తో విచారణ జరిపించాలంటూ తాజాగా డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మళ్లీ ఆరోపణల పర్వం...
సోమవారం న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్‌పై జెస్సీకా లీడ్స్, రేఛల్ క్రూక్స్, సమంతా హాల్వే అనే మహిళలు ఈ ఆరోపణల చిట్టా విప్పారు. 16మంది యువతులు ట్రంప్‌పై చేసిన ఆరోపణలతో ‘బ్రేవ్ న్యూ ఫిల్మ్స్’ సంస్థ ఒక వీడియో రూపొందించింది. తమ అనుమతి లేకుండానే చుంబించడం, సున్నిత ప్రదేశాలను తాకడం, గట్టిగా పట్టుకోవడం, స్కర్టులోపలికి చేయి జొప్పించడం వంటి అవాంఛిత చర్యలకు ట్రంప్ పాల్పడ్డాడని ఈ వీడియోలో ఆరోపించారు.
రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్...
ఈ ఆరోపణలకు ట్రంప్ రాజీనామా చేయాలంటూ డెమోక్రటిక్ సెనేటర్ కిర్‌స్టెన్ గిలీబ్రాండ్ డిమాండ్‌చేశారు. ఈ మహిళల ఆరోపణల్లో వాస్తవముందని, లెక్కకు మించి వచ్చిన ఆరోపణలపై మహిళలు ఇచ్చిన సాక్ష్యాలను తాను విన్నానని, వాటిలో చాలా ఘటనలు గుండెలు పిండేసేవిగా ఉన్నాయని బ్రాండ్ పేర్కొన్నారు. సమగ్ర విచారణ ద్వారా ఈ ఆరోపణల్లోని నిజానిజాలు తేలాలని అమెరికా ప్రజలు కోరుకుంటున్నారని డెమోక్రటిక్ ఉమెన్ వర్కింగ్ గ్రూపు అధిపతి, కాంగ్రెస్ సభ్యురాలు లూయి ఫ్రాంకెల్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలపై ఎప్పుడో విచారణ జరగాల్సి ఉందని కాంగ్రెస్ సభ్యురాలు బ్రెండా లారెన్స్ అభిప్రాయపడ్డారు.
తోసిపుచ్చిన ట్రంప్, వైట్‌హౌస్
తనపై వచ్చిన ఆరోపణలను (వీటిలో కొన్ని 1980లలో చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు) ట్రంప్ తోసిపుచ్చారు. చాలా సమయం, డబ్బు ఖర్చు చేసినా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో తాను కుమ్మక్కయినట్లు నిరూపించడంలో విఫలమైన డెమోక్రాట్లు ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. తనకు పరిచయంలేని, ఎప్పుడూ కలవని మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. ఇదంతా బూటకమని కొట్టిపారేశారు. ఇవన్నీ నిరాధారమైనవని వైట్‌హౌస్ పేర్కొంది.
ట్రంప్ హయాంలో పెరిగిన అవినీతి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశంలో అవినీతి పెరిగిందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా అవినీతిపై అధ్యయనం చేసే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ మధ్య 1,005 మందిని ఫోన్ ఇంటర్వ్యూలు చేసింది. ఈ సర్వేలో గడచిన 12 నెలల్లో అవినీతి పెరిగిందని ప్రతి 10 మందిలో 6 గురు తెలిపారు. 2016లో నిర్వహించిన సర్వేలో కేవలం ముగ్గురు మాత్రమే అవినీతి పెరిగిం దన్నారు.
వైట్‌హౌస్‌లో అవినీతి సాధారణమని 44% మంది అభిప్రాయపడగా, అవినీతిపై పోరులో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రతి 10 మందిలో ఏడుగురు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌పై ప్రజలకున్న నమ్మకాన్ని చట్టసభలకు ఎన్నికైన∙సభ్యులు తిరిగి నిలపలేకపోతున్నారని సంస్థ ప్రతినిధి జో రీటర్ అన్నారు. సభ్యులు కార్పొరేట్ లాబీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అవినీతిలో వైట్‌హౌస్ అమెరికన్ కాంగ్రెస్‌ను మించిపోయిం దన్నారు. అవినీతిని అంతం చేయటంతోపాటు కార్పొరేట్ లాబీని అదుపులో ఉంచుతానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment