Amalapuram MP
-
పండుల వారు అక్కడ ఉండరు!
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ఆయన అమలాపురం నియోజకవర్గానికి అధికార పార్టీ ఎంపీ. పేరు డాక్టర్ పండుల రవీంద్రబాబు. ఆయన అమలాపురం నుంచి ఎన్నికైనా.. ఆయన కార్యాలయం మాత్రం జిల్లా కేంద్రం కాకినాడలో ఉంటుంది. సొంత నియోజకవర్గంలో ఆయనకు స్థానిక చిరునామా లేదు. తన స్థానికతను చూపించేందుకు కనీసం కార్యాలయం కూడా లేదు. జిల్లాలోని మిగిలిన ఎంపీలైన రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, కాకినాడ ఎంపీ తోట నరసింహం లకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో సొంత కార్యాలయాలు ఉన్నాయి. సాధారణంగా ఎంపీలు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎంపీతో ప్రజలకు ఏదైనా పని పడితే వారి ఆ కార్యాలయానికి వచ్చి ఆర్జీలు ఇచ్చుకునేందుకు...ఎంపీ ఉంటే స్వయంగా కలసి తమ వినతులు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఐఆర్ఎస్ అధికారిగా ఐటీ, కస్టమ్స్ల్లో పనిచేసిన ఆయన అమలాపురం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా స్థానికత లేకుండా దిగుమతి అభ్యర్థిగానే రంగంలోకి దిగారు. ఎన్నికల్లో దిగుమతి అభ్యర్థులు రావడం..పోటీ చేయడం సాధారణమే. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత స్థానికత కోసం కాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఒకరిద్దరి ఉద్యోగులను అందుబాటులో ఉంచడం కూడా సాధారణమే. ఎంపీ రవీంద్రబాబు జిల్లాలోని మిగతా ఇద్దరి ఎంపీలతో పోల్చితే నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భాలు తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో... ప్రారంభోత్సవాల్లో ఆయన అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటారు. గత నాలుగున్నరేళ్లలో ఆయన అమలాపురంలో ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భాలు కూడా వేళ్ల మీద లెక్క కట్టేలా ఉంటాయి. గతంలో అమలాపురం ఎంపీలుగా పనిచేసిన లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సైతం వారు ఎంపీగా పనిచేసినంత కాలం అమలాపురంలో కార్యాలయాలు ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. వాస్తవానికి బాలయోగి కాకినాడలో... హర్షకుమార్ రాజమహేంద్రవరంలో ఉండే వారు. అయినప్పటికీ అమలాపురం ఎంపీలైన తర్వాత వారు అమలాపురం కేంద్రంగా కార్యాలయాలను నిర్వహించడమే కాకుండా ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ తమ కార్యాలయాల్లో కొంత సమయం ఉండేవారు. జిల్లాలో ప్రస్తుత మిగతా ఇద్దరు ఎంపీలు, గతంలో అమలాపురం ఎంపీలుగా పనిచేసిన వారు స్థానిక కార్యాలయాల్లో ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారో...ఉండేవారో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుని... పోల్చుకుంటూ చర్చించుకుంటున్నారు. తాజా వివాదంలో ఎంపీ తీరుపై చర్చోపచర్చలు ఇదిలా ఉండగా ఇటీవల ఎంపీ రవీంద్రబాబు కోనసీమ రైల్వేలైన్‌కు నిధుల సాధన సందర్భంగా ఇక్కడ రైల్వేలైన్ కోసం పోరాడిన కోనసీమ జేఏసీ ప్రతినిధులను పిట్టల దొరలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై జేఏసీ ప్రతినిధులు ప్రతి స్పందిస్తూ ఎంపీకి అల్టిమేటమ్ ఇచ్చిన విషయమూ విదితమే. ఇదే సమయంలో పార్లమెంట్ నియోజకర్గ ప్రజలు ఎంపీ పనితీరుపై గతంలో కంటే ఎక్కువగా చర్చించుకోవడం కనిపిస్తోంది. ఎంపీకి ఏదైనా వినతి పత్రం ఇవ్వాలంటే ఆయన ఎప్పుడు వస్తారు...ఎక్కడకు వస్తారు...? అనే సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. అమలాపురంలో ఆయనకు సంబంధించిన కార్యాలయం ఉంటే అక్కడకి వెళ్లి సమాచారం తెలుసుకునేవాళ్లం. కాకినాడలో కార్యాలయం ఉండడం వల్ల ఎంపీ సమాచారం చెప్పేవారే కరవవుతున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎంపీతో మరీ అత్యవసరమైన పని పడితే కాకినాడ కార్యాలయానికి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రవీంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం
సఖినేటిపల్లి : ప్రొటోకాల్‌ను విస్మరించి, తెలుగుదేశం క్యాడర్ లేకుండానే అమలాపురం ఎంపీ పండుల రవీం ద్రబాబు పర్యటిస్తున్నారని రాజోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. దీనిపై హైకమాం డ్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం అంతర్వేదిపాలెంలో సమావేశమైన నాయకులు ఎంపీ వైఖరిని ఎండగట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్యకర్తలను ఎంపీ రవీంద్రబాబు కలుపుకొని వెళ్లడంలేదన్నారు. పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా, ఇతర పార్టీల నాయకులతో కలసి ఎంపీ పర్యటిస్తున్నారని మండిపడ్డారు. దళితులు మధ్య విభేదాలకు తావిచ్చేలా ఎంపీ వ్యవహారశైలి ఉందన్నారు. ఎంపీ ఇదే పంథాలో నడిస్తే ఊరుకోబోమని అల్టిమేటం ఇచ్చారు. గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు నీటి సంఘ చైర్మన్ ఓగూరి విజయ్‌కుమార్, రాజోలు ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, వైస్ చైర్మన్ రహీం, డెరైక్టర్ కడలి నాగేశ్వరరావు, సఖినేటిపల్లి సర్పంచ్ రావి ధర్మరాజు, వైస్ ఎంపీపీ బత్తుల రవీంద్రనాథ్, మాజీ ఎంపీపీ నల్లి సుధీర్, పార్టీ మండల శాఖ అద్యక్షుడు యెనుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే'
కాకినాడ : హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు స్పందించారు. మంగళవారం కాకినాడలో రవీంద్రబాబు మాట్లాడుతూ... రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ మృతిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కులం, రాజకీయ రంగు అంటించవద్దని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలకు రవీంద్రబాబు సూచించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదు చేస్తే... ఈ వివాదం పక్కదారి పడుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దళితులు ఇంకా అణచివేతకు గురవుతున్నారనడానికి రోహిత్ ఆత్మహత్యే ఓ నిదర్శనమని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాలు
-
ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాలు
► పండులతో ఆది నుంచీ గొల్లపల్లికి విభేదాలే.. ► ఇప్పుడు అదే బాటలో అయితాబత్తుల.. ► సయోధ్యకు రాజప్ప యత్నం విఫలం! అమలాపురం: ఒకేపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైనా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేస్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. వారే టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రాజోలు, అమలాపురంల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గొల్లపల్లి సూర్యారావు, అరుుతాబత్తుల ఆనందరావు. అభివృద్ధి కోసం కలిసి పని చేయూల్సిన వారు కలహించుకుంటున్నారు. ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగిలిన ఆరు స్థానాల నుంచీ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, తోట త్రిమూర్తులు, దాట్ల బుచ్చిబాబులకు, ఎంపీ పండులకూ మధ్య సఖ్యతే ఉంది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికీ, పండులకూ నడుమ సఖ్యత లేకున్నా పొరపొచ్చాలూ లేవు. టిక్కెట్ నాటి నుంచే.. ఇక అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లిలకూ, పండులకూ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా మారింది. పలుదఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గొల్లపల్లికి పార్లమెంట్‌కు వెళ్లాలనేది చిరకాల కల. ఇందుకు తగ్గట్టే.. ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా గొల్లపల్లిని ప్రకటించారు. అరుుతే ఎన్నికలు సరిగ్గా 20 రోజులు ఉన్నాయనగా కార్పోరేట్ లాబీరుుంగ్ కారణంగా ఎంపీ టిక్కెట్ పండులకు దక్కింది. అప్పటి నుంచీ పండులపై గొల్లపల్లి వ్యతిరేకతతోనే ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా రాజోలు నియోజకవర్గంలో ఎంపీ పండుల పెత్తనం చేస్తున్నారంటూ గత నెలలో మలికిపురంలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సఖినేటిపల్లి మండలానికి టీడీపీ నాయకులు గొల్లపల్లి సమక్షంలోనే నిలదీశారు. దీనితో ఎంపీ అక్కడ నుంచి వెనుదిరిగారు. తాజాగా ఇలాంటి విషయంపైనే అమలాపురం ఎమ్మెల్యే అరుుతాబత్తులకు, ఎంపీ పండులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎంపీ తమను పట్టించుకోకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్నారని అయితాబత్తుల అనుచరుల ఆరోపణ. కాగా ఇటీవల ఓడలరేవులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీని పిలవకుండా ఆనందరావు నిర్వహించడంపై ఎంపీ అనుచరులు మండిపడుతున్నారు. వీరి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమలాపురంలో ఆదివారం ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఆనందరావులను కూర్చోబెట్టి సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితానివ్వలేదని సమాచారం. కొత్తపేట ‘దేశం’ నేతలకూ కలహమే.. పండులకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ ఇన్చార్జి బండారు సత్యానందరావులతో సైతం ఇవే విషయాల్లో విభేదాలు ఉండడం గమనార్హం. ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అవమానించినందుకు సొంతపార్టీ నేతలను ఎంపీ బహిరంగంగా తప్పుపట్టిన నాటి నుంచీ వీరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విభేదాల కారణంగా పార్టీ పరువు బజారున పడుతోందని, ఇప్పటికైనా పార్టీ పెద్దలు కలగజేసుకుని ఎంపీకి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. -
అమలాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవల తీరుపై అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయన్నారు. 'డబ్బు సంపాదన కోసం వైద్య విలువలు మరిచి.. సిగ్గూ ఎగ్గూ వదిలేసే స్థాయికి దిగజారే ఆస్పత్రులు పుట్టుకురావడం దురదృష్టకరం. చనిపోయినవారికి కూడా వెంటిలేటర్ అమర్చి డబ్బులు గుంజుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయి' అని రవీంద్రబాబు అన్నారు. ప్రభుత్వాస్పత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ ఆస్పత్రులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. దిక్కూమొక్కూలేని అనాథలు మాత్రమే ధర్మాస్పత్రులకు వెళుతున్నారు' అని ఎంపీ వ్యాఖ్యానించారు. మెజారిటీ వర్గంవారు నిర్వహించే పండుగలు, ఆర్మీ జవాన్లను ఉద్దేశించి కూడా రవీంద్రబాబు గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
వంతెన పనులను అడ్డుకుంటున్న ఎంపీ
సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :సఖినేటిపల్లి, నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి నదిపై మంజూరైన వంతెన పనులను అమలాపురం ఎంపీ హర్షకుమార్ కావాలని పనిగట్టుకుని ఆపారని రాజోలు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లూరు కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఆదివారం సఖినేటిపల్లిలో ఆయన స్వగృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం పర్యటన వల్ల ముంపు బాధిత కుటుంబాలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. సీఎం బాధితులకు తగిన సాయం ప్రకటించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు బాధితులకు వెంటనే సాయం అందజే సినట్టు ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడమే కిరణ్‌కుమార్ రెడ్డి పనిగాపెట్టుకున్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు లోపాయికారిగా కుమ్మక్కయ్యారన్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకుని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడుకు అనుమతివ్వడం దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వె ంటనే నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమంగా జగన్ చేతులుమీదుగా వంతెన పనులను ప్రారంభింపజేస్తామని ఆయన వెల్లడించారు. కేంద్రంలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నియోజకవర్గంలో సుమారు 45 వేల ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతిందని, పలు కాలనీలు ఇప్పటికీ చెరువులుగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. పార్టీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 29 కాలనీలను ముంపునీరు ముంచెత్తడం వల్ల 10వేల మంది నిరాశ్రయులయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం బాధితులకు సాయం అందించలేదని ఆయన తెలిపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కుచ్ఛర్లపాటి సూర్యనారాయణ రాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అల్లూరు రంగరాజు, మలికిపురం, మామిడికుదురు మండల శాఖల అధ్యక్షులు యెనుముల నారాయణస్వామి, బొలిశెట్టి భగవాన్, సఖినేటిపల్లి, మలికిపురం గ్రామ శాఖల అధ్యక్షులు నల్లి బాలరాజు, గంటా ప్రకాశరావు, చింతలమోరి సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, గ్రామ మాజీ సర్పంచ్ బళ్ల నోబుల్ ప్రభాకర్, నాయకులు బెల్లంకొండ సూరిబాబు, గొల్ల చంటిబాబు, గెడ్డం తులసీభాస్కర్, అడబాల పద్మకేశవరావు పాల్గొన్నారు.