Amarendar
-
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ఉంటుంది’
-
‘చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే..’
సాక్షి, హైదరాబాద్ : కాపు కార్పొరేషన్ ఎండి బదిలీపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియాలో స్పందించారు. మీడియాకు లీకులు ఇచ్చి అధికారులను బదిలీ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని ఆయన సోమవారం తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేలా బదిలీలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాపు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అమరేందర్ చాలా మంచివ్యక్తి అని, ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. అయితే అమరేందర్ ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ ప్రభుత్వంలోనే ఉన్నారని, అందుకే తాజా పరిణామాణలపై అమరేందర్ నోరు తెరవలేరన్నారు. చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఐవైఆర్ మరోసారి ధ్వజమెత్తారు. Kapu Corp MD transfer can be routine.To level allegations leak it to press hit at self esteem then remove typical Cbn strategy. — IYR Krishna Rao (@IYRKRao) 16 October 2017 కాగా ఏపీ కాపు కార్పొరేషన్ కార్యాలయంలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఎండీగా ఉన్న అమరేందర్‌ను ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించింది. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అమరేందర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే అమరేందర్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ అడ్డుకున్నారు. తనకు ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు సీఎంవో నుంచి ఆదేశాలున్నాయని అమరేందర్ చెప్పడంతో తాను కూడా ప్రెస్‌మీట్‌లోనే కూర్చుంటానంటూ రామానుజయ పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే బయటే ప్రెస్‌మీట్ పెట్టుకుంటానని అమరేందర్ వెళ్లిపోయారు. అనంతరం ఆయన కాపు కార్పొరేషన్ కార్యాలయం వెలుపల ప్రెస్‌మీట్ పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందన్నారు. -
గ్రేటర్లో సమ్మె సైరన్
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ సేవలన్నీ శుక్రవారం నుంచీ నిలిచిపోనున్నాయి. జీహెచ్ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు ఇరవైవేల మంది నిరవధికంగా విధులకు డుమ్మాకొట్టి సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా చెత్త తరలింపు.. వీధులూడ్చటం.. దోమల నివారణ మందులు చల్లడం.. తదితర సేవలన్నీ స్తంభించనున్నాయి. మునిసిపల్ పరిపాలన, పట్ణణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ మేరకు ఈ నెల 10వ తేదీ నాటికి ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనం నెలకు రూ.16,500కి పెంచాల్సి ఉండగా పెంచలేదని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, గౌరవాధ్యక్షుడు అమరేందర్‌లు విలేకరులకు తెలిపారు. మెగాసిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తదితర హామీలు అమలుకు నోచుకోనందున గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మెలో పాల్గొననున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు, పారిశుధ్య విభాగంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఈఎఫ్‌ఏలకు ఇంధన అలవెన్సు, కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, రెయిన్కోట్లు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సదుపాయాలు తదితరమైనవి యూనియన్ డిమాండ్లలో ఉన్నాయి. కొనసాగుతున్న ఇంజనీర్ల నిరసన మరోవైపు సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవమానానికి నిరసనగా జీహెచ్ఎంసీ ఇంజనీర్లు ప్రారంభించిన నిరసన కొనసాగుతోంది. గురువారం సామూహిక సెలవులతో విధులకు హాజరుకాని ఇంజనీర్లు.. శుక్రవారం సైతం సామూహిక సెలవు పెట్టి గైర్హాజరు కానున్నట్లు తెలిపారు. -
అమరేందర్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి
నంచర్ల : మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి అమరేందర్ భౌతికకాయానికి నంచర్లలో గురువారం బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.....బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. కాగా కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన అమరేందర్ బెంగళూరులోని క్యాప్ జెమినీ సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. దీపావళికని బెంగళూర్ నుంచి మంగళవారం రాత్రి బస్సులో బయలుదేరాడు. కానీ, తనవారిని చూసుకోకుండానే మధ్యలోనే మృత్యువాత పడ్డాడు. అమరేందర్‌కు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. ఆయన భార్య నర్మద ప్రస్తుతం గర్భంతో ఉంది. అమరేందర్ మరణాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడు పండుగకు రెండు రోజుల ముందే ఇంటికి వస్తున్నాడని సంబరపడిన ఆ కుటుంబానికి తీరని విషాదమే మిగిలింది.