Anando Brahma
-
తాప్సీ పాత్రలో తమన్నా
నటి తాప్సీ నటించిన పాత్రను పోషించడానికి మిల్కీబ్యూటీ తమన్నా సిద్ధం అవుతున్నట్టు తాజా సమాచారం. అపజయాల్లో కొట్టుకుపోతున్న తమన్నాకు ఇటీవల తెలుగులో నటించిన ఎఫ్ 2 చిత్ర విజయం బోలెడంత జోష్‌ను నింపిందనే చెప్పాలి. అంతేకాదు ఆ తరువాత అవకాశాలు వరుస కట్టేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలిగినట్లు, టాలీవుడ్లో సక్సెస్ వస్తే కోలీవుడ్‌లో చాన్స్‌లు వస్తున్నాయి. అదే విధంగా ఈ అమ్మడికి హర్రర్ చిత్రాలు కలిసొచ్చినట్లుంది. ఆ మధ్య ప్రభుదేవాతో రొమాన్స్ చేసిన హర్రర్ కథా చిత్రం దేవి ఓకే అనిపించుకుంది. తాజాగా దానికి సీక్వెల్‌గా అదే ప్రభుదేవాతో దేవి 2 చిత్రంలో నటించింది. ఇది నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం విశాల్‌తో సుందర్.సీ దర్శకత్వంలో చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ చిత్రం తరువాత మరో చిత్రంలోనూ విశాల్‌తో రొమాన్స్ చేయడానికి తమన్నా ఓకే చెప్పేసినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా మరో అవకాశం ఈ బ్యూటీ తలుపులు తట్టినట్లు సమాచారం. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఆనందోబ్రహ్మ చిత్రాన్ని తమిళ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలుగులో నటి తాప్సీ నటించిన పాత్రను తమన్నా పోషించబోతున్నట్లు సమాచారం. చిన్న చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఆనందోబ్రహ్మ. దీనికి దర్శకుడు మహి వీ.రాఘవ్. ఈయన ఆ తరువాత మమ్ముట్టి హీరోగా ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఇతివృత్తంతో యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విజయవంతం అవడంతో పాటు దర్శకుడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆయన ఆనందోబ్రహ్మ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సంకల్పించినట్లు, ఇందులో తమన్నాను కథానాయకిగా నటింపజేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది హర్రర్ కథా చిత్రమే కావడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
హిందీలోనూ ఆనందో బ్రహ్మ... బట్!
బీటౌన్‌లో బ్రహ్మ దేవుడు ఎవరెవరి పేర్లు రాశాడో మరి!? ఎందుకంటే... ప్రతి మెతుకు మీద తినేవాళ్ల పేరు రాసినట్టు, సినిమాలోని ప్రతి పాత్ర మీదా నటించబోయేవాళ్ల పేరు రాసి పెడుతుంటాడట బ్రహ్మ! ‘ఆనందో బ్రహ్మ’ హిందీ రీమేక్‌లో నటీనటులుగా ఎవరెవరి పేర్లు రాశాడో! ‘భయానికి నవ్వంటే భయం’.. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడితే? అనే కాన్సెప్టుతో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ తెలుగు ప్రేక్షకులందర్నీ నవ్వించి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చింది. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని చిత్రదర్శకుడు మహి వి. రాఘవ్ అనుకుంటున్నారు. ‘గోల్మాల్’ తరహాలో మాంచి మల్టీస్టారర్ సిన్మాగా చేయాలనుకుంటున్నారట! తెలుగులో హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, హిందీలో వాళ్ల పాత్రల్లో నటించే హీరోలు ఎవరెవరో? తాప్సీ పాత్రలో ఎవరు నటిస్తారో? ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ఇటీవల వచ్చిన ‘గోల్మాల్ ఎగైన్’ కాన్సెప్ట్ హారరే. ఆల్రెడీ ఈ సినిమా వందకోట్లు కలెక్ట్ చేసింది. సో, హిందీ స్టార్స్ ‘ఆనందో బ్రహ్మ’ చేసే చాన్సులు ఎక్కువే. అయితే... హిందీ ‘ఆనందో బ్రహ్మ’ కంటే ముందు తెలుగు ఓ సినిమా చేయాలని మహి వి. రాఘవ్ అనుకుంటున్నారట. ప్రస్తుతం కొత్త కథపై ఆయన వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. -
నర్సాపురంలో షకలక శంకర్ సందడి
పొందూరు(శ్రీకాకుళం) : మండలంలోని నర్సాపురంలో ఆదివారం షకలక శంకర్ సందడి చేశారు. వ్యక్తిగత పనినిమిత్తం గ్రామానికి వచ్చిన శంకర్‌తో అభిమానులు ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజుగారిగది–2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఆనందోబ్రహ్మ చిత్రం హిట్ కావడం ఆనందంగా ఉందన్నారు. -
శాటిలైట్ రైట్స్ తోనూ 'ఆనందం'
హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్ ను మలుపు తిప్పిన సినిమా ఆనందో బ్రహ్మ. తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దెయ్యాలే మనుషులకు భయపడటమనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా హర్రర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ లోనూ సత్తా చాటింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనందో బ్రహ్మా శాటిలైట్ రైట్స్ 3.25 కోట్లకు అమ్ముడయ్యాయి. 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహి వి రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. -
‘ఆనందో బ్రహ్మ’ అదరగొడుతోంది
హైదరాబాద్: తాప్సి ప్రధానపాత్రలో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్ల వారాంతపు కలెక్షన్లు సాధించింది. మొదటి రోజున రూ. 5 కోట్లు, రెండు రోజు రూ.5.5 కోట్లు, రూ. 6.5 కోట్ల వసూళ్లు తెచ్చుకుంది. మనుషులను చూసి దెయ్యం భయపడితే? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. సానుకూల సమీక్షలకు మౌత్ పబ్లిసిటీ తోడవటంతో నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తాగుబోతు రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో సుధీర్‌బాబు అతిథి పాత్రలో మెరిశారు. -
తెలుగులో నాకో హిట్ ఫిల్మ్ కావాలి
‘‘ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు హిందీలో ‘పింక్, నామ్ షబానా’ రిలీజయ్యాయి. అప్పుడు మహి ‘తాప్సీ... నీలో ఎంతో గొప్ప నటి దాగుంది. ఆ నటికి తగ్గ పాత్ర కాదిది’ అన్నారు. బదులుగా నేను ‘ముందు తెలుగులో నాకో హిట్ ఫిల్మ్ కావాలి’ అని చెప్పా (నవ్వులు). తెలుగులో నా ఫేట్ ఏం బాగోలేదు. ఐరెన్ లెగ్ ముద్ర వేసేశారు. ఈ సినిమాతో గోల్డెన్ గాళ్ అవుతాననుకుంటున్నా’’ అన్నారు తాప్సీ. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన సినిమా ‘ఆనందో బ్రహ్మ’. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, తాగుబోతు రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య తారలు. హీరో సుధీర్‌బాబు అతిథి పాత్రలో నటించారు. ఆదివారం సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదిది. పోస్టర్‌లోని ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. నాది సింపుల్ క్యారెక్టర్ అయినా సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో చేశా. కథ నచ్చితే బడ్జెట్ గురించి ఆలోచించను’’ అన్నారు తాప్సీ. ‘‘మనుషులను చూసి దెయ్యం భయపడితే? – అనేది సినిమా కాన్సెప్ట్’’ అన్నారు దర్శకుడు. ‘‘నాకు ‘ప్రేమకథా చిత్రమ్’ ఎంత పేరు తీసుకొచ్చిందో, ప్రేక్షకుల్ని ఎంత నవ్వించిందో అందరికీ తెలుసు. అంతకు మించి నవ్వించే చిత్రమిది’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘సోషల్ మీడియాలో మోషన్ పోస్టర్ విడుదల చేసిన డార్లింగ్ ప్రభాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాతలు. సినిమాటోగ్రాఫర్ అనీష్ తరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆనందో బ్రహ్మ