తెలుగులో నాకో హిట్ ఫిల్మ్ కావాలి
‘‘ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు హిందీలో ‘పింక్, నామ్ షబానా’ రిలీజయ్యాయి. అప్పుడు మహి ‘తాప్సీ... నీలో ఎంతో గొప్ప నటి దాగుంది. ఆ నటికి తగ్గ పాత్ర కాదిది’ అన్నారు. బదులుగా నేను ‘ముందు తెలుగులో నాకో హిట్ ఫిల్మ్ కావాలి’ అని చెప్పా (నవ్వులు). తెలుగులో నా ఫేట్ ఏం బాగోలేదు. ఐరెన్ లెగ్ ముద్ర వేసేశారు.
ఈ సినిమాతో గోల్డెన్ గాళ్ అవుతాననుకుంటున్నా’’ అన్నారు తాప్సీ. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన సినిమా ‘ఆనందో బ్రహ్మ’. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, తాగుబోతు రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య తారలు. హీరో సుధీర్‌బాబు అతిథి పాత్రలో నటించారు. ఆదివారం సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదిది. పోస్టర్‌లోని ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యత ఉంది.
నాది సింపుల్ క్యారెక్టర్ అయినా సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో చేశా. కథ నచ్చితే బడ్జెట్ గురించి ఆలోచించను’’ అన్నారు తాప్సీ. ‘‘మనుషులను చూసి దెయ్యం భయపడితే? – అనేది సినిమా కాన్సెప్ట్’’ అన్నారు దర్శకుడు. ‘‘నాకు ‘ప్రేమకథా చిత్రమ్’ ఎంత పేరు తీసుకొచ్చిందో, ప్రేక్షకుల్ని ఎంత నవ్వించిందో అందరికీ తెలుసు. అంతకు మించి నవ్వించే చిత్రమిది’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘సోషల్ మీడియాలో మోషన్ పోస్టర్ విడుదల చేసిన డార్లింగ్ ప్రభాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాతలు. సినిమాటోగ్రాఫర్ అనీష్ తరుణ్‌కుమార్ పాల్గొన్నారు.