భారత్‌లో జీఎస్కే మరో ఫార్మా యూనిట్
ముంబై: అంతర్జాతీయ ఔషధ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఇండియాలో మరో ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 8.5 కోట్ల పౌండ్లు(రూ. 864 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా 250 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సమావేశంలో భాగంగా ఇండియాకు వచ్చిన కంపెనీ సీఈవో ఆండ్రూ విట్టీ ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఔషధ తయారీ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసేదీ ఇంకా నిర్ణయించలేదని చెబుతూ బెంగళూరు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించారు. ఇండియాలో దీర్ఘకాలంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తమ సంస్థ ప్రజలకు చౌక ధరలలో ఔషధాలను అందించే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పారు.
దేశీయ మార్కెట్లకు ఔషధాలను అందించే ఈ ప్లాంట్ పూర్తయితే 800 కోట్ల ట్యాబ్లెట్లు, వంద కోట్ల క్యాప్సూల్స్‌ను తయారు చేయగలుగుతుందని తెలిపారు. 2017కల్లా ప్లాంట్ సిద్ధంకాగలదని భావిస్తున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంలో కంపెనీ దేశీయంగా రూ. 1,017 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ మొత్తం 8,500 మంది సిబ్బందిని కలిగి ఉంది. కంపెనీ చర్మవ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలు, వ్యాక్సిన్ల విభాగంలో ముందుంది. కంపెనీ వినియోగదారుల విభాగం సైతం హార్లిక్స్ బ్రాండ్‌తో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి, నాభా, సోనేపట్‌లో మూడు ప్లాంట్లలో వినియోగ సంరక్షణ ఉత్పత్తులు, నాసిక్‌లో రెండు ఔషధ ప్లాంట్లను కలిగి ఉంది.