నిజాయితీని కాపాడతా
' సీబీఐ కొత్త అధిపతి ఏకే సిన్హా
' సవాళ్లే అవకాశాలుగా స్వీకరిస్తానని వెల్లడి
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్‌గా నియమితుడైన ఐపీఎస్ అధికారి అనిల్‌కుమార్ సిన్హా బుధవారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు, 2జీ స్పెక్ట్రం కేసుల విషయంలో కోర్టులనుంచి సీబీఐ అభిశంసనలు ఎదుర్కొంటున్న దశలో సీబీఐ చీఫ్‌గా ఏకే సిన్హా పగ్గాలు చేపట్టారు. గతంలో 21 నెలలపాటు సీబీఐ ప్రత్యేక డెరైక్టర్ హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న సిన్హా, శారదా కుంభకోణం కేసుపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించారు.
సిన్హా నియామకంలో బిహార్‌కు చెందిన ముగ్గురు సీబీఐ డెరైక్టర్లుగా వరుసగా నియమితులయ్యారు. ఇప్పటికే సీబీఐ డెరైక్టర్లుగా పనిచేసిన రంజిత్ సిన్హా, ఏపీ సింగ్ కూడా బిహార్ అధికారులే. సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సిన్హా తన ప్రాధాన్యతలను మీడియాకు వెల్లడించారు. అతిప్రధానదర్యాప్తు సంస్థ సారథ్య బాధ్యతలను వినమ్రతతో స్వీకరించానని, సీబీఐ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటో తెలుసునని, సమర్థంగా పనిచేసేందుకు సవాళ్లే అవకాశాలన్నారు. కష్టపడి పనిచేయడం, నిష్పాక్షికత, నిజాయితీ వంటి సీబీఐ ఆశయాల కోసం కట్టుబడి ఉంటామని తెలిపారు.
సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్.. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఏకే సిన్హా, హార్వర్డ్ వర్సిటీ విద్యార్థి. గత ఏడాదిలో సీబీఐ అధికారిగా చేరిన సిన్హా, గతంలో పలు ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా, బిహార్ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. సీబీఐలో శారదా స్కాం సహా పలు ముఖ్య కేసులను పర్యవేక్షించారు. ప్రతిభావంతమైన సేవలకుగాను సిన్హాకు 2000లో పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకం లభించాయి. ఐపీఎస్ అధికారిగా 1979లో చేరిన సిన్హా 18 ఏళ్లు బిహార్‌లోని వివిధ జిల్లాలకు ఎస్పీగా, స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా ఉన్నారు. 1998-2005 మధ్య కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లి, ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) డీఐజీగా పనిచేశారు. 2005లో తిరిగి బిహార్ వెళ్లి అదనపు డీజీ హోదాలో పనిచేశారు. 2010లో తిరిగి డిప్యుటేషన్‌పై కేంద్రానికి వచ్చి విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా చేరి 2013 వరకూ కొనసాగారు. 2013 మేలో సీబీఐ స్పెషల్ డెరైక్టర్‌గా చేరారు.