Anil Shastri
-
ప్రియాంక గాంధీ అయితే ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ అయితేనే వందశాతం న్యాయం చేయగలరని మాజీ ప్రధాని లాల్బహాదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రియాంకకు అధ్యక్ష పదవి అప్పగిస్తే తనతో పాటు.. చాలామంది సీనియర్లు ఎలాంటి అభ్యంతరం తెలపరని అన్నారు. ఆమె వందశాతం సమర్థవంతంగా ఆ బాధ్యతలను నెరవేర్చగలరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురాగల సామర్థ్యాలు ప్రియాంకకు మాత్రమే ఉన్నాయని అనిల్ చెప్పుకొచ్చారు. ఆమె ఎన్నికకు పార్టీ సీనియర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని, ప్రియాంకకు పోటీగా ఎవరూ కూడా ముందుకు రారని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తీసుకున్న నిర్ణయాన్నీ తామంతా గౌరవిస్తున్నామని అనిల్ తెలిపారు. వీలయినంత త్వరలోనే అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరమే నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా కొత్త సారథ నియామకంపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రియాంక లేదా సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీలోకి కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
శాస్త్రి మరణ వివరాలు వెల్లడించాలి
చండీగఢ్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కొడుకు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాస్త్రి మరణంపై ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయనీ, వాటిని పోగొట్టాలంటే పత్రాలను బహిర్గతపరచాలని ఆయన కోరారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి: లెసన్స్ ఇన్ లీడర్షిప్’ అనే పుస్తకం పంజాబీ అనువాదం విడుదల సందర్భంగా శుక్రవారం అనిల్ శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిలో ఉండగానే 1966 జనవరి 11న తాష్కెంట్లో లాల్‌బహదూర్ శాస్త్రి మరణించారు. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని ప్రకటించగా ఏదో కుట్ర జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు రహస్యమైనవంటూ గత ప్రభుత్వం వాటిని బహిర్గతపరచలేదని అనిల్ శాస్త్రి పేర్కొన్నారు. -
నోట్ల రద్దు నష్టం రూ.1.28 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వంపై ఉత్తమ్ ధ్వజం ► మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని మండిపాటు ►ఆర్బీఐ కార్యాలయం ఎదుట టీ పీసీసీ ధర్నా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అపార నష్టం కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్ శాస్త్రి మండిపడ్డారు. మోదీ సర్కారు అనాలోచిత, మూర్ఖపు, పిచ్చి తుగ్లక్ నిర్ణయం వల్ల అన్ని రంగాలకు దాదాపు రూ. 1.28 లక్షల కోట్ల నష్టం కలిగిందన్నారు. నోట్ల రద్దును నిరసిస్తూ హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట టీ పీసీసీ శుక్రవారం ధర్నా నిర్వహించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు కాంగ్రెస్ సీనియర్లంతా ధర్నాలో పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. దేశంలో 86 శాతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రధాని తన నిర్ణయంతో ఆర్బీఐపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బ తీశారని విమర్శించారు. ఈ నిర్ణయం తర్వాత 138 సార్లు నగదు డిపాజిట్లు, ఉపసంహరణల నిబంధనలను మార్చారన్నారు. నగదు కోసం బ్యాంకుల వద్ద కూలైన్లలో నిలబడి దాదాపు 120 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారని, ఇందుకు బాధ్యత వహించి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మాట మార్చిన మోదీ... పెద్ద నోట్ల రద్దు జాతీయ స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, రబీలో సాగు విస్తీర్ణం చాలా వరకు పడిపోయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోగా, నిజాయితీపరులే నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోవడంతో ప్రధాని మోదీ నగదు రహిత, డిజిటల్ లావాదేవీలంటూ కొత్తరాగం అందు కున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో నోట్ల మార్పిడి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు నోట్లను మార్చుకోవాలనుకుంటే నాగపూర్, చెన్నై ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లాలని బ్యాంకులు చెబుతున్నా యని...దీనిపై సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నోట్ల రద్దును తొలుత దిక్కుమాలిన నిర్ణయంగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత మాటమా ర్చడంలో మతలబు ఏమిటో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు ఆర్.సి.కుంతియా, జి.చిన్నారెడ్డి, వి.హన్మంతరావు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మా రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, రంగారెడ్డి, నేతలు నేరెళ్ల శారద, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, బండ కార్తీకరెడ్డి పాల్గొన్నారు. నష్టపోతున్నామంటూ కేంద్రానికి మద్దతేల? పెద్ద నోట్ల రద్దు వల్ల రుణమాఫీ చేయలేకపోతున్నా మని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేకపోతున్నా మని, ఆదాయం పడిపోయిందని చెబుతున్న కేసీఆర్... మోదీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతిస్తున్నారని ఉత్తమ్, నోట్ల రద్దు వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దును దిక్కుమాలిన నిర్ణయమంటూ అసహనం ప్రదర్శించిన కేసీఆర్... ఉన్నఫళంగా వైఖరిని ఎందుకు మార్చుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అసలు రహస్యం ఏమిటో ప్రజలే చర్చించుకుంటున్నారని చెప్పారు. పేద మహిళల ఖాతాల్లో రూ. 25 వేలు డిపాజిట్ చేయాలి: అనిల్‌శాస్త్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్ శాస్త్రి మాట్లాడుతూ విదేశీ కంపెనీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి, దేశంలోని బడా కంపెనీలను బాగుచేయడానికే మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో నష్టపోయిన ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు బ్యాంకులో వేసుకున్న నగదును ఉపసంహరించుకోవడానికి పరిమితు లను తొలగించాలని డిమాండ్ చేశారు. పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేల చొప్పున జమ చేయాలని కోరారు. అలాగే ఉపాధి హామీ చట్టం కూలీ రేట్లు పెంచాలని, పని దినాలను రెట్టింపు చేయాలని, చిరు వ్యాపారులకు పన్ను మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. 27న జన ఆవేదన సమ్మేళనం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి తెలియ జేప్పేందుకు ఈ నెల 27న సికింద్రాబాద్‌లో భారీగా జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. నోట్ల రద్దుపై టీపీసీసీ ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం గాంధీ భవన్ లో సమావేశమైంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ముఖ్య నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. -
నేతాజీ వివాదం ముగియకముందే..
న్యూఢిల్లీ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం.. మరణం.. లాంటి విషయాలకు సంబంధించి పశ్చిమబెంగాల్ విడుదల చేసిన డాక్యుమెంట్లపై వివాదాలు, భిన్నాభిప్రాయాలు సమసిపోకముందే మరో అంశం తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. తన తండ్రి, మాజీ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి మృతికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్.. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని, దానిపై ప్రభుత్వం స్పందిస్తే నిజనిజాలు బయటపడతాయన్నారు. సుమారు 50 ఏళ్ల కిందట తాష్కెంట్(జనవరి 11, 1966) లో జరిగిన శాస్త్రి మృతి ఘటనపై ఇప్పటికీ సందేహాలు అలాగే ఉండిపోయాయని అనిల్ ప్రస్తావించారు. శాస్త్రి మృతికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలంటూ గతంలో బీజేపీ డిమాండ్ చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు. స్వదేశానికి తీసుకువచ్చిన తండ్రి మృతదేహంపై ఉన్న కొన్ని గుర్తులు, మరకలు ఆయన మృతిపై పెను అనుమానాలకు దారితీసిందని చెప్పారు. మాజీ ప్రధాని మరో కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది ప్రధానులను ఈ విషయాలకు సంబంధించిన ఫైళ్లను అందించాలని కోరినట్లు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ మృతిపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొన్ని కీలక డాక్యుమెంట్లను విడుదల చేసిన వారం రోజుల్లోనే మరో వివాదాస్పాద అంశం తెరమీదకు వచ్చింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే తన తండ్రి గురించిన సమాచారం కోసం ప్రధానికి లేఖ రాయనున్నట్లు అనిల్ శాస్త్రి వెల్లడించారు. -
'మా నాన్నది సహజ మరణం కాదు'
భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రిది సహజ మరణం కాదని, మరణించేసరికి ఆయన ముఖం నీలంగా మారి ఉందని, ఆయన డైరీ కూడా కనిపించలేదని చెప్పారు. తాష్కెంట్లో శాస్త్రీజీ ఉన్న గదిలో బెల్ గానీ, టెలిఫోన్ గానీ లేవని.. ఆయనకు కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందలేదని అనిల్ శాస్త్రి ఆరోపించారు. అప్పట్లో అక్కడి భారత రాయబార కార్యాలయ వర్గాలు నిర్లక్ష్యంగా వహించాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం శాస్త్రీజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని, ఆయన మృతిపై ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని అనిల్ శాస్త్రి డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుత ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ నగరంలో 1966 జనరి 11వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. -
శాస్త్రి అంకితభావం అపూర్వం
న్యూఢిల్లీ: భారత్ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అంకితభావం అపూర్వమని టిబెటన్ మతగురువు దలైలామా కొనియాడారు. ఆయన మరికొన్ని రోజులు బతికిఉంటే దేశానికి మరింత సేవ చేసేవారని పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘లాల్ బహదూర్ శాస్త్రి: లెస్సన్ ఇన్ లీడర్షిప్’ పేరుతో శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, పవన్ చౌదరి సంయుక్తంగా రాసిన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘శాస్త్రి చాలా అంకితభావంతో దేశం కోసం పనిచేశారు. ఆయన మరికొన్ని సంవత్సరాలు బతికి ఉంటే దేశాభివృద్ది కోసం మరింత సేవ చేసేవారు. 1965లో పాక్‌తో యుద్ధం జరిగిన సమయంలో ఆయన చాలా ధైర్యంగా వ్యవహరించారు. భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు ఆయన ప్రతినిధిగా కనిపించేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయనలోని అంకితభావాన్ని చాలా దగ్గరగా చూశాను. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. ప్రధానిగా ఉన్న సమయంలోనే నేను శాస్త్రిని కలిశాను. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని భావించే వ్యక్తి. ఎదుటివారి పట్ల దయ, జాలి చూపే హృదయం ఆయన సొంతం. చిన్నప్పుడు నేనో పుస్తకాన్ని కొనుక్కున్నాను. అది నా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అలాగే తండ్రి జీవితాన్ని అనిల్‌శాస్త్రి మనకు పుస్తకంగా అందిస్తున్నారు. ఇది ఎందరికో స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానన్నారు.