సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ అయితేనే వందశాతం న్యాయం చేయగలరని మాజీ ప్రధాని లాల్‌బహాదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రియాంకకు అధ్యక్ష పదవి అప్పగిస్తే తనతో పాటు.. చాలామంది సీనియర్లు ఎలాంటి అభ్యంతరం తెలపరని అన్నారు. ఆమె వందశాతం సమర్థవంతంగా ఆ బాధ్యతలను నెరవేర్చగలరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురాగల సామర్థ్యాలు ప్రియాంకకు మాత్రమే ఉన్నాయని అనిల్ చెప్పుకొచ్చారు. ఆమె ఎన్నికకు పార్టీ సీనియర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని, ప్రియాంకకు పోటీగా ఎవరూ కూడా ముందుకు రారని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తీసుకున్న నిర్ణయాన్నీ తామంతా గౌరవిస్తున్నామని అనిల్ తెలిపారు. వీలయినంత త్వరలోనే అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరమే నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా కొత్త సారథ నియామకంపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రియాంక లేదా సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీలోకి కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment