animal care center
-
కుక్క పిల్ల అని తెచ్చుకుంటే..
బనశంకరి: రోడ్డు మీద కనిపించిన కుక్క పిల్లని ఇంటికి తెచ్చి పాలు పెరుగు పెట్టారు. తరువాత అది నక్క పిల్ల అని తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల బెంగళూరు బనశంకరికి చెందిన వ్యక్తి వీధిలో దొరికిన కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. మామూలుగా దానికి పాలు, పెరుగు పెట్టారు. అవి తినడంతో అది అనారోగ్యానికి గురై నాలుగురోజుల పాటు ఇంట్లో మూలుగుతూ ఇబ్బంది పడింది. దాని అరుపులు విన్న ఇరుగుపొరుగువారు ప్రాణి సంరక్షకులను ఫోన్ చేశారు. కుక్కపిల్ల వీడియో పంపాలని వారు కోరగా వారు అలాగే చేశారు. దానిని పరిశీలించి అది కుక్క కాదు నక్క అని తేల్చారు. పోలీసులు వచ్చి నక్క పిల్లను తీసుకుని కెంగేరి వద్ద గల జంతు సంరక్షణాలయానికి తరలించారు. కాగా నగరంలో జనావాసాల్లోకి నక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా ఉంది. (చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం) -
మూర్ఖుడి వెంట మూగజీవి పరుగులు
ప్రేమ, ద్వేషం, స్వార్థం, మోసం.. ఇవన్నీ భూమ్మీద తెలివైన ప్రాణిగా పేరున్న మనిషికి మాత్రమే సొంతం. కానీ, మూగ జీవాలు అలా కాదు. ఇంత తిండి పెడితే చచ్చేదాకా విశ్వాసం చూపెడుతుంటాయి. అలాంటిది ఓ ఫ్రెండ్లీ యానిమల్‌ను వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఒక మూర్ఖుడు. మరి జంతు ప్రేమికులు ఊరుకుంటారా?.. ఆస్టీన్: టెక్సాస్‌లోని ఎల్ పాసో సిటీకి చెందిన లూయిస్ అంటోనియో కాంపోస్(68) కుటుంబం కొన్నేళ్లుగా ఓ హస్కీని పెంచుకుంటున్నాడు. అయితే దానిని అనవసరంగా మేపుతున్నాననే ఉద్దేశానికి ఈమధ్య వచ్చాడతను. తన డ్రైవర్ సాయంతో దానిని దూరంగా తీసుకెళ్లాడు. ఆ పెంపుడు హస్కీ మెడకు ఉన్న బెల్ట్‌ను తొలగించగా.. వెంటనే కారులోకి వచ్చేయ్మని లూయిస్ తన డ్రైవర్‌కి సైగ చేశాడు. పాపం.. యజమాని అలా వదిలి వెళ్తుండడంతో ఆ మూగ జీవి భయపడిపోయింది. ఆ కారు వెంట చాలా దూరం పరుగులు తీసింది. అయితే అక్కడే ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఆ మొత్తాన్ని వీడియో తీశాడు. యానిమల్ షెల్టర్ వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి ఆ శునకాన్ని రక్షించడం.. 24 గంటలు గడవక ముందే ఓ మంచి కుటుంబం దానిని దత్తత తీసుకోవడం జరిగిపోయాయి. Husky seen running after car when he’s abandoned and is saved, Texas man is arrested and charged with animal cruelty. (Via IG: ms.mojorising_) pic.twitter.com/JmwbdZnS3w — Dallas Texas TV (@DallasTexasTV) July 24, 2021 ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయ్యింది. అది చూసి లూయిస్‌ను, అతని డ్రైవర్‌ను తిట్టని వాళ్లంటూ లేరు. అతన్ని శిక్షించాలని పోలీసులను ట్యాగ్ చేశారు. దీంతో వీడియో ఆధారంగా కారు నెంబర్ ట్రేస్ చేశారు ఎల్ పాసో పోలీసులు. లూయిస్‌ను మూగజీవాల్ని హింసించిన నేరం కింద అరెస్ట్ చేశారు. ఐదు వేల డాలర్ల ఫైన్‌తో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష కూడా విధించింది కోర్టు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు ఎల్ పాసో పోలీసులు. -
కుక్కలకూ ఓ సంరక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు అనాథలు, వృద్ధులు, మహిళలకు మాత్రమే సంరక్షణ కేంద్రాలను చూశాం. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో కోతులు, పశువులు, కుక్కలకు కూడా ఒక ఆధునిక సంరక్షణ కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలోని మరే ఇతర నగరాల్లో లేని విధంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈస్ట్ జోన్‌లోని ఫతుల్లాగూడలో జీహెచ్ఎంసీకి చెందిన 45.72 ఎకరాల ప్రదేశంలోని ఐదెకరాల స్థలంలో ఈ యానిమల్ కేర్ సెంటర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.7 కోట్లతో పనులు.. యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జీహెచ్ఎంసీ ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనుల్ని చేపట్టింది. ఈ కేంద్రంలో జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో పట్టే వీధికుక్కలతో పాటు ప్రజల ఫిర్యాదుల మేరకు ఆయా ప్రాంతాల్లో పట్టే కోతులు, అదుపులోకి తీసుకునే పశువులను ఉంచేందుకు షెల్టర్లు నిర్మిస్తున్నారు. వీటితోపాటు కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సల కేంద్రం, పరిపాలన భవనం, తదితరమైన వాటితో బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ. 7 కోట్లు కాగా, ప్రహరీకి దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రూ. 5 కోట్లతో ఆయా భవనాల్ని నిర్మిస్తున్నారు. కాంప్లెక్స్‌లో.. ఒక కోతుల షెల్టర్, ఒక పశువుల షెల్టర్‌తో పాటు రెండు కుక్కల షెల్టర్లు, ప్రిపరేషన్ అండ్ ఆపరేషన్ బ్లాక్, సెక్యూరిటీ సిబ్బంది గది, కిచెన్ తదితరమైన పనులు జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీ కృష్ణారావు తెలిపారు. మరో మూడు నాలుగు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. కాంప్లెక్స్‌లో విశాలమైన రహదారులతోపాటు పచ్చని లాన్ తదితర ఏర్పాట్లు చేస్తారు. అటవీ అధికారుల సూచన మేరకు ఆయా ప్రాంతాల్లోని కోతుల్ని పట్టుకొచ్చి.. కొన్ని రోజుల పాటు వాటిని ఇక్కడ సంరక్షిస్తారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలి వేస్తామని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. దాదాపు 200 కోతులతోపాటు 50 పశువుల సంరక్షణకు ఈ కేంద్రంలో ఏర్పాట్లు ఉంటాయన్నారు. రూ. 2.5 కోట్లతో బయోగ్యాస్ జంతు శ్మశాన వాటిక.. జంతు సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఆధునిక బయోగ్యాస్ ఆధారిత జంతు శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్లో మృతి చెందిన కుక్కలు, పశువులు తదితర జంతువుల కోసం జంతు శ్మశాన వాటిక అవసరమని గుర్తించిన జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ఏర్పాటుకు దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కానుందని సంబంధిత అధికారి తెలిపారు. -
ఖేడ్ లో పశు షెల్టర్
♦ నేడు ప్రారంభం ♦ రెండు నెలల పాటు 2వేల పశువులకు వసతి ♦ దక్షిణ భారతదేశంలోనే మొదటిది.. ♦ పశు సంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి జోగిపేట: వేసవి కాలంలో పశు సంపదను కాపాడుకునేందుకు పశు సంవరక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్టు ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నల్లవాగు ప్రాంతంలో శుక్రవారం ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటిదన్నారు. సంరక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు 2వేల పశువులకు సరిపడా వసతులను కల్పించనున్నామని తెలిపారు. పశువులకు గడ్డి, నీరు, రైతులకు వసతి, ఉచితంగా భోజనం, ఇతర సదుపాయాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు హాజరవుతున్నారని చెప్పారు.