ఆధునిక యానిమల్ కేర్ సెంటర్ నమూనా
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు అనాథలు, వృద్ధులు, మహిళలకు మాత్రమే సంరక్షణ కేంద్రాలను చూశాం. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో కోతులు, పశువులు, కుక్కలకు కూడా ఒక ఆధునిక సంరక్షణ కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలోని మరే ఇతర నగరాల్లో లేని విధంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈస్ట్ జోన్‌లోని ఫతుల్లాగూడలో జీహెచ్‌ఎంసీకి చెందిన 45.72 ఎకరాల ప్రదేశంలోని ఐదెకరాల స్థలంలో ఈ యానిమల్ కేర్ సెంటర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
రూ.7 కోట్లతో పనులు..
యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జీహెచ్‌ఎంసీ ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనుల్ని చేపట్టింది. ఈ కేంద్రంలో జీహెచ్‌ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో పట్టే వీధికుక్కలతో పాటు ప్రజల ఫిర్యాదుల మేరకు ఆయా ప్రాంతాల్లో పట్టే కోతులు, అదుపులోకి తీసుకునే పశువులను ఉంచేందుకు షెల్టర్లు నిర్మిస్తున్నారు. వీటితోపాటు కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సల కేంద్రం, పరిపాలన భవనం, తదితరమైన వాటితో బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ. 7 కోట్లు కాగా, ప్రహరీకి దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రూ. 5 కోట్లతో ఆయా భవనాల్ని నిర్మిస్తున్నారు.
కాంప్లెక్స్‌లో..
ఒక కోతుల షెల్టర్, ఒక పశువుల షెల్టర్‌తో పాటు రెండు కుక్కల షెల్టర్లు, ప్రిపరేషన్ అండ్ ఆపరేషన్ బ్లాక్, సెక్యూరిటీ సిబ్బంది గది, కిచెన్ తదితరమైన పనులు జరుగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీ కృష్ణారావు తెలిపారు. మరో మూడు నాలుగు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. కాంప్లెక్స్‌లో విశాలమైన రహదారులతోపాటు పచ్చని లాన్ తదితర ఏర్పాట్లు చేస్తారు. అటవీ అధికారుల సూచన మేరకు ఆయా ప్రాంతాల్లోని కోతుల్ని పట్టుకొచ్చి.. కొన్ని రోజుల పాటు వాటిని ఇక్కడ సంరక్షిస్తారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలి వేస్తామని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. దాదాపు 200 కోతులతోపాటు 50 పశువుల సంరక్షణకు ఈ కేంద్రంలో ఏర్పాట్లు ఉంటాయన్నారు.
రూ. 2.5 కోట్లతో బయోగ్యాస్ జంతు శ్మశాన వాటిక..
జంతు సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఆధునిక బయోగ్యాస్ ఆధారిత జంతు శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌లో మృతి చెందిన కుక్కలు, పశువులు తదితర జంతువుల కోసం జంతు శ్మశాన వాటిక అవసరమని గుర్తించిన జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్ శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ఏర్పాటుకు దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కానుందని సంబంధిత అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment