కుక్కల దాడిలో బుధవారం గాయపడిన రూప
విజృంభిస్తున్న కుక్కలు
గ్రేటర్‌లో నెలకు సగటున వెయ్యికిపైగా కేసులు
ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రుల్లో రద్దీ
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. వీధుల్లో... రోడ్లపై గుంపులుగా తిరుగుతూ జనంపై విరుచుకు పడుతున్నాయి. రోజూ పెద్ద సంఖ్యలో వీటి బారిన పడుతున్న నగర వాసులు ఆస్పత్రుల పాలవుతున్నారు. మండుతున్న ఎండలకు తోడు కడుపు నిండా తిండి, మంచినీరు దొరక్కపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. సాయంత్ర వేళ వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారుల పైనే కాదు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారినీ వెంబడిస్తున్నాయి.
బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని సిరినగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థునులపై దాడి చేసింది. ఇలా శివారు ప్రాంతాల నుంచే కాదు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా వస్తున్న కుక్క కాటు బాధితులతో ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు సగటున 30-35 కుక్క కాటు కేసులు నమోదవుతుండగా... ఇటీవల ఈ సంఖ్య రెట్టింపైంది.
ఇవీ వ్యాధి లక్షణాలు
కుక్క కాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి దశలో జ్వరం, తల నొప్పి, వాంతులు... రెండో దశలో పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించ లేకపోవడం... నోరులోంచి నురగ రావడం... గొంతు పట్టేయడం... ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కోమాలోకి వెళ్లి, రెండు, మూడు రోజుల్లో మృత్యువాత పడుతుంటారు.
బస్తీల్లో బంధించి... శివారులో వదిలేసి...
జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కల సంఖ్య మూడు లక్షలు దాటినట్లు ఓ అంచనా. పొరుగు ప్రాంతాల నుంచి న గరానికి వస్తున్న వాటి సంఖ్య తగ్గకపోవడం.. బస్తీల్లో పట్టినవి శివారు ప్రాంతాల్లో వదులుతుండటంతో అవి తిరిగి వస్తున్నాయి. ఆకలితో చెత్త కుప్పల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు తిని ఇరిటేషన్‌కు గురవుతున్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు (స్టెరిలైజేషన్) చేసేందుకు ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్‌చెరులో కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఏటా దాదాపు 80 వేల కుక్కలకు టీకాలు, ప్రతి నెలా రెండు వేల కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నా వీటి సంఖ్య తగ్గకపోవడం గమనార్హం.
దూరంగా ఉండడమే ఉత్తమం
- వీధి కుక్కలను సాధ్యమైనంత వరకు నియంత్రించాలి.
- ఒక వేళ కుక్క కరిస్తే... వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి.
- రక్తం కారుతున్నా... గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పోయకూడదు.
- వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
- కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి.
- ఇంట్లో ఉన్న కుక్కలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి.
- వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతంలో తిరగకపోవడమే మంచిది.
- డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి