నితీష్‌తో భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం మమతా కీలక వ్యాఖ్యలు
లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన నేడు(సోమవారం) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పశ్చిమబెంగాల్ సచివాలయానికి చేరుకున్న ఆయన.. దీదీతో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు.
ఈ భేటీ అనంతరం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి ఇగో(అహం) లేదని స్పష్టం చేశారు. అందరం కలిసి సమష్టిగా ముందుకు వెళ్తామని తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా జరగనున్నాయని, ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి రావడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.
చదవండి: ‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’
నితిష్ కుమార్‌ను తను ఒక్కటే అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ ఉద్యమం ప్రారంభించిన బిహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మన తదుపరి కార్యచారణ ఏంటో నిర్ణయించుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. అయితే ముందుగా మనం ఐక్యంగా ఉన్నామనే సందేశం ప్రజలకు చేరాలని ఇందులో తనకేం అభ్యంతరం లేదని చెప్పారు. ‘బీజేపీని జీరో చేయడమే నాకు కావాలి. మీడియా సపోర్టు, అబద్ధాలతో వారు హీరోలయ్యారు’ అని మమతా పేర్కొన్నారు.
అయితే ఇటీవల లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య అరుదైన ఐక్యత చోటు చేసుకుంది. అనంతరం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌ల భేటీతో బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా దాదాపు అన్ని పార్టీల నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు నితీష్.
బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకు సాగేందుకు విపక్షాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశయ్యారు. మమతాతో భేటీ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ కుమార్‌తో కూడా చర్చలు జరపనున్నారు.
చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి