Anti-farmer policies
-
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టండి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న మోదీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు పెంచిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేంద్రమేనన్నారు. కేంద్రం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలతో తెలంగాణ రైతుల జేబుకు చిల్లుపడిందన్నారు. దేశంలోని బీజేపీ పాలనలో కొత్త కొలువులు రాకపోగా...ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బీజేపీ ప్రభుత్వం పెను ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు. కేంద్రం పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్, ధరలను తగ్గించే వరకు ప్రజలు పోరాటాలకు సిద్దం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. -
మోదీ దళిత, గిరిజన వ్యతిరేకి
న్యూఢిల్లీ: బీజేపీ సిద్ధాంతాలపై జీవితాంతం పోరాటం చేస్తూనే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు నేడు భారతీయులంతా బీజేపీ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. ‘ప్రధాని మోదీకి కొన్ని కులాలంటే అభిమానం. ఆయన దళిత వ్యతిరేకి. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 2019 ఎన్నికల్లో వారి సిద్ధాంతాన్ని ఓడించి తీరతాం. మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు.. తమ విధానాలను వ్యతిరేకిస్తున్నందుకు విపక్షనేతలను జంతువులతో పోల్చారు. కానీ నేడు.. ప్రతి భారతీయుడు దళిత–గిరిజన–మైనారిటీ–రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు’ అని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుల, మత ఘర్షణలను నిరసిస్తూ, పార్లమెంటు సరిగా నడవకపోవటంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘సద్భావన ఉపవాస్’ పేరుతో దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, ఖర్గే, షీలా దీక్షిత్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, సుర్జేవాలా తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 1984 సిక్కు అల్లర్లలో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు సజ్జన్ కుమార్, జగదీశ్ టైట్లర్‌లను ఈ కార్యక్రమ వేదికపైకి రావొద్దని పార్టీ నాయకులు సూచించారు. దీంతో సజ్జదీక్షాస్థలి నుంచి వెళ్లిపోయారు. టైట్లర్ పార్టీ కార్యకర్తల నడుమ కూర్చున్నారు. అటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. కాంగ్రెస్ దీక్ష హాస్యాస్పదమని బీజేపీ ఎద్దేవా చేసింది. సిక్కు అల్లర్ల కేసులో దోషులైన జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లను వేదికపైకి రాకుండా ఆపటం.. కాంగ్రెస్ నాడు చేసిన పాపాన్ని అంగీకరించినట్లేనని పేర్కొంది. విభజించి పాలిస్తున్నారు బీజేపీ దళిత ఎంపీలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. దేశాన్ని విభజించటం, దళితులు, గిరిజనులను అణచివేయటమే బీజేపీ విధానమని ఆయన ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును స్తంభింపజేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కావేరీ బోర్డు ఏర్పాటు, పీఎన్బీ కుంభకోణం, సీబీఎస్ఈ పేపర్ లీక్, ఎస్సీ–ఎస్టీ చట్టం తదితర అంశాలపై చర్చించాలనుకున్నా.. బీజేపీ అడ్డుకు ందని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి: బీజేపీ కాంగ్రెస్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ‘రాహుల్ నేతృత్వంలో నేడు జరిగింది ఉపవాస దీక్ష కాదు, హాస్యాస్పద దీక్ష. రాహుల్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ ఆయనను గొప్పగా చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన కార్యక్రమమే ఇది. దీక్ష అంటే ఉపవాసం.. కానీ అక్కడ హాజరైన కాంగ్రెస్ నేతలంతా దీక్షకు ముందు ఛోలా బటూరే (పూరీ, శనగల కర్రీ)లు తిన్నారు. ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి’ అని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.మిర్చ్‌పూర్, గోహానా, జజ్జర్లలో దళిత వ్యతిరేక అల్లర్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. కర్ణాటకలో గత ఐదేళ్లలో దళితులపై 9080 కేసులు నమోదు అయ్యాయని.. 358 మంది దళితులను చంపేశారని సంబిత్ పాత్రా ఆధారాలు చూపించారు. అసలు దళిత వ్యతిరేకి కాంగ్రెస్సేనన్నారు. దీక్షకు ముందు కాంగ్రెస్ నేతలు పూరీ తింటున్నారంటూ బీజేపీ నేత ట్వీట్ చేసిన ఫొటో -
రైతు వ్యతిరేకి.. టీఆర్ఎస్ ప్రభుత్వం
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సహకార బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణలు మండిపడ్డారు. మంగళవారం అబిడ్స్ రోడ్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో రైతు రుణాల మంజూరులో సహకార బ్యాంకుల నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే అని అన్నారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. 25 శాతం రుణమాఫీ చేసి మిగతాది దశలవారీగా చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. రైతులకు విడతలవారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ... రైతులకు సకాలంలో రుణమాఫీ చేసి రబీ సీజన్లో కొత్త రుణాలందించాలన్నారు. రైతులకు రూ.17వేల కోట్ల రుణాలు అందిస్తామని, కనీసం రూ.5వేల కోట్లు కూడా అందించలేకపోవడం విచారకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీమంత్రి పెద్దిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఎ.గాంధీ, చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ధర్నా చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌చేసి అబిడ్స్ పీఎస్‌కు తరలించారు. -
జెండా, అజెండా పక్కనపెట్టి..
‘10న బంద్’పై ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు హైదరాబాద్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ఉమ్మడిగా విజయవంతం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జెండా, అజెండా పక్కనబెట్టి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు బంద్‌పై దృష్టి సారించాయి. ఈ మేరకు ఆ పార్టీల నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం శాసనసభ ఆవరణలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నందున ప్రజలు కూడా పూర్తిగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు రుణమాఫీని ఏక మొత్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు జీవితంపై నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రోజుకు పది మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం మినహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం, రైతు సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. అఖిల పక్షాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్య, వ్యాపార, రవాణా సంస్థలకు పిలుపునిచ్చారు. -
ప్రభుత్వాల వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకోవటంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, దీని ఫలితమే రైతుల ఆత్మహత్యల పరంపర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై ఆదివారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు భరోసా కల్పించే ఏకైక పార్టీ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్ సీపీ) మాత్రమే అని, రైతులను ఆదుకోవటం, సహాయం అందించటంతో పాటు అన్ని విషయాల్లో తాము అండగా ఉం టామని అన్నారు. రెండు రాష్ట్రాల్లోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట వందలాది మంది రైతులతో కలసి వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు ఆయా జిల్లాల రైతుల స్థితిగతులపై నివేదికలు సమర్పిస్తామన్నారు. 19న హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మని కలసి రైతుల దీనస్థితిపై వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 421 జీవో ప్రకారం ఆనాటి ధరలకు అనుగుణంగా రూ.లక్షా యాభై వేలు అందేలా చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని పొంగులేటి చెప్పారు. సమస్యలకు, ఆర్థిక బాధలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. రైతులకు మంచిరోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీనే అని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని కేసీఆర్ పలు సభల్లో చెప్పారని పొంగులేటి గుర్తుచేశారు. రుణమాఫీ ఒకేసారిగా కాకుండా నాలుగు విడతలుగా చేస్తున్నారని, ప్రతి విడతలోనూ ఇచ్చిన రూ. 25 వేలు వడ్డీకే సరిపోతోందని, రుణం మాత్రం అలాగే ఉండిపోవటంతో పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు చనిపోవటానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో రెండుసార్లు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నామన్నారు. ఈ సమయంలో రైతులకు సహాయ సహకారాలు అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వరంగల్ పరామర్శ యాత్రలో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా వైఎస్సార్‌నే తలచుకొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, నాయకులు నర్రా బిక్షపతి, మతిన్ బై, మామిడి శ్యాంసుందర్ రెడ్డి, వీఎల్ఎన్ రెడ్డి, మాదిరెడ్డి భగవంత్ రెడ్డి, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, భీష్వ రవీందర్, ఆరె లింగారెడ్డి పాల్గొన్నారు.