ప్రభుత్వాల వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకోవటంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, దీని ఫలితమే రైతుల ఆత్మహత్యల పరంపర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై ఆదివారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.
రైతులకు భరోసా కల్పించే ఏకైక పార్టీ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్ సీపీ) మాత్రమే అని, రైతులను ఆదుకోవటం, సహాయం అందించటంతో పాటు అన్ని విషయాల్లో తాము అండగా ఉం టామని అన్నారు. రెండు రాష్ట్రాల్లోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట వందలాది మంది రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టనుందని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్లకు ఆయా జిల్లాల రైతుల స్థితిగతులపై నివేదికలు సమర్పిస్తామన్నారు. 19న హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మని కలసి రైతుల దీనస్థితిపై వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 421 జీవో ప్రకారం ఆనాటి ధరలకు అనుగుణంగా రూ.లక్షా యాభై వేలు అందేలా చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని పొంగులేటి చెప్పారు. సమస్యలకు, ఆర్థిక బాధలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. రైతులకు మంచిరోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీనే అని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని కేసీఆర్ పలు సభల్లో చెప్పారని పొంగులేటి గుర్తుచేశారు.
రుణమాఫీ ఒకేసారిగా కాకుండా నాలుగు విడతలుగా చేస్తున్నారని, ప్రతి విడతలోనూ ఇచ్చిన రూ. 25 వేలు వడ్డీకే సరిపోతోందని, రుణం మాత్రం అలాగే ఉండిపోవటంతో పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు చనిపోవటానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో రెండుసార్లు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నామన్నారు. ఈ సమయంలో రైతులకు సహాయ సహకారాలు అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
వరంగల్ పరామర్శ యాత్రలో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా వైఎస్సార్‌నే తలచుకొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, నాయకులు నర్రా బిక్షపతి, మతిన్ బై, మామిడి శ్యాంసుందర్ రెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, మాదిరెడ్డి భగవంత్ రెడ్డి, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, భీష్వ రవీందర్, ఆరె లింగారెడ్డి పాల్గొన్నారు.