ఢిల్లీలో దీక్షలో పాల్గొన్న రాహుల్, మోతీలాల్ ఓరా, ఖర్గే, అజయ్ మాకెన్.
న్యూఢిల్లీ: బీజేపీ సిద్ధాంతాలపై జీవితాంతం పోరాటం చేస్తూనే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు నేడు భారతీయులంతా బీజేపీ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. ‘ప్రధాని మోదీకి కొన్ని కులాలంటే అభిమానం. ఆయన దళిత వ్యతిరేకి. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 2019 ఎన్నికల్లో వారి సిద్ధాంతాన్ని ఓడించి తీరతాం. మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు.. తమ విధానాలను వ్యతిరేకిస్తున్నందుకు విపక్షనేతలను జంతువులతో పోల్చారు.
కానీ నేడు.. ప్రతి భారతీయుడు దళిత–గిరిజన–మైనారిటీ–రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు’ అని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుల, మత ఘర్షణలను నిరసిస్తూ, పార్లమెంటు సరిగా నడవకపోవటంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘సద్భావన ఉపవాస్’ పేరుతో దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, ఖర్గే, షీలా దీక్షిత్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, సుర్జేవాలా తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
1984 సిక్కు అల్లర్లలో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు సజ్జన్ కుమార్, జగదీశ్ టైట్లర్‌లను ఈ కార్యక్రమ వేదికపైకి రావొద్దని పార్టీ నాయకులు సూచించారు. దీంతో సజ్జదీక్షాస్థలి నుంచి వెళ్లిపోయారు. టైట్లర్ పార్టీ కార్యకర్తల నడుమ కూర్చున్నారు. అటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. కాంగ్రెస్ దీక్ష హాస్యాస్పదమని బీజేపీ ఎద్దేవా చేసింది. సిక్కు అల్లర్ల కేసులో దోషులైన జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లను వేదికపైకి రాకుండా ఆపటం.. కాంగ్రెస్ నాడు చేసిన పాపాన్ని అంగీకరించినట్లేనని పేర్కొంది.
విభజించి పాలిస్తున్నారు
బీజేపీ దళిత ఎంపీలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. దేశాన్ని విభజించటం, దళితులు, గిరిజనులను అణచివేయటమే బీజేపీ విధానమని ఆయన ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును స్తంభింపజేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కావేరీ బోర్డు ఏర్పాటు, పీఎన్‌బీ కుంభకోణం, సీబీఎస్‌ఈ పేపర్ లీక్, ఎస్సీ–ఎస్టీ చట్టం తదితర అంశాలపై చర్చించాలనుకున్నా.. బీజేపీ అడ్డుకు ందని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపించారు.
ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి: బీజేపీ
కాంగ్రెస్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ‘రాహుల్ నేతృత్వంలో నేడు జరిగింది ఉపవాస దీక్ష కాదు, హాస్యాస్పద దీక్ష. రాహుల్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ ఆయనను గొప్పగా చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన కార్యక్రమమే ఇది. దీక్ష అంటే ఉపవాసం.. కానీ అక్కడ హాజరైన కాంగ్రెస్ నేతలంతా దీక్షకు ముందు ఛోలా బటూరే (పూరీ, శనగల కర్రీ)లు తిన్నారు. ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి’ అని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.మిర్చ్‌పూర్, గోహానా, జజ్జర్‌లలో దళిత వ్యతిరేక అల్లర్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. కర్ణాటకలో గత ఐదేళ్లలో దళితులపై 9080 కేసులు నమోదు అయ్యాయని.. 358 మంది దళితులను చంపేశారని సంబిత్ పాత్రా ఆధారాలు చూపించారు. అసలు దళిత వ్యతిరేకి కాంగ్రెస్సేనన్నారు.
దీక్షకు ముందు కాంగ్రెస్ నేతలు పూరీ తింటున్నారంటూ బీజేపీ నేత ట్వీట్ చేసిన ఫొటో
Comments
Please login to add a commentAdd a comment