సార్వత్రిక ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండటంతో కూటముల్లో కదలికలు మొదలయ్యాయి. అసంతృప్తి సణుగుడు స్థాయిని దాటింది. వేర్వేరు పార్టీలు మీడియా ముందుకొచ్చి తమ తమ డిమాండ్లను బాహాటంగా ఏకరువు పెట్టే ధోరణి మొదలైంది. కేంద్రాన్ని ఏలుతున్న కూటమి కనుక ఎన్‌డీఏకు ఈ తాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలబడ్డాక ఇది మరీ ఎక్కువైంది.
తాను ఏ పక్షమో మరిచి నట్టుగా మొదటినుంచీ అడపా దడపా బీజేపీపై విరుచుకుపడుతూనే ఉన్న శివసేనను మినహా యిస్తే... బిహార్‌లో జేడీ(యూ), ఎల్‌జేపీ, ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్(ఎస్), ఎస్‌బీఎస్‌పీ వంటి పార్టీలు తిరుగుబాటు జెండా ఎగరేశాయి. బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎస్ ఎల్‌పీ) ఎన్‌డీఏ కూటమికి గుడ్‌బై చెప్పింది. దేశంలో అందరికన్నా తానే సీనియర్‌నని తరచు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశం రాగల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రాజకీయ మరణశాసనం లిఖించనున్నదని గుర్తించి, తన వైఫల్యాల న్నిటినీ బీజేపీపైకి నెట్టి తొమ్మిదినెలలక్రితమే ఎన్‌డీఏ నుంచి బయటపడ్డారు.
బిహార్‌లో ఎప్పుడూ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సింహభాగం తీసుకుంటుంది. 2014లో అది 30 స్థానాలకు పోటీచేసి 22 గెల్చుకుంది. కానీ మూడు రాష్ట్రాల ఓటమి తర్వాత బీజేపీ ఆత్మరక్షణలో పడటాన్ని గుర్తించిన జేడీ(యూ), ఎల్‌జేపీలు స్వరం పెంచాయి. దాంతో బీజేపీ రాజీకి రాక తప్పలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలు మాత్రమే తీసుకోవాలని అది నిర్ణయించుకుంది. జేడీ(యూ)కు తనతో సమానంగా 17 సీట్లిచ్చి, ఎల్‌జేపీకి 6 కేటాయించింది. అంతేకాదు... ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పుకుంది.
ప్రస్తుతం జేడీ(యూ)కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. నాలుగునెలలక్రితం జేడీ(యూ) తిరిగి ఎన్‌డీఏలో చేరినా ఆ పార్టీకి కేంద్ర కేబినెట్‌లో చోటివ్వకుండా అవమానించిన బీజేపీ ఇప్పుడిలా ‘పెద్ద మనసు’ చేసుకోవడం గమనించదగ్గది. ఈసారి ఎన్నికల్లో సైతం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 272ను సొంతంగా సాధించితీరాలని బీజేపీ సంకల్పించుకుంది. కానీ బిహార్‌లో ‘కోల్పోయిన’ ఈ స్థానాలను ఎక్కడ భర్తీ చేసుకోవాలని పథక రచన చేస్తున్నదో చూడాలి. తాము కూటమిలో ఉండాలంటే లోక్‌సభ సీట్లలో సగం ఇవ్వాలని మహా రాష్ట్రలో శివసేన కోరుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి 48 స్థానాల్లో బీజేపీ 24, శివసేన 20 స్థానాలకు పోటీచేశాయి. నాలుగు స్థానాలు ఇతర మిత్రులకు ఇచ్చారు.
అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శివసేన ఒంటరిగా పోటీచేసింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 122 గెల్చుకుంటే, శివసేనకు 63 మాత్రమే దక్కాయి. అయితే ఆ తర్వాత శివసేన మళ్లీ కూటమిలో చేరి మంత్రి పదవులు తీసుకుంది. ఈసారి శివసేన డిమాండ్లు పెద్దవే. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలని, రెండు చట్టసభల్లోనూ తనకు సగం చొప్పున ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ సంగతి తేలేవరకూ అది బహిరంగ విమర్శలు చేస్తూనే ఉంటుంది. రామ మందిరం, గోరక్షణ వగైరా అంశాల్లో తమ వైఖరినే ప్రదర్శించే శివసేనను వేరే పార్టీలేవీ దరిచేరనీ యబోవని, చివరికది తమ గూటికి రాకతప్పదని బీజేపీకి తెలుసు. అందుకే అది ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ నినాదాన్ని అందుకున్నా ఎక్కడలేని సహనాన్నీ ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్, ఎన్‌సీపీలు మళ్లీ దగ్గరకాబోతున్నాయని తెలిశాక శివసేనకు బీజేపీతో వెళ్లడం మినహా గత్యంతరం లేదు.
కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీకి ఇబ్బందులు ఎక్కువే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 80 స్థానాల్లో బీజేపీ 73 కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు ఎస్‌పీ, బీఎస్‌పీలు రెండూ కలిస్తే బీజేపీ రాజకీయంగా ఎదురీదక తప్పదు. ఇదే అదునని అప్నాదళ్(ఎస్), ఎస్‌బీఎస్‌పీ పార్టీలు ఇక్కడ కూడా సీట్ల పంపకం త్వరగా మొదలుపెట్టాలని డిమాండు చేస్తు న్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మిత్రపక్షాలైన తమను తరచు అవమానిస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి. బీజేపీకి మిత్ర పక్షాలను గౌరవించడం తెలియకపోతే ఎస్‌పీ–బీఎస్‌పీ కూట మివైపు వెళ్తామని ఎస్‌బీఎస్‌పీ హెచ్చరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్(ఎస్) పార్టీ రెండు చోట్ల పోటీచేసి రెండూ గెల్చుకుంది. ఎస్‌బీఎస్‌పీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టింది.
అధికార ఎన్‌డీఏ కూటమికి ఎదురవుతున్న ఒత్తిళ్లు చూసి నిజానికి యూపీఏ ఉత్సాహంతో ఉరకలెత్తాలి. కానీ దాని కష్టాలు దానివి. గతంతో పోలిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వక్తగా మెరుగుపడినా... నరేంద్రమోదీకి దీటైన నాయకుడని జనం అనుకునే స్థాయికి ఆయనింకా ఎద గలేదు. పైగా కాంగ్రెస్‌కు డీఎంకే, ఆర్‌జేడీలు మాత్రమే బలమైన మిత్రపక్షాలు. ఎన్సీపీ, ఆర్‌ఎల్‌డీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు చిన్న పార్టీలే. కర్ణాటకకు చెందిన జనతాదళ్(ఎస్) ఎంతకాలం కలిసి ప్రయాణం చేస్తుందో తెలియదు.
లోక్‌సభ ఎన్నికలకు ముందో, వెనకో అది తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. కొత్తగా వచ్చి చేరిన చంద్రబాబు యూపీఏను తానే నడుపుతున్నంత హడావుడి చేస్తున్నారు గానీ... ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తల బొప్పికట్టాక రాహుల్‌కి అర్ధమై ఉంటుంది. కాకపోతే నిండా మునిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాత్రం ఆసరా అయినా దొరికిం దన్న తృప్తి దక్కినట్టుంది. యూపీఏ ప్రధాని అభ్యర్థి రాహుల్ అని డీఎంకే చెప్పడంతో ఎస్‌పీ, బీఎస్‌పీ, తృణమూల్ ఆ కూటమి దరిదాపుల్లోకి కూడా వచ్చే సూచనలు కనబడటం లేదు. విపక్ష కూటమిలో ఇన్ని లుకలుకలున్నాయి కనుకనే, సొంతింటి సమస్యలు ఎన్ని ఉన్నా...అక్కడక్కడ రాజీ పడాల్సివస్తున్నా ఎన్‌డీఏ ధీమాగా ఉంది. బలాబలాల సమీకరణలో మున్ముందు ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment