Anti BJP Campaign
-
అసమ్మతి స్వరాలు
సార్వత్రిక ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండటంతో కూటముల్లో కదలికలు మొదలయ్యాయి. అసంతృప్తి సణుగుడు స్థాయిని దాటింది. వేర్వేరు పార్టీలు మీడియా ముందుకొచ్చి తమ తమ డిమాండ్లను బాహాటంగా ఏకరువు పెట్టే ధోరణి మొదలైంది. కేంద్రాన్ని ఏలుతున్న కూటమి కనుక ఎన్డీఏకు ఈ తాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలబడ్డాక ఇది మరీ ఎక్కువైంది. తాను ఏ పక్షమో మరిచి నట్టుగా మొదటినుంచీ అడపా దడపా బీజేపీపై విరుచుకుపడుతూనే ఉన్న శివసేనను మినహా యిస్తే... బిహార్‌లో జేడీ(యూ), ఎల్జేపీ, ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్(ఎస్), ఎస్బీఎస్పీ వంటి పార్టీలు తిరుగుబాటు జెండా ఎగరేశాయి. బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎస్ ఎల్పీ) ఎన్డీఏ కూటమికి గుడ్‌బై చెప్పింది. దేశంలో అందరికన్నా తానే సీనియర్‌నని తరచు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశం రాగల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రాజకీయ మరణశాసనం లిఖించనున్నదని గుర్తించి, తన వైఫల్యాల న్నిటినీ బీజేపీపైకి నెట్టి తొమ్మిదినెలలక్రితమే ఎన్డీఏ నుంచి బయటపడ్డారు. బిహార్‌లో ఎప్పుడూ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సింహభాగం తీసుకుంటుంది. 2014లో అది 30 స్థానాలకు పోటీచేసి 22 గెల్చుకుంది. కానీ మూడు రాష్ట్రాల ఓటమి తర్వాత బీజేపీ ఆత్మరక్షణలో పడటాన్ని గుర్తించిన జేడీ(యూ), ఎల్జేపీలు స్వరం పెంచాయి. దాంతో బీజేపీ రాజీకి రాక తప్పలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలు మాత్రమే తీసుకోవాలని అది నిర్ణయించుకుంది. జేడీ(యూ)కు తనతో సమానంగా 17 సీట్లిచ్చి, ఎల్జేపీకి 6 కేటాయించింది. అంతేకాదు... ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం జేడీ(యూ)కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. నాలుగునెలలక్రితం జేడీ(యూ) తిరిగి ఎన్డీఏలో చేరినా ఆ పార్టీకి కేంద్ర కేబినెట్లో చోటివ్వకుండా అవమానించిన బీజేపీ ఇప్పుడిలా ‘పెద్ద మనసు’ చేసుకోవడం గమనించదగ్గది. ఈసారి ఎన్నికల్లో సైతం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 272ను సొంతంగా సాధించితీరాలని బీజేపీ సంకల్పించుకుంది. కానీ బిహార్‌లో ‘కోల్పోయిన’ ఈ స్థానాలను ఎక్కడ భర్తీ చేసుకోవాలని పథక రచన చేస్తున్నదో చూడాలి. తాము కూటమిలో ఉండాలంటే లోక్‌సభ సీట్లలో సగం ఇవ్వాలని మహా రాష్ట్రలో శివసేన కోరుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి 48 స్థానాల్లో బీజేపీ 24, శివసేన 20 స్థానాలకు పోటీచేశాయి. నాలుగు స్థానాలు ఇతర మిత్రులకు ఇచ్చారు. అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం శివసేన ఒంటరిగా పోటీచేసింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 122 గెల్చుకుంటే, శివసేనకు 63 మాత్రమే దక్కాయి. అయితే ఆ తర్వాత శివసేన మళ్లీ కూటమిలో చేరి మంత్రి పదవులు తీసుకుంది. ఈసారి శివసేన డిమాండ్లు పెద్దవే. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలని, రెండు చట్టసభల్లోనూ తనకు సగం చొప్పున ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ సంగతి తేలేవరకూ అది బహిరంగ విమర్శలు చేస్తూనే ఉంటుంది. రామ మందిరం, గోరక్షణ వగైరా అంశాల్లో తమ వైఖరినే ప్రదర్శించే శివసేనను వేరే పార్టీలేవీ దరిచేరనీ యబోవని, చివరికది తమ గూటికి రాకతప్పదని బీజేపీకి తెలుసు. అందుకే అది ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ నినాదాన్ని అందుకున్నా ఎక్కడలేని సహనాన్నీ ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు మళ్లీ దగ్గరకాబోతున్నాయని తెలిశాక శివసేనకు బీజేపీతో వెళ్లడం మినహా గత్యంతరం లేదు. కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీకి ఇబ్బందులు ఎక్కువే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 80 స్థానాల్లో బీజేపీ 73 కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలు రెండూ కలిస్తే బీజేపీ రాజకీయంగా ఎదురీదక తప్పదు. ఇదే అదునని అప్నాదళ్(ఎస్), ఎస్బీఎస్పీ పార్టీలు ఇక్కడ కూడా సీట్ల పంపకం త్వరగా మొదలుపెట్టాలని డిమాండు చేస్తు న్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మిత్రపక్షాలైన తమను తరచు అవమానిస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి. బీజేపీకి మిత్ర పక్షాలను గౌరవించడం తెలియకపోతే ఎస్పీ–బీఎస్పీ కూట మివైపు వెళ్తామని ఎస్బీఎస్పీ హెచ్చరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్(ఎస్) పార్టీ రెండు చోట్ల పోటీచేసి రెండూ గెల్చుకుంది. ఎస్బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టింది. అధికార ఎన్డీఏ కూటమికి ఎదురవుతున్న ఒత్తిళ్లు చూసి నిజానికి యూపీఏ ఉత్సాహంతో ఉరకలెత్తాలి. కానీ దాని కష్టాలు దానివి. గతంతో పోలిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వక్తగా మెరుగుపడినా... నరేంద్రమోదీకి దీటైన నాయకుడని జనం అనుకునే స్థాయికి ఆయనింకా ఎద గలేదు. పైగా కాంగ్రెస్‌కు డీఎంకే, ఆర్జేడీలు మాత్రమే బలమైన మిత్రపక్షాలు. ఎన్సీపీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు చిన్న పార్టీలే. కర్ణాటకకు చెందిన జనతాదళ్(ఎస్) ఎంతకాలం కలిసి ప్రయాణం చేస్తుందో తెలియదు. లోక్‌సభ ఎన్నికలకు ముందో, వెనకో అది తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. కొత్తగా వచ్చి చేరిన చంద్రబాబు యూపీఏను తానే నడుపుతున్నంత హడావుడి చేస్తున్నారు గానీ... ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తల బొప్పికట్టాక రాహుల్‌కి అర్ధమై ఉంటుంది. కాకపోతే నిండా మునిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాత్రం ఆసరా అయినా దొరికిం దన్న తృప్తి దక్కినట్టుంది. యూపీఏ ప్రధాని అభ్యర్థి రాహుల్ అని డీఎంకే చెప్పడంతో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ ఆ కూటమి దరిదాపుల్లోకి కూడా వచ్చే సూచనలు కనబడటం లేదు. విపక్ష కూటమిలో ఇన్ని లుకలుకలున్నాయి కనుకనే, సొంతింటి సమస్యలు ఎన్ని ఉన్నా...అక్కడక్కడ రాజీ పడాల్సివస్తున్నా ఎన్డీఏ ధీమాగా ఉంది. బలాబలాల సమీకరణలో మున్ముందు ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. -
బీజేపీ వ్యతిరేక కూటమి ఎవరి కోసం?
బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పరచనున్న రాజ కీయ కూటమి ఎవరి కోసం? ఏ లక్ష్యాల కోసం? ఏ విధానాల అమలు కోసం? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. దేశంలో అత్యధిక సంఖ్యాకులైన ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలకు నేడు కావలసింది సామాజిక న్యాయం. ఈ లక్ష్యాన్ని రాజ్యాంగంలోనే పొందుపరచివున్నారు. కానీ, అది నీళ్లు లభించని ఎండమావిలా తయారైంది. ఈ సందర్భంగా ప్రధానమైన ప్రశ్న, బీజేపీకి ప్రత్యామ్నాయం కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలయిక వంటిదా? లేక, కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర పార్టీల ఫెడరల్ కూటమిని నెలకొల్పడమా? సీపీఐ, సీపీఎంలు చాలా స్పష్టంగా కాంగ్రెస్‌తో కలిసిన పార్టీల ప్రత్యామ్నాయమేనని నగ్నంగానే ప్రకటించుకొన్నాయ్. అన్నింటి కన్నా ముఖ్యంగా కాంగ్రెస్తోసహాగానీ, కాంగ్రెస్ మినహాగానీ ఏర్పరచబోయే పార్టీల ఐక్యకూటమికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా అనుసరించనున్న సామాజిక, ఆర్థిక విధానాలేమిటి? పెట్టుబడిదారీ కార్పొరేట్ సెక్టార్ నియంత్రణ, రైతాంగ, కార్మిక అనుకూల విధానాలు, సంపద వికేంద్రీకరణ, పేదరిక నిర్మూలన, వంటి సమస్యలకు పరి ష్కారం చూపే ప్రత్యామ్నాయ విధానాలు లేకుండా, బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి నిర్మిస్తే, అది ఎవరి కోసం? సామాన్య ప్రజల కోసం మాత్రం అవదు; బడుగు బలహీనవర్గాలకు అనుకూలం అసలే కాదు. సామాజిక న్యాయం ఆ పార్టీల ఎజండాయే కాదు. ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేకుండా, ఏవో కొన్ని సీట్ల కోసం సంపన్న వర్గాలతో చెలిమిచెయ్యటం సి.పి.ఐ., సి.పి.ఎం.లకు అలవాటుగా మారిపోయింది. కనుక, ఇలాంటి కూటమిలో అవి సహజంగానే భాగస్వాములు అవుతాయి. ప్రశ్నల్లా, ఎస్.పి., బి.ఎస్.పిలను గురించే. ఇటీవలే ఆ రెండు పార్టీలు కలిసి ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీని చిత్తుచేసి ఘన విజయం సాధించాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి రాజీనామా చేసిన స్థానాల్లో గెలుపొందడం అక్కడ మరో ప్రత్యేకత సంతరించుకొంది. వాస్తవానికి గత ఏడు దశాబ్దాల ఆధిపత్యకుల సంపన్న వర్గాల రాజకీయాలకు గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌ల బిసి., ఎస్.సి. తదితర సామాజిక వర్గాల సమైక్య రాజకీయం ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఆ సందేశాన్ని దేశవ్యాపితంగా విస్తరింప చేయవలసిన కర్తవ్యం ప్రధానంగా ఎస్.పి., బిఎస్.పిలపైన వున్నది. ఆ పని చెయ్యకుండా, రెండు అగ్రకుల పార్టీలు కాంగ్రెస్ జేడీ (ఎస్)ల కూటమిని బీజేపీకి ప్రత్యామ్నాయంగా అగ్రకుల పార్టీలు కీర్తిస్తుండగా, ఆ అరుపుల్లో తమ గొంతు కలపడం అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారికి సబబేనా? తమ ఇద్దరి సఖ్యతే ఒక సామాజిక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయానికి చిహ్నంగా ఉండగా, ఎలాంటి ప్రజానుకూల విధానాలులేని, సెక్యులర్ ముసుగు వేసుకొని వున్న మోసపూరిత ప్రత్యామ్నాయం వెంట పడటం రాజకీయ ఆత్మహత్య అవుతుంది. సామాజిక న్యాయ హత్యా ప్రయత్నం కూడా అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్గానీ, యూపీఏ3గానీ, మరో పేరు ఏది పెట్టుకొన్నా, ఆధిపత్య కులసంపన్నవర్గాల పార్టీలు, విడివిడిగాగానీ, కూటమిగాగానీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాజాలవు. ప్రత్యామ్నాయమంటే అణచబడ్డ సామాజిక వర్గాలకీ, శ్రామికులకూ, విశాల ప్రజానీకానికీ సానుకూలంగా వుంటూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధానాలే. అంతే కానీ, కొన్ని పార్టీల గుంపు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అణచివేతకు గురైన కులాలు, ఆదివాసీలు, మైనారిటీలు నిజమైన సెక్యులర్ ప్రజాస్వామిక శక్తులు ఒక సామాజిక ప్రజాస్వామిక రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడి కేంద్రంలో బీజేపీకీ, రాష్ట్రాల్లో అదే స్వభావంగల ప్రాంతీయ పార్టీలకీ నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా రూపొందవలసిన తక్షణావశ్యకత నేడు ముందుకొచ్చింది. వై.కోటేశ్వరరావు, వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు మొబైల్ : 98498 56568 -
‘అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయండి’
సాక్షి, ముంబై : దళితులెవ్వరు బీజేపీకి ఓటు వెయ్యకుండా అంబేడ్కర్‌పై ప్రమాణం చేయాలని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమనేత జిగ్నేష్ మెవానీ కోరారు. నాగపూర్‌లో రిపబ్లిక్ యూత్ ఫెడరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిగ్నేష్ మాట్లాడుతూ.. దళితులు బీజేపి ఓటు వెయ్యవద్దని, ఓటు వేయకుండా అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు లక్షమంది చేత ప్రమాణం చేయించాలని పిలుపినిచ్చారు. దీనికి కొరకు మహారాష్ట్రలోని అన్ని జిల్లాలో ప్రచారం చేయాలన్నారు. త్వరలో జరుగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీష్‌గఢ్, మహారాష్ట్ర ఎన్నికల్లో దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పేర్కొన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మనుస్మృతిని ఆధారంగా చేసుకుని పరిపాలన చేస్తోందని విమర్శించారు. దేశంలో అతిపెద్ద అబద్దాల కోరుగా ప్రధాని మోదీని వర్ణించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కూడా కనీసం లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. కనీసం మిమ్మల్ని నమ్ముకున్న ఎబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకైన ఉద్యోగాలు కల్పించండి అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. -
కుమారస్వామి ప్రమాణం.. విచిత్ర దృశ్యాలు
బెంగళూరు: సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యూహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.. మరి ఆ శబ్ధం ఢిల్లీలోని రాయిసీనా హిల్స్ ఆఫీసులో కొలువుదీరిన నరేంద్ర మోదీకి.. దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్న అమిత్ షాకి ఎలా వినపడి ఉంటుంది? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న నానుడి తెలిసిందే. అయితే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మిత్రులుకాని వారంతా ఒక్కటికావడం.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో కనిపించిన విచిత్ర దృశ్యం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో చేయికలిపారు. ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించొచ్చని ఇప్పటికే గ్రహించిన మాయావతి-అఖిలేశ్‌లు పక్కపక్కనే నిల్చొని నవ్వులు చిందించారు. గంభీరవదనంతో శరద్ పవార్ వేదికకు నిండుదనం తెచ్చారు. ఆర్ఎల్డీ నేత అజిత్‌సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌లు అదనపు వెలుగులు చిందించారు. ఇక ఎన్నికలకో పార్టీతో జతకడుతూ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కరచాలనం చేసి ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత అంతమంది మనుషుల మధ్యలో, అతిదగ్గరగా నిలబడ్డ సోనియా గాంధీ.. మీడియా కెమెరాల వైపునకు సవాలు విసురుతున్నట్లు ఓ చూపు చూశారు.. భారత్‌లో గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇన్ని విభిన్న పార్టీలు ఒకే వేదికపైకి రావడం, తద్వారా ఉమ్మడి శత్రువుకు హెచ్చరిక సంకేతాలు పంపడం మాత్రం ఇదే ప్రధమం. కాంగ్రెసేతర-బీజేపీయేతర కూటమి కావాలన్న కేసీఆర్, తమిళానాడులో ఆందోళనల కారణంగా స్టాలిన్, తెలియని కారణంతో నవీన్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. -
బద్ధశత్రువులు కరచాలనం చేశారు
-
మోదీ దళిత, గిరిజన వ్యతిరేకి
న్యూఢిల్లీ: బీజేపీ సిద్ధాంతాలపై జీవితాంతం పోరాటం చేస్తూనే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు నేడు భారతీయులంతా బీజేపీ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. ‘ప్రధాని మోదీకి కొన్ని కులాలంటే అభిమానం. ఆయన దళిత వ్యతిరేకి. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 2019 ఎన్నికల్లో వారి సిద్ధాంతాన్ని ఓడించి తీరతాం. మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు.. తమ విధానాలను వ్యతిరేకిస్తున్నందుకు విపక్షనేతలను జంతువులతో పోల్చారు. కానీ నేడు.. ప్రతి భారతీయుడు దళిత–గిరిజన–మైనారిటీ–రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు’ అని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుల, మత ఘర్షణలను నిరసిస్తూ, పార్లమెంటు సరిగా నడవకపోవటంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘సద్భావన ఉపవాస్’ పేరుతో దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, ఖర్గే, షీలా దీక్షిత్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, సుర్జేవాలా తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 1984 సిక్కు అల్లర్లలో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు సజ్జన్ కుమార్, జగదీశ్ టైట్లర్‌లను ఈ కార్యక్రమ వేదికపైకి రావొద్దని పార్టీ నాయకులు సూచించారు. దీంతో సజ్జదీక్షాస్థలి నుంచి వెళ్లిపోయారు. టైట్లర్ పార్టీ కార్యకర్తల నడుమ కూర్చున్నారు. అటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. కాంగ్రెస్ దీక్ష హాస్యాస్పదమని బీజేపీ ఎద్దేవా చేసింది. సిక్కు అల్లర్ల కేసులో దోషులైన జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లను వేదికపైకి రాకుండా ఆపటం.. కాంగ్రెస్ నాడు చేసిన పాపాన్ని అంగీకరించినట్లేనని పేర్కొంది. విభజించి పాలిస్తున్నారు బీజేపీ దళిత ఎంపీలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. దేశాన్ని విభజించటం, దళితులు, గిరిజనులను అణచివేయటమే బీజేపీ విధానమని ఆయన ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును స్తంభింపజేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కావేరీ బోర్డు ఏర్పాటు, పీఎన్బీ కుంభకోణం, సీబీఎస్ఈ పేపర్ లీక్, ఎస్సీ–ఎస్టీ చట్టం తదితర అంశాలపై చర్చించాలనుకున్నా.. బీజేపీ అడ్డుకు ందని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి: బీజేపీ కాంగ్రెస్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ‘రాహుల్ నేతృత్వంలో నేడు జరిగింది ఉపవాస దీక్ష కాదు, హాస్యాస్పద దీక్ష. రాహుల్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ ఆయనను గొప్పగా చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన కార్యక్రమమే ఇది. దీక్ష అంటే ఉపవాసం.. కానీ అక్కడ హాజరైన కాంగ్రెస్ నేతలంతా దీక్షకు ముందు ఛోలా బటూరే (పూరీ, శనగల కర్రీ)లు తిన్నారు. ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి’ అని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.మిర్చ్‌పూర్, గోహానా, జజ్జర్లలో దళిత వ్యతిరేక అల్లర్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. కర్ణాటకలో గత ఐదేళ్లలో దళితులపై 9080 కేసులు నమోదు అయ్యాయని.. 358 మంది దళితులను చంపేశారని సంబిత్ పాత్రా ఆధారాలు చూపించారు. అసలు దళిత వ్యతిరేకి కాంగ్రెస్సేనన్నారు. దీక్షకు ముందు కాంగ్రెస్ నేతలు పూరీ తింటున్నారంటూ బీజేపీ నేత ట్వీట్ చేసిన ఫొటో -
సోషల్ మీడియాలో అసలేం జరుగుతోంది?
సాక్షి, అహ్మదాబాద్: గత నెల 23న సాగర్ సవాలి అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశాడు. గుజరాత్ రవాణా శాఖలో నూతనంగా కొనుగోలు చేసిన బస్సు.. దాని చక్రాలపై ఓ ట్యాగ్ లైన్ రాసిన ఫోటో అది. వికాస్ గందో యాయు చే.. అంటే అభివృద్ధి అస్తవ్యస్తం అయ్యింది అని అర్థం. బీజేపీ పాలనలో రాష్ట్రం ఎంత అధ్వానంగా తయారయ్యిందో చూడండంటూ గతుకుల రోడ్లపై తిరుగుతున్న కొత్త బస్సును సంకేతంగా ఆ విద్యార్థి చూపించాడు. అప్ లోడ్ చేసిన మొదటి రోజే దానికి 200 లైకులు వచ్చాయి. అదిగో అదే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రచార నినాదంగా మారింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అద్భుతాలు చేస్తాడని భావిస్తున్న పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) వ్యవస్థాపకుడు హర్దిక్ పటేల్.. సాగర్ సవాలి నుంచే తాను ప్రేరణ పొందానని చెబుతున్నారు. మెమోలు, సృజనాత్మక వ్యంగ్య కార్డూన్లు, సెటైరిక్ వీడియోలు ఇలా.. సోషల్ మీడియాలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తోంది పీఏఏఎస్ ప్రత్యేక సెల్ విభాగం. బృందంలోని తమ సభ్యులు ఒక్కోక్కరు 200 నుంచి 500 వాట్సాప్ గ్రూప్‌లలో విరివిగా ప్రచారం చేస్తున్నారని పార్టీ ప్రతినిధి వరుణ్ పటేల్ వెల్లడించారు. మరోపక్క ‘బీజేపీ అభివృద్ధి నమునా నినాదాన్ని’ ఎండగడుతూ కాంగ్రెస్ కూడా తీవ్ర స్థాయిలోనే ప్రచారం ఉధృతి చేసింది. గతంలో తాము అధికారంలో ఉండగా చేసిన విమర్శలను.. ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ ఫోటోలు.. వీడియోలను తయారు చేయించి పోస్టులు చేస్తోంది. ఇప్పుడు అక్కడ ఎవరి ఫేస్బుక్, ట్విట్టర్లు చూసినా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రధాన వేదికను ఉపయోగించుకునే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. దీంతో దాని సామర్థ్యం ఏంటో తెలిసిన బీజేపీ, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, వర్షాలు తగ్గగానే గుజరాత్ రోడ్లను బాగు చేయిస్తామని, యువత సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అభివృద్ధి అంటే వారికి(ప్రతిపక్షాలకు) హాస్యాస్పదంగా మారిపోయిందని ఆర్థిక శాఖ మంత్రి.. గుజరాత్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జీ అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.