సోషల్ మీడియాలో అసలేం జరుగుతోంది?
సోషల్ మీడియాలో అసలేం జరుగుతోంది?
Published Thu, Sep 21 2017 9:22 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
సాక్షి, అహ్మదాబాద్: గత నెల 23న సాగర్ సవాలి అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశాడు. గుజరాత్ రవాణా శాఖలో నూతనంగా కొనుగోలు చేసిన బస్సు.. దాని చక్రాలపై ఓ ట్యాగ్ లైన్ రాసిన ఫోటో అది. వికాస్ గందో యాయు చే.. అంటే అభివృద్ధి అస్తవ్యస్తం అయ్యింది అని అర్థం. బీజేపీ పాలనలో రాష్ట్రం ఎంత అధ్వానంగా తయారయ్యిందో చూడండంటూ గతుకుల రోడ్లపై తిరుగుతున్న కొత్త బస్సును సంకేతంగా ఆ విద్యార్థి చూపించాడు. అప్ లోడ్ చేసిన మొదటి రోజే దానికి 200 లైకులు వచ్చాయి.
అదిగో అదే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రచార నినాదంగా మారింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అద్భుతాలు చేస్తాడని భావిస్తున్న పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) వ్యవస్థాపకుడు హర్దిక్ పటేల్.. సాగర్ సవాలి నుంచే తాను ప్రేరణ పొందానని చెబుతున్నారు. మెమోలు, సృజనాత్మక వ్యంగ్య కార్డూన్లు, సెటైరిక్ వీడియోలు ఇలా.. సోషల్ మీడియాలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తోంది పీఏఏఎస్ ప్రత్యేక సెల్ విభాగం. బృందంలోని తమ సభ్యులు ఒక్కోక్కరు 200 నుంచి 500 వాట్సాప్ గ్రూప్‌లలో విరివిగా ప్రచారం చేస్తున్నారని పార్టీ ప్రతినిధి వరుణ్ పటేల్ వెల్లడించారు.
మరోపక్క ‘బీజేపీ అభివృద్ధి నమునా నినాదాన్ని’ ఎండగడుతూ కాంగ్రెస్ కూడా తీవ్ర స్థాయిలోనే ప్రచారం ఉధృతి చేసింది. గతంలో తాము అధికారంలో ఉండగా చేసిన విమర్శలను.. ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ ఫోటోలు.. వీడియోలను తయారు చేయించి పోస్టులు చేస్తోంది. ఇప్పుడు అక్కడ ఎవరి ఫేస్‌బుక్, ట్విట్టర్లు చూసినా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రధాన వేదికను ఉపయోగించుకునే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. దీంతో దాని సామర్థ్యం ఏంటో తెలిసిన బీజేపీ, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, వర్షాలు తగ్గగానే గుజరాత్ రోడ్లను బాగు చేయిస్తామని, యువత సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అభివృద్ధి అంటే వారికి(ప్రతిపక్షాలకు) హాస్యాస్పదంగా మారిపోయిందని ఆర్థిక శాఖ మంత్రి.. గుజరాత్ ఎన్నికల పార్టీ ఇన్‌ఛార్జీ అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement