బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పరచనున్న రాజ కీయ కూటమి ఎవరి కోసం? ఏ లక్ష్యాల కోసం? ఏ విధానాల అమలు కోసం? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. దేశంలో అత్యధిక సంఖ్యాకులైన ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలకు నేడు కావలసింది సామాజిక న్యాయం. ఈ లక్ష్యాన్ని రాజ్యాంగంలోనే పొందుపరచివున్నారు. కానీ, అది నీళ్లు లభించని ఎండమావిలా తయారైంది.
ఈ సందర్భంగా ప్రధానమైన ప్రశ్న, బీజేపీకి ప్రత్యామ్నాయం కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలయిక వంటిదా? లేక, కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర పార్టీల ఫెడరల్ కూటమిని నెలకొల్పడమా? సీపీఐ, సీపీఎంలు చాలా స్పష్టంగా కాంగ్రెస్‌తో కలిసిన పార్టీల ప్రత్యామ్నాయమేనని నగ్నంగానే ప్రకటించుకొన్నాయ్. అన్నింటి కన్నా ముఖ్యంగా కాంగ్రెస్‌తోసహాగానీ, కాంగ్రెస్ మినహాగానీ ఏర్పరచబోయే పార్టీల ఐక్యకూటమికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా అనుసరించనున్న సామాజిక, ఆర్థిక విధానాలేమిటి? పెట్టుబడిదారీ కార్పొరేట్ సెక్టార్ నియంత్రణ, రైతాంగ, కార్మిక అనుకూల విధానాలు, సంపద వికేంద్రీకరణ, పేదరిక నిర్మూలన, వంటి సమస్యలకు పరి ష్కారం చూపే ప్రత్యామ్నాయ విధానాలు లేకుండా, బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి నిర్మిస్తే, అది ఎవరి కోసం? సామాన్య ప్రజల కోసం మాత్రం అవదు; బడుగు బలహీనవర్గాలకు అనుకూలం అసలే కాదు. సామాజిక న్యాయం ఆ పార్టీల ఎజండాయే కాదు.
ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేకుండా, ఏవో కొన్ని సీట్ల కోసం సంపన్న వర్గాలతో చెలిమిచెయ్యటం సి.పి.ఐ., సి.పి.ఎం.లకు అలవాటుగా మారిపోయింది. కనుక, ఇలాంటి కూటమిలో అవి సహజంగానే భాగస్వాములు అవుతాయి. ప్రశ్నల్లా, ఎస్.పి., బి.ఎస్.పిలను గురించే. ఇటీవలే ఆ రెండు పార్టీలు కలిసి ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీని చిత్తుచేసి ఘన విజయం సాధించాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి రాజీనామా చేసిన స్థానాల్లో గెలుపొందడం అక్కడ మరో ప్రత్యేకత సంతరించుకొంది.
వాస్తవానికి గత ఏడు దశాబ్దాల ఆధిపత్యకుల సంపన్న వర్గాల రాజకీయాలకు గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ల బిసి., ఎస్.సి. తదితర సామాజిక వర్గాల సమైక్య రాజకీయం ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఆ సందేశాన్ని దేశవ్యాపితంగా విస్తరింప చేయవలసిన కర్తవ్యం ప్రధానంగా ఎస్.పి., బిఎస్.పిలపైన వున్నది. ఆ పని చెయ్యకుండా, రెండు అగ్రకుల పార్టీలు కాంగ్రెస్ జేడీ (ఎస్)ల కూటమిని బీజేపీకి ప్రత్యామ్నాయంగా అగ్రకుల పార్టీలు కీర్తిస్తుండగా, ఆ అరుపుల్లో తమ గొంతు కలపడం అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారికి సబబేనా? తమ ఇద్దరి సఖ్యతే ఒక సామాజిక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయానికి చిహ్నంగా ఉండగా, ఎలాంటి ప్రజానుకూల విధానాలులేని, సెక్యులర్ ముసుగు వేసుకొని వున్న మోసపూరిత ప్రత్యామ్నాయం వెంట పడటం రాజకీయ ఆత్మహత్య అవుతుంది. సామాజిక న్యాయ హత్యా ప్రయత్నం కూడా అవుతుంది.
ఫెడరల్ ఫ్రంట్‌గానీ, యూపీఏ3గానీ, మరో పేరు ఏది పెట్టుకొన్నా, ఆధిపత్య కులసంపన్నవర్గాల పార్టీలు, విడివిడిగాగానీ, కూటమిగాగానీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాజాలవు. ప్రత్యామ్నాయమంటే అణచబడ్డ సామాజిక వర్గాలకీ, శ్రామికులకూ, విశాల ప్రజానీకానికీ సానుకూలంగా వుంటూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధానాలే. అంతే కానీ, కొన్ని పార్టీల గుంపు కాదు.
ఇలాంటి పరిస్థితుల్లో అణచివేతకు గురైన కులాలు, ఆదివాసీలు, మైనారిటీలు నిజమైన సెక్యులర్ ప్రజాస్వామిక శక్తులు ఒక సామాజిక ప్రజాస్వామిక రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడి కేంద్రంలో బీజేపీకీ, రాష్ట్రాల్లో అదే స్వభావంగల ప్రాంతీయ పార్టీలకీ నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా రూపొందవలసిన తక్షణావశ్యకత నేడు ముందుకొచ్చింది.
వై.కోటేశ్వరరావు, వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు మొబైల్ : 98498 56568
Comments
Please login to add a commentAdd a comment