సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న మోదీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు పెంచిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేంద్రమేనన్నారు. కేంద్రం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలతో తెలంగాణ రైతుల జేబుకు చిల్లుపడిందన్నారు.
దేశంలోని బీజేపీ పాలనలో కొత్త కొలువులు రాకపోగా...ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బీజేపీ ప్రభుత్వం పెను ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు. కేంద్రం పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్, ధరలను తగ్గించే వరకు ప్రజలు పోరాటాలకు సిద్దం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment