ఫీజు రీయింబర్స్ మెంట్ మరింత ఆలస్యం
అఫిలియేషన్ నిబంధనతో సమస్య
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యకు ఇప్పట్లో పరిష్కారం దొరికే సూచనలు కనిపించడం లేదు. గత రెండేళ్ల ఫీజు బకాయిలు అందక విద్యార్థులతో పాటు, కాలేజీల యాజమాన్యాలూ ఇబ్బందులెదుర్కొంటున్నాయి. 2014-15, 2015-16కు సంబంధించిన ఫీజు బకాయిలను మొత్తంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది వాస్తవరూపం దాల్చడం లేదు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు (ఆర్టీఎఫ్)నకు అనుసరిస్తున్న విధానంలో మార్పు వల్ల ఈ సమస్య మరి న్ని నెలలు కొనసాగే పరిస్థితి ఏర్పడింది.
అప్పుడలా.. ఇప్పుడిలా...
2014-15 విద్యా సంవత్సరం వరకు కాలేజీల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇచ్చేవా రు. అయితే 2015-16కు సంబంధించి కొత్త సమస్యలు ముందుకు రావడంతో కాలేజీల అఫిలియేషన్ కాకుండా, ఆయా కాలేజీల్లో కోర్సుల వారీగా అఫిలియేషన్ ఉంటేనే ఫీజు రీయింబర్స్చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ పరిణామంతో కాలేజీలు, కోర్సు ల వారీగా అనుబంధ గుర్తింపును పరిశీలించడం అధికారులకు సమస్యగా మారింది.
ముందు 2014-15 బకాయిలు చెల్లింపు
ఈ నేపథ్యంలో 2014-15కు సంబంధించి ముందుగా కాలేజీలకు ఆర్టీఎఫ్, విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు ఈ నెలాఖరు లోగా చెల్లించనున్నారు. 2015-16కు సం బంధించి పూర్తి బకాయిల చెల్లింపునకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
జూలై నుంచి నెల నెలా స్కాలర్షిప్..
ఇదిలా ఉండగా 2016-17 విద్యాసంవత్సరం మొదలయ్యాక జూలై నుంచి ఏ నెలకు ఆ నెల విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.