appanna swamy
-
కమనీయం.. అప్పన్న నిజరూపం
సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున నుంచే స్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే స్వామివారి నిజరూపాన్ని దర్శనం చేసుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 2.30 గంటలకే స్వామివారి తొలి నిజరూప దర్శనం చేసుకుని తొలి చందనం సమర్పణ చేశారు. అనంతరం ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున జేఈఓ ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డిలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.30 నుంచి భక్తులను అనుమతించారు. స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ కదలివచ్చిన భక్తజనం చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు మంగళవారం వేకువజామున నుంచి ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును (స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించడం) అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగానే చందనోత్సవం జరగడం, భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకపోవడంతో ఈ ఏడాది చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు మంచినీళ్లు, ఆహారం అందించేందుకు దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లుచేశాయి. సుమారు 2,500 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. వైద్యులు, 108 అంబులెన్స్‌లు, ఏఎన్‌ఎంలతోపాటు ఉచిత మందులూ అందుబాటులో ఉంచారు. పోటెత్తిన వీఐపీలు చందనోత్సవం సందర్భంగా మంగళవారం వీఐపీలు పోటెత్తారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాల్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి సత్యవతి, మాజీమంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, తోట నరసింహం, వరుదు కల్యాణి, మాధవ్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అచ్చెన్నాయుడు, సుప్రీంకోర్డు న్యాయమూర్తి జస్టిస్ నరసింహం తదితరులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. మరోవైపు.. చందనోత్సవ వేళ ఆలయంలో అపచారం జరిగింది. స్వామి గర్భాలయాన్ని ఓ ఆకతాయి వీడియో తీయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసింది సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మహాభాగ్యం. తొలిసారిగా నేను చందనోత్సవంలో పాల్గొన్నాను. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే శరీరమంతా దివ్యతేజమైనట్లు అనిపించింది. ఇక్కడ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చాలాబాగా చేసింది. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నా. – తమిళిసై, తెలంగాణ గవర్నర్ వైభవంగా చందనోత్సవం ఈ ఏడాది చందనోత్సవానికి ఏర్పాట్లు అద్భుతంగా చేసి వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ ఏడాది ఆర్థికంగాను, ప్రజలు ఆరోగ్యకరంగా, అన్ని రకాలుగాను బాగుండాలని కోరుకున్నా. అందరినీ సమన్వయం చేసుకుంటూ దేవస్థానం ఈఓ సూర్యకళ, కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, దేవదాయశాఖ నుంచి ఫెస్టివల్ అధికారి భ్రమరాంబ సామాన్య సేవకుల్లా ఉండి భక్తుల సేవలో ఉండటం గొప్ప విషయం. – స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి -
అప్పన్న భూముల్లో ‘పచ్చ’ బాబులు
సర్వే నంబరు–161/1లోని 21.96 ఎకరాలను అప్పట్లో టీడీపీలో ఉన్న మండవ రవికుమార్ చౌదరి అనే వ్యక్తి రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించాడు. ఈ స్థలంలో భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. వీటిని అనేక మందికి విక్రయించారు. ఈ భూమి కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. ఈ సర్వే నంబరులోని భూమిని కూడా ఆలయ ఆస్తుల జాబితా నుంచి తప్పించారు. ఇది వేపగుంట గ్రామం సర్వే నంబరు–5లో సింహాచలం ఆలయానికి చెందిన భూమి. ఈ భూమిలో బొబ్బర నరసింహం అనే టీడీపీ నేత రెండెకరాల వరకు స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడున్న గెడ్డ పోరంబోకు భూమిని కూడా ఆక్రమించాడు. అలాగే, వేపగుంటలోని సర్వే నంబరు–1లోని ఒక ఎకరాన్ని టీడీపీ నేత గంట్ల పెంటారావు ఆక్రమించుకుని ఏకంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ స్థలం కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చాలా మంది టీడీపీ నేతలు సింహాచలం దేవస్థానం ఆస్తులను కొల్లగొట్టారు. అడవి వరంలో ఆలయానికి చెందిన భూమినే ఒక సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్నింటిని ‘సాక్షి’ పరిశీలించింది. ఇందులో టీడీపీ నేతల వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేటు వేసి పాగా.! సింహాచలం దేవస్థానానికి 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో 862.22 ఎకరాల భూమి ఆలయానికి చెందినది కాదంటూ.. దానిని తొలగించేందుకు అప్పటి ఈవో రామచంద్రమోహన్ ద్వారా 2016లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు అనుగుణంగా 2016 మే 31న ఫలానా ఆస్తులు సింహాచలం ఆలయానికి చెందినవి అనే ఆధారాలు లేవంటూ.. వాటిని జాబితా నుంచి తొలగించాలని అప్పటి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫైల్ పంపారు. అయితే.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు గానూ సరైన ప్రాతిపదిక లేదని పేర్కొంటూ ఆ అధికారి ఆ ఫైల్‌ను ఈవోకు తిప్పి పంపారు. ఏడాదైనా ఆ ఫైల్ తిరిగి రాలేదు. ఆ తరువాత కాలంలో ఇద్దరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లను ప్రభుత్వం ఎటువంటి కారణాలు లేకుండా బదిలీ చేసింది. ఆ తర్వాత 2017లో 862.22 ఎకరాలను తొలగిస్తూ ఆలయ భూముల జాబితాను ప్రచురించారు. వాస్తవానికి ఈ జాబితా ప్రకటన దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే జరగాలి. ఇక్కడ ఈ నిబంధన అమలు కాలేదు. కేవలం దేవదాయ శాఖ కమిషనర్ నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని పేర్కొంటూ 862.22 ఎకరాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానంగా టీడీపీ నేతలు ఈ భూములను ఆక్రమించేందుకు ఈ తతంగం మొత్తం నడిపారని దేవదాయ శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వానికి నివేదిక సింహాచలం ఆలయ భూముల వ్యవహారాలతో పాటు మాన్సాస్ ట్రస్టు భూముల అక్రమాలపై దేవదాయ శాఖ అధికారులు చేపట్టిన విచారణ నివేదికను గత నెల 16న ఆ శాఖ కమిషనర్‌కు సమర్పించారు. ప్రధానంగా ఆలయ ఆస్తులను కాజేసేందుకే తొలగింపు వ్యవహారం నడిచిందని.. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే ఆలయానికి చెందిన భూములు, ఆస్తులను లీజులకు ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ భూములు ఎవరు ఆక్రమించారు, ఆలయ భూములను లీజుకు ఇవ్వడంలో నిబంధనలను ఎలా తొక్కిపట్టారు, ఎవరికి లీజుకు ఇచ్చారు, ఎవరి ఒత్తిడి ఉందనే కోణంలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపితే మరింత మంది ‘పచ్చ దొంగలు’ బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
అప్పన్న సన్నిధిలో ధన్‌రాజ్
సింహాచలం(పెందుర్తి): శ్రీవరాహలక్ష్మీనృసిం హస్వామిని బుధవారం సినీహాస్యనటుడు ధన్‌రాజ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. -
అప్పన్న దూరదర్శన్
సింహాచలం అప్పన్న నిజరూపదర్శన భాగ్యం కలిగేది ఒకే ఒక్క రోజు.. ఏడాదంతా చందన శోభితుడైన సింహాచలేశుడు.. ఆ గంధపు పూత నుంచి బయల్వెడలి నిజరూప దర్శనం కల్పించేరోజు. అది చందనోత్సవం రోజు. అంత శుభప్రదమైన దినాన దురదృష్టం కొద్దీ సింహాచల ఆలయ అధికారుల నిజ(స్వ)రూపం బట్టబయలై భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆలయ అధికారులు, దళారులు ఇదే తడవుగా చందనస్వామి దర్శనాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం.. నిష్కర్షగా చెప్పాలంటే అయినకాడికి డబ్బులు దండుకోవడం భక్తజనకోటికి మనోక్లేశాన్ని మిగిల్చింది. సంపన్నులకు, అస్మదీయులైన వీఐపీలకు దగ్గరుండి అంతరాలయ దర్శనాలు చేయించిన అధికారులు, దళారులు.. సామాన్యభక్తులకు ‘దూరదర్శన’ భాగ్యం మాత్రమే కల్పించడం విమర్శలకు తావిచ్చింది. 20 అడుగుల దూరం నుంచి కేవలం లిప్తపాటు దర్శనం కల్పించిన అధికారుల తీరు సర్వదా ఖండనలను పాత్రమైంది. అయితేనేం.. ఏదైనా తమకేంటన్న అధికారుల తీరు మారకపోవడమే విస్తుగొలిపింది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఏడాదంతా చందనపు పూతల చాటున ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే సింహగిరిపై కొలువైన వరాహ లక్ష్మీనృసింహస్వామి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిజరూపాన్ని దర్శించి తరించేందుకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచే సింహాచలం చేరుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఆలయ అధికారులు కేవలం లిప్తపాటు మాత్రమే దర్శనానికి అనుమతినివ్వడం, భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం, వీఐపీలకు, దళారులకు మాత్రమే అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది కూడా ఆలయనిబంధనలకు, భక్తుల మనోభావాలకు విరుద్ధంగా చందనోత్సవ నిర్వహణ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ వంశపారంపర్య అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు దంపతులు, కుటుంబసభ్యుల తొలి దర్శనం తర్వాత అర్ధరాత్రి 2.15 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచే క్యూల్లో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తూనే ఒక్కసారిగా వీఐపీల గేట్లు తెరిచేశారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా.. ’గంట’లసేపు మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, వీఐపీలు తదితర ప్రముఖులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు అనుమతిస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఈవో చంద్రమోహన్ కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. చందనోత్సవం రోజు వచ్చేసరికి ప్రొటోకాల్ నిబంధనలన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే ప్రొటోకాల్ దర్శనాలు మొదలైపోయాయి. దీంతో రూ.500, రూ.200లు టికెట్లు కొనుక్కొని క్యూల్లో నిలుచున్న భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా టికెట్లకు తొందరగానే దర్శనం అందుతుందని చెప్పిన అధికారులు తీరా ప్రొటోకాల్ దర్శనాల దెబ్బకు మూడు, నాలుగు గంటలపైనే పట్టింది. ఇక ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 3 గంటలకు పది వాహనాల్లో సుమారు 70 మందినిపైగా తీసుకుని వచ్చి ఆలయంలో హల్చల్ చేశారు. దాదాపు గంటకు పైగా ఆయన ఆలయంలోనే ఉండిపోవడంతో క్యూలైన్లన్నీ స్తంభించిపోయాయి. ఆయన ఆలయంలో ఉన్నంతసేపు క్యూలైన్లు కదల్లేదు. ఆ తర్వాత గంటా సతీమణి ఓ 30 మందిని తీసుకుని ఆలయంలోకి వచ్చారు. అప్పుడు కూడా సామాన్య భక్తుల క్యూలైన్లు నిలిచిపోయాయి. ప్రొటోకాల్ దర్శనాల వేళలకు ముందుగానే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఓ మంది అనుచరులతో వచ్చి ఆలయంలో హడావుడి చేశారు. సామాన్య భక్తులకు లిప్తకాలం.. ఆలయ సిబ్బంది దూషణ పర్వం సింహాచలం అప్పన్న ఆలయ ఆచారాలకు విరుద్ధంగా భక్తులకు ఈసారి కేవలం ఒకటి రెండు సెకన్ల పాటే దర్శనం కల్పిస్తూ అధికారులు, ఆలయ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. లఘుదర్శనం అని ప్రకటించినప్పటికీ ఎంతోదూరం నుంచి వచ్చిన భక్తులను అర నిమిషం కాదు కదా.. పదిసెకన్లు కూడా దర్శనానికి అనుమతివ్వకుండా లాగిపడేశారు. ఒకింత వారించిన భక్తులపై సిబ్బంది దూషణ పర్వానికి దిగారు. స్వామి వారి విగ్రహం ఎదురుగూండానే పత్రికల్లో రాయలేని భాష పదేపదే ప్రయోగిస్తూ ఆలయ సిబ్బంది సామాన్యభక్తులపై ప్రతాపం చూపించారు. డిప్యుటేషన్ సిబ్బంది ఎక్కడ? చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి 150 మంది దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉద్యోగులు డెప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చారు. విధి నిర్వహణలో మాత్రం వారు ఎక్కడున్నారు.. ఏం చేశారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. విధుల కేటాయింపులో పక్కా ప్రణాళిక లేకపోవడంతో చాలా మంది విధులు నిర్వర్తించకుండా ఎవరి పనివారు చూసుకున్నారన్న వాదనలు ఉన్నాయి, పర్యవేక్షించాల్సిన ఈవో రామచంద్రమోహన్ వీఐపీల సేవలో తరించడం, మిగిలిన అధికారులు ప్రొటోకాల్ సేవల్లో మునిగిపోవడంతో డిఫ్యూటేషన్ సిబ్బంది ‘â¶పని’తనం గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. రూ. వెయ్యి టిక్కెట్లు ఎన్ని? వెయ్యి రూపాయల వీఐపీ టికెట్లను ఈసారి 8 వేలు ముద్రించామని, బ్యాంకుల్లోనే విక్రయాలు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఆ మేరకు బ్యాంకుల్లో మంగళవారం సాయంత్రం వరకు విక్రయాలు చేశారు. బుధవారం ఆయా టికెట్లు తీసుకొచ్చిన వారి సంఖ్య 15 వేల మందికిపైగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 8 వేల టికెట్లు ముద్రిస్తే 15 వేల మంది ఎలా వచ్చారు.. బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు పక్కనపెడితే ఎవరైనా నకిలీ టికెట్లు ముద్రించారా... అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందా.. అన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి, ఈ టికెట్లపై స్వయంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తీరుమారని రామచంద్ర? అప్పన్న ఆలయ కార్యనిర్వహణాధికారిగా కె.రామచంద్రమోహన్ ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఓ ఈవో ఐదేళ్లపాటు నిరాటంకంగా కొనసాగడం అనేది ఎక్కడా లేదు.. కానీ రామచంద్రమోహన్ శైలే వేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్యనేతల అడుగులకు మడుగులొత్తుతూ నిరాటంకంగా ఐదేళ్లుగా ఉన్నారంటేనే ఆయన పైరవీల ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా చలించని ఈవో ఈ ఏడాది మాత్రం విమర్శలకు తావివ్వకుండా దర్శన ఏర్పాట్లు చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ చందనోత్సవం రోజు వచ్చిసరికి తనదైన రీతినే కొనసాగించారు. యథావిధిగా వీఐపీల సేవలోనే తరించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వేళ కాని వేళల్లో వీఐపీలను గంటల తరబడి అనుమతించారు. సర్వదర్శనానికి, టికెట్లు కొనుగోలు చేసి వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్ల గురించి కనీసమాత్రంగా కూడా పట్టించుకోలేదు. -
అప్పన్న చందనోత్సవంలో దివ్యాంగులకు ఇబ్బందులు
-
‘దేవాలయాల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైంది’
-
‘రాజకీయ పెత్తనం ఎక్కువైంది.. మంచిది కాదు’
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా పెందుర్తి శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చందనోత్సవం సందర్బంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కానీ ఆలయంపై రాజకీయ పెత్తనం ఎక్కువ అయింది. ఇది మంచిది కాదు. వీఐపీ పాసులు పూర్తి జబర్దస్తీగా తీసుకోవటం, ఎవరిని బడితే వారిని రప్పించడంతో భక్తులకు ఆటంకం కలిగింది. ఈ ఘటన దేవాదాయ శాఖకు పెద్ద మచ్చ. అసలు ఆలయాలను భక్తులకు చేరువలో ఉండేలా చేయాలి గానీ రాజకీయ నాయకులు పెత్తనం చేయడం దారుణం. శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్నలు పేదల దేవుళ్లు.. అలాంటి దేవుళ్లను పేదలకే దూరం చేయడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా దేవాదాయ శాఖలో మార్పులు తీసుకురావాల’ని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సింహాచలం(పెందుర్తి) : చందనచర్చిత స్వామి నిజరూప దర్శన వేళ. సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, భార్య సునీలా గజపతిరాజు, సుధా గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్ తదితరులు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకున్నారు. మరోవైపు టీటీడీ నుంచి ఈవో అశోక్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్నకు చందనం, పట్టువస్త్రాలు సమర్పించగా, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి ఈఓ పద్మ పట్టువస్త్రాలు అందచేశారు. ఇక ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కుటుంబీకులు, హోంమంత్రి చినరాజప్ప, ఆయన కుటుంబసభ్యులు మంత్రి గంటా కుటుంబీకులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు బుధవారం వేకువజామున ఒంటి గంట నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులనుదర్శనాలకు అనుమతించారు. రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగధార నుంచి 1000 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవస్వాములు నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు. విధుల్లో 1200మంది పోలీసులు చందనోత్సవాన్ని పురస్కరించుకుని పలు శాఖల సమన్వయంతో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేశారు. నగర సంయుక్త పోలీస్ కమిషనర్ రవికుమార్ మూర్తి ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 12 వందల మంది పోలీసులు చందనోత్సవ విధుల్లో ఉంటారని తెలిపారు. వారికి షిఫ్టులు కేటాయించామన్నారు. దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్ సృజన, కమిషనర్ హరినారాయణన్ సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను విశాఖ ఇన్చార్జి కలెక్టర్ సృజన పరిశీలించారు. ఆలయ నీలాద్రి గుమ్మం, దక్షిణ మార్గం, ఉత్తర ద్వారం, భక్తులు వేచి ఉండే క్యూలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ కొండ దిగువన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు : మంత్రి గంటా చందనోత్సవంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. బందోబస్తుకు చేరుకున్న పోలీసులు చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు నిన్న సాయంత్రానికే సింహగిరికి చేరుకున్నారు. పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ నుంచి ఎలాంటి వాహనాలు అడవివరం ప్రధాన రహదారిలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. చందనోత్సవ దర్శన సమయాలు ఉచిత దర్శనం : తెల్లవారుజాము 4 గంటల నుంచి రూ.200, 500 టిక్కెట్ల దర్శనం : ఉదయం 4గంటల నుంచి ప్రొటోకాల్ వీవీఐపీల దర్శనాలు : ఉదయం 5 నుంచి 6గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు రూ.1000 వీఐపీల దర్శనాలుః ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు -
అపచారంపై అపచారం!
సాక్షి, విశాఖపట్నం:సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆపచారంపై అపచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆలయంలో చోటు చేసుకుంటున్న పలు అవాంఛనీయ సంఘటనలతో భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి తిలోదకాలివ్వడం, సుప్రభాత, పవళింపు సేవల్లో అన్యాయాలు, అర్చకుల్లో ఆధిపత్య పోరు వంటి ఘటనలు వెలుగు చూశాయి. కొద్దిరోజుల క్రితం రాజభోగం సమయంలో ఓ మహిళ గర్భ గుడిలో ఉండడం తీవ్ర దుమారం రేపింది. దీనిని అపచారంగా భావించిన భక్తజనం నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాక్షాత్తూ ఆలయ ఉద్యోగే అపచారానికి పాల్పడ్డాడు. పరమ పవిత్రంగా భావించే స్వామి ఉత్తర ద్వారం సమీపంలో సూరిబాబు అనే నాలుగో తరగతి ఉద్యోగి బహిరంగంగా, పట్టపగలు మూత్ర విసర్జన చేశాడు. దానిని కొంతమంది భక్తులు కెమెరాలో బంధించారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
అన్యమతస్తులకు ప్రసాదం తయారీ కాంట్రాక్ట్?
సింహాచలం(పెందుర్తి): వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర విక్రయాలు జరుపుతార న్న సంగతి తెలిసిందే. వీటిని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఏటా దేవస్థానం ఈప్రొక్యూర్‌మెంట్, సీక్రెట్ టెండర్ ద్వారా ప్రసాదాల కాంట్రాక్ట్‌ను ఇస్తుంటుంది. వీటిల్లో తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కు ప్రసాదాల కాంట్రాక్ట్ ఇస్తుంది. సదరు కాంట్రాక్టర్ పులిహోర ప్యాకింగ్, శ్రీ వైష్ణవస్వాములతో లడ్డూను తయారుచేయించడం, సిబ్బంది చేత లడ్డూలను చుట్టించడం చేయాలి. దేవాదాయశాఖ రూల్ ప్రకారం టెండర్లు వేసి, వాటిని దక్కించుకునే వారంతా హిందువులే అయి ఉండాలి. ఇప్పటివరకు అలాగే కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమైన కొత్త కాంట్రాక్ట్‌కు సంబంధించి దేవస్థానం టెండర్లు పిలిచింది. అందులో ఈప్రొక్యూర్‌మెంట్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాజ్ సెక్యూరిటీ సర్వీసెస్ తక్కువ కోడ్ చేసి టెండరు కైవసం చేసుకుంది. సంబంధిత సెక్యూరిటీ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ టెండరు దాఖలు చేశారు. టెండరు తక్కువ ధరకు కోడ్ చేయడంతో అతనికి కాంట్రాక్ట్‌ని దేవస్థానం అధికారికంగా అందజేసింది. ఫిబ్రవరి నుంచి ఇందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. అయితే సదరు కాంట్రాక్టర్ అన్యమతస్తుడని, ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అతడికి ఎలా అప్పగిస్తారన్న ఆరోపణలు రెండు రోజుల నుంచి చోటుచేసుకున్నాయి. విచారణ చేయిస్తాం దేవాదాయశాఖ రూల్స్ ప్రకారం ప్రసాదాల టెండ రు దాఖలు చేసేవాళ్లు, తీసుకునేవారు హిందువు అయి ఉండాలి. టెండరు రూల్స్ ప్రకారం కాంట్రాక్టు పొందిన వ్యక్తి తాను హిందువునని డిక్లరేషన్‌లో పేర్కొన్నాడు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఇలాటి విధులు నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని కొన్నేళ్ల నుంచి అందిస్తున్నట్టు డిక్లరేషన్‌లో తెలిపారు. దేవాదాయశాఖ నిబంధనలకు కట్టుబడి పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నానని, అన్యమతానికి చెందినవాడిని కాదని తెలిపారు. అయినా అతను హిందువో కాదో విచారణ జరిపిస్తాం. అతను అన్యమతస్తుడైతే కాంట్రాక్ట్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – కె.రామచంద్రమోహన్, ఈవో సింహాచలం దేవస్థానం -
26న సింహగిరిపై శ్రీకృష్ణాష్టమి
ఆ రోజు రాత్రి 7 గంటల వరకే అప్పన్న దర్శనాలు 27న ఉట్ల సంబరం సింహాచలం : సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 26న శ్రీకృష్ణాష్టమిని వైభవంగా నిర్వహించనున్నట్టు సింహాచలం దేవస్థానం ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ తెలిపారు. ఆ రోజు బేడా మండపంలో శ్రీకృష్ణ జననోద్ధారణ పూజలు విశేషంగా నిర్వహిస్తామని సోమవారం విలేకరులతో చెప్పారు. బాలకృష్ణుడికి విశేష అభిషేకాలు చేస్తామన్నారు. 27న సాయంత్రం 4 గంటలకు ఉట్ల సంబరాన్ని నిర్వహిస్తావన్నారు. ఈ ఉత్సవంలో స్వామి శ్రీకృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 26న రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. -
అప్పన్న సేవలో ఐజీ
సింహాచలం : ఇంటెలిజెన్స్ ఐజీ చంద్రశేఖరరావు వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనంచేసుకుని అంతరాలయంలో పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆయన కుటుం బానికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ అందజేశారు.