విద్య సమాచారం, పరీక్ష ఫలితాలు
ఎంబీబీఎస్ ఫైనల్ పార్టు-1 ఫలితాల విడుదల
విజయవాడ, న్యూస్‌లైన్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-1 పరీక్షా ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ శుక్రవారం విడుదల చేశారు. భారతీయ వైద్య మండలి, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నియమ నిబంధనల మేరకు ఐదు గ్రేస్ మార్కులను కలిపి ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలకు సంబంధించి వ్యక్తిగత పరిశీలన, రీ టోటలింగ్‌కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చొప్పున యూనివర్సిటీ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఈ నెల 24వ తేదీలోగా వర్సిటీలో అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను అనుమతించేది లేదని విజయకుమార్ తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ http://ntruhs.ap.nic.inద్వారా తెలుసుకోవచ్చన్నారు.
17 నుంచి వెటర్నరీ పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్: వెటర్నరీ పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల పీజీ అకడమిక్ ఇన్చార్జి డాక్టర్ మాధవరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2013-14 బ్యాచ్‌కు చెందిన పీజీ, పీహెచ్డీ విద్యార్థులు పరీక్షలకు తప్పక హాజరుకావాలని సూచించారు. ఆయా విభాగాల్లో ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, 17లోపు ప్రాక్టికల్స్‌ను పూర్తి చేసేలా టైమ్ టేబుల్‌ను రూపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి
కన్వీనర్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి, జిల్లా కన్వీనర్ పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు నెట్లో హాల్‌టికెట్లను సీజీజీ.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
విజ్ఞాన్ వి-శాట్ ఫలితాలు విడుదల
గుంటూరు, న్యూస్‌లైన్: బీటెక్‌లో ప్రవేశానికి విజ్ఞాన్ విశ్వ విద్యాలయం నిర్వహించిన విజ్ఞాన్ స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(వి-శాట్-2014) ఫలితాలను స్థానిక వడ్లమూడి వర్సిటీలో వైస్ చాన్సలర్ డాక్టర్ ఎం.ఎస్.సి.బోస్ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏప్రిల్‌లో నిర్వహించిన వి-శాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 29 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 9,222 మంది అర్హత సాధించారన్నారు. బీటెక్‌లో 14 బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
వి-శాట్‌లో ప్రతిభ చూపిన తొలి 100 మంది ర్యాంకర్లకు పూర్తి ఫీజు రాయితీ కల్పిస్తామన్నారు. ఐఐటీ-జేఈఈఈలో 20 వేలలోపు ర్యాంకు, లేదా 180 పైగా మార్కులు, ఎంసెట్‌లో ఐదు వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ కల్పించనున్నట్టు చెప్పారు. వి-శాట్‌లో 101 నుంచి 300 వరకు ర్యాంకు సాధించిన వారికి 50 శాతం, 301 నుంచి 500 వరకు ర్యాంకు పొందిన వారికి 25% ఫీజు రాయితీ ఉంటుందన్నారు.