Assurances scheme
-
‘పాలమూరు’కు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు శనివారం తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఖరారు చేసిన ఈ ప్రత్యేక హామీలను సీఎం రేవంత్‌రెడ్డి తుక్కుగూడ సభ వేదికపై ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఇవ్వనున్న ప్రత్యేక హామీలివే..! 1) ఐటీఐఆర్ ఏర్పాటు 2) ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం.. కాజీపేట్ రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్–వి జయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు. 3) భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషో త్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం. 4) పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా. 5) హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం 6) కొత్త విమానాశ్రయాల నిర్మాణం 7) రామగుండం, మణుగూరు రైల్వేలైన్ 8) కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్ల ఏర్పాటు 9) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెంపు 10) నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు 11) నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు 12) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్ఈఆర్) 13) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫారిన్ ట్రేడ్ 14) నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 15) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) క్యాంపస్ 16) అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా కేంద్రం 17) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు 18) ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ యూనిట్ 19) ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్) 20) అంతర్జాతీయ స్థాయి కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ 21) మేడారం జాతరకు జాతీయ హోద 22) న్యూ డ్రైపోర్టు ఏర్పాటు 23) హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు -
పంచ ‘న్యాయ్’లతో ప్రజలకు న్యాయం చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, మహిళలు, యువత, శ్రామికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇచ్చిన ఐదు ప్రధాన గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ ఐదు ‘న్యాయ్’ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి, అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిం చాలని నిర్ణయించింది. పి.చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ, మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి, ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, ప్రియాంక గాం«దీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన ‘భారత్ వెలిగిపోతోంది’ నినాదానికి ఏ గతి పట్టిందో, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలకు అదే గతి పడుతుంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. -
చనిపోరుున వారికీ ‘అభయహస్తం’ !
పర్వతగిరి : అభయహస్తం జాబితాలో చనిపోరుునవారికీ చోటుదక్కింది. అదే సమయంలో అర్హులకు మొండి చేయే మిగిలింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఆరు నెలల తర్వాత అభయహస్తం పింఛన్ల డబ్బులు విడుదల కాగా... పంచాయతీ కార్యాలయంలో అధికారులు శనివారం ఆ పథకం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించారు. గ్రామంలో మొత్తం 55 మంది లబ్ధిదారులు ఉండగా... ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆరు నెలల డబ్బులు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అభయహస్తం లబ్ధిదారుల జాబితా చూసిన స్థానిక సర్పంచ్ గోనె విజయలక్ష్మి, గ్రామస్తులు అవాక్కయ్యారు. అర్హులైన వారిని పక్కనబెట్టి ఐదేళ్ల క్రితం చనిపోయిన తొమ్మిది మందికి డబ్బులు మంజూరు చేయడంపై సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్కెర్ల వీరమ్మ, చెన్నూరి కట్టమ్మ, తోపుచర్ల అనసూర్య, తీగల సాయమ్మ, బాసాని సోమక్క, కొప్పు చంద్రమ్మ, ఉడుగుల కొంరమ్మ, చీదురు లక్ష్మి, ఎండీ.అంకూస్ ఎప్పుడో చనిపోయూరని, వారికి అభయహస్తం జాబితాలో చోటుకల్పించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అర్హులై ఉండి జాబితాలో పేర్లు రాని వారి వివరాలను ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అనంతరం ఆ తొమ్మిది మంది పోను మిగిలిన లబ్ధిదారులకు ఆరు నెలల పింఛన్ డబ్బులు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందజేశారు.