‘నిలువురాళ్ల’పై తొలగిన అపోహలు
సాక్షి’ కథనానికి అపూర్వ స్పందన
► పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు
► నేడు సీఎంను కలవనున్న పురావస్తుశాఖ అధికారులు
కృష్ణా/మాగనూర్: మహబూబ్నగర్ జిల్లా కృష్ణా మండలం ముడుమాలలో నిలువురాళ్లపై ఆదివారం ‘ఈ గండ శిలల గుండెల్లో ఖగోళం గుట్టు’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇన్నాళ్లూ ఈ రాళ్లపై ఉన్న అపోహలు, భయాలను ఈ కథనం తొలగించిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇది దెయ్యాల గడ్డ అని, బంగారు నిక్షేపాలు ఉన్నాయని, దేవతల నివాస ప్రాంతమని చెప్పుకునేవారు. అయితే ఇది వేల ఏళ్ల కిందటే ఏర్పాటైన ‘ఖగోళశాస్త్ర పరిశోధనశాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)’ అని సాక్షి కథనంలో వివరించింది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సంవత్సరంపాటు ఈ ప్రాంతంపై అధ్యయనం చేసి 2010లోనే ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు.
ప్రపంచంలో ఎక్కడా లేని చారిత్రక సంపద ముడుమాలలో ఉందని పేర్కొన్నారు. అప్పట్నుంచే ఈ నిలువురాళ్ల విషయంపై బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. ఈ నిలువురాళ్లు దాదాపు 60 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో పొలం యజమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఒకవేళ ఈ భూములను తీసుకుంటే మార్కెట్ ధర ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.
సీఎంను కలవనున్న అధికారులు
ముడుమాలలో నిలువురాళ్లపై రాష్ర్ట పురావస్తు శాఖ అధికారులు సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి నివేదికను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ రాములు నాయక్ తెలిపారు. ముడుమాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిందిగా సీఎంను కోరతానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. నిలువురాళ్ల చారిత్రక నేపథ్యంతో తమ గ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ముడుమాల సర్పంచ్ ఆశోక్గౌడ్ పేర్కొన్నారు.