నాసిక్‌ను బొగ్గుగా మార్చారు
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారాలు మరింత జోరందుకుంటున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరాహోరిగా ప్రచారాలు చేస్తున్నారు. లోణావాలలో సోమవారం మధ్యాహ్నం బీజేపీ, ఆర్పీఐ కూటమి బహిరంగా సభ జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించడానికి ముందు కొద్ది సేపు ఆర్పీఐ అధ్యక్షుడు ఆఠవలే మాట్లాడారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై ఘాటుగా విమర్శలు చేశారు.
రెండు రోజుల కిందట రాజ్ తన ప్రసంగంలో ఆఠవలేపై మిమిక్రీ చేశారు. వ్యంగంగా మాట్లాడి అందరినీ నవ్వించారు. అందుకు ఆఠవలే కూడా అదే శైలిలో రాజ్‌పై మిమిక్రీ చేస్తూ ధీటుగా సమాధానమిచ్చారు. ఒక్కసారి తనకు అధికారమిస్తే రాష్ట్రాన్ని బంగారంగా మారుస్తానని చెప్పిన రాజ్ నాసిక్ కార్పొరేషన్‌ను బొగ్గుగా మార్చారని ధ్వజమెత్తారు.
అమిత్ షా ప్రసంగం...
అమిత్ షా మాట్లాడుతూ.. ‘మావల్ తాలూకా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పర్శవల్ల పావనమైంది. ఇక్కడి నుంచి శివాజీ యుద్ధం చేసి అనేక మంది శత్రువులను మట్టుబెట్టారు. ఇదే తరహాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలను మట్టుబెట్టాల’ని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై కాల్పులు జరిపించిందని, కాల్పులు జరపాలని ఆసక్తి ఉంటే పాకిస్థాన్ సరిహద్దులోకి వెళ్లి జరపాలని చురకలంటించారు. మీ పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అజీత్ పవార్‌ను ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఓ నాయకుడు మిమిక్రీ చేయడంలో ఆరితేరినాడ ని రాజ్‌ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అఠవలే కప్పలాగా దూకుతారని రాజ్ విమర్శలకు సమాధానిమిస్తూ ఆయన పులిలాగా పంజా విసురుతారని అన్నారు. ఒకవేళ ఆ పంజా మీపై విసిరితే అప్పుడు పరిస్థితి ఏంటని రాజ్‌ను నిలదీశారు.
అనవసరంగా ఒకరిపై మిమిక్రీ చేయవద్దని హితవు పలికారు. ఈ ఎన్నికల్లో రాజ్‌కు కేవలం నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇలాంటి వ్యక్తి చేతుల్లోకి మహారాష్ర్ట పగ్గాలు వెళ్తే రాష్ట్రాన్ని తగలబెడతారని దుయ్యబట్టారు. ఆ తరువాత మంటలను ఆర్పివేయలేక మనం ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.