automatic rifles
-
అతిథులను థ్రిల్‌కు గురి చేసిన కొత్తజంట
కోహిమ : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి. అయితే ఓ పెళ్లిలో వధూవరులు చేసిన పని.. వారికే కాకుండా ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు కూడా థ్రిల్‌ని పరిచయం చేసింది. పెళ్లి వేడుకలో పూలు, పళ్లు, రకరకాల బహుమతులతో ఫొటోలకు పోజివ్వడం సరిపోదన్నట్టుగా ఓ జంట తుపాకులు చేతబూనారు. ఏకే 56, ఎం16 గన్లు పట్టుకుని ఫొటోలు దిగారు. దీంతో అక్కడికొచ్చిన అతిథులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాలు.. నాగా వేర్పాటువాద నాయకుడు బహతో కిబా కొడుకు వివాహం దిమాపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నూతన దంపతులు ఆటోమాటిక్ రైఫిల్స్ ఏకే 56, ఎమ్16లను పట్టుకుని ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే, తుపాకులు పట్టుకుని ఫొటోలు దిగడమేంటని అక్కడికి వచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. పబ్లిక్‌లో మారణాయుధాలతో ఫొటోలేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే బహతో కిబాకు విమర్శలపాలడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ జర్నలిస్టులను చంపుతానని బెదిరించి ఆయన పతాక శీర్షికల్లో నిలిచాడు. -
అత్యాధునిక ఆయుధాలు.. పది నిమిషాల్లో దాడి పూర్తి
మొత్తం పది మంది సాయుధులు.. అత్యాధునిక ఆయుధాలు.. పక్కా ప్లానింగ్.. జైలు లోపల ఖలిస్తాన్ చీఫ్ సహా ఐదుగురు ఉగ్రవాదులు. వాళ్లను తప్పించేందుకు చేసిన ఆపరేషన్ మొత్తం సరిగ్గా పదే నిమిషాల్లో ముగిసిపోయింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూను తప్పించేందుకు చేసిన ఈ ఆపరేషన్ కోసం వాళ్లంతా పోలీసు యూనిఫాంలు ధరించి వచ్చారు. పది ఉగ్రవాద కేసులలో నిందితుడైన కేఎల్ఎఫ్ చీఫ్‌ను పట్టుకోవడం అప్పట్లో పంజాబ్ పోలీసులకు పెద్ద విజయమే. అయితే.. పారిపోయిన మింటూను మళ్లీ పట్టుకోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఐదుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాడ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సాయుధులు పోలీసు దుస్తుల్లో ఉండి.. తనిఖీ కోసం ఓ ఖైదీని తీసుకొచ్చామని జైలు భద్రతా సిబ్బందికి చెప్పారు. చేతులకు బేడీలు వేసి ఉన్న ఓ వ్యక్తిని తీసుకుని జైలు ప్రధాన గేటు వద్దకు వచ్చారు. దాంతో వాళ్ల వాహనాలను జైల్లోకి అనుమతించారు. టయోటా ఫార్చూనర్ సహా రెండు వాహనాల్లో వచ్చిన ఆ ఉగ్రవాదులు.. నేరుగా లోపలకు వెళ్లిపో్యారు. ఉదయం 9 గంటల సమయంలో లోపలకు ప్రవేశించిన ఆ పదిమంది.. దాదాపు వంద రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో జైల్లో భీకర వాతావరణం సృష్టించి, తమకు కావల్సిన వాళ్లను పదే నిమిషాల్లో తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. జైలు భద్రతా సిబ్బంది వద్ద అంత ఆధునిక ఆయుధాలు లేకపోవడంతో వాళ్లను ఎదిరించడం సాధ్యం కాలేదు. జైలు సిబ్బంది వద్ద ఉన్న ఓ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను కూడా వాళ్లు తీసుకుపోయారు. జైల్లో ఉన్న ఖైదీలంతా టిఫిన్ చేయడానికి బ్యారక్స్ నుంచి బయటకు వచ్చే సమయం చూసుకుని సరిగ్గా అప్పుడే లోపలకు ప్రవేశించారు. ముందుగానే తమవాళ్లకు చెప్పి ఉంచడంతో.. వాళ్లు సులభంగా వీళ్ల వాహనాల్లోకి చేరుకున్నారు. కాల్పులు కొనసాగుతుండగానే ఖలిస్తాన్ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.