Automatic system
-
ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
ఏవైనా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ఇంటి పక్కనున్న కిరాణా దుకాణానికో లేదా మార్కెట్‌కు వెళుతుంటాం. పెద్ద పట్టణాలు, నగరాల్లో అయితే షాపింగ్ స్టోర్‌కు వెళుతుంటారు. షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక, బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి, క్యాష్ పే చేస్తుంటాం. అయితే దుబాయ్‌లోని ఆ స్టోర్‌లో క్యాషియర్ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్‌లో క్యాష్ ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈలోని దుబాయ్ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్ కెరెఫోర్ మినీ అనే షాపింగ్ స్టోర్ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది. ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్‌ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్ పూర్తయిన తరువాత పేమెంట్ ఆదే ఫోను ద్వారా చేయాల్సివుంటుంది. కెరెఫోర్ సీఈఓ హనీ వీస్ మాట్లాడుతూ భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి.. -
ఆటోమేటిక్ చెల్లింపులకు ఏప్రిల్ గండం..!
ముంబై: మొబైల్ బిల్లుల నుంచి కరెంటు, నీరు తదితర బిల్లుల దాకా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం ఆటోమేటిక్ విధానాన్ని పాటిస్తున్న కస్టమర్లు రాబోయే ఏప్రిల్‌లో సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్దేశించిన ప్రీ–డెబిట్ నోటిఫికేషన్ నిబంధనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటం, బ్యాంకులు.. కార్డు సంస్థలు మాత్రం ఇంకా వీటిని పాటించేందుకు పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం ఇందుకు కారణం. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ సర్వీసులకు, భారతి ఎయిర్టెల్.. వొడాఫోన్ వంటి టెల్కోలకు, టాటా పవర్ వంటి విద్యుత్ సంస్థలకు ఆటోమేటిక్ విధానంలో బిల్లులు కడుతున్న కస్టమర్లు ఇబ్బందులు పడనున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చి 31 డెడ్‌లైన్.. సాధారణంగా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం పలువురు బ్యాంక్ కస్టమర్లు ఆటోమేటిక్ డెబిట్ విధానం ఎంచుకుంటూ ఉంటారు. దీని ప్రకారం నిర్దేశిత తేదీ నాడు బ్యాంకులు ఆయా బిల్లుకు కట్టాల్సిన మొత్తాలను వారి ఖాతాల నుంచి డెబిట్ చేస్తుంటాయి. సాధారణ ఖాతాదారులు, చిన్న..మధ్య తరహా సంస్థలు మొదలుకుని కార్పొరేట్ సంస్థల దాకా పలువురు కస్టమర్లు .. నెలవారీ బిల్లుల చెల్లింపులకు ఇలాంటి ఆటోమేటిక్ విధానాన్నే పాటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఇలాంటి లావాదేవీల పరిమాణం సుమారు రూ. 2,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. ఇంత కీలకంగా ఉన్న ఆటోమేటిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం... ఇకపై ఇలా పేమెంట్ జరిపే తేదీకి అయిదు రోజులు ముందే కస్టమరుకు బ్యాంకులు డెబిట్ లావాదేవీ గురించి నోటిఫికేషన్ పంపాల్సి ఉంటుంది. కస్టమరు అనుమతించిన తర్వాతే డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రూ. 5,000 దాటిన రికరింగ్ చెల్లింపుల కోసం ఖాతాదారుకు వన్–టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా పంపాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలపై దృష్టి .. 2019 ఆగస్టులో ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1తో మొదలయ్యే వచ్చే ఏడాది (2021–22) నుంచి అమల్లోకి వస్తున్నాయి. బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు, ఆన్లైన్ విక్రేతలు తదితర వర్గాలు వీటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, పలు దిగ్గజ బ్యాంకులు, సంస్థలు ఈ నిబంధనలను పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంకా పూర్తి చేసుకోలేదని చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ’స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్’ను అమలు చేయలేమంటూ కస్టమర్లకు బ్యాంకులు సమాచారం ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులతో పాటు ఎమెక్స్ వంటి కార్డ్ సంస్థలూ ఆటోమేటిక్ లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉం ది. ఈ నేపథ్యంలో డెబిట్/క్రెడిట్ కార్డులు మొదలైన వాటి ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరుగుతున్న సర్వీసులకు పేమెంట్ నిల్చిపోయి, సేవలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో చెల్లింపులకు ప్రత్యామ్నాయ మార్గాలపై కస్టమర్లు దృష్టి పెట్టాల్సి రానుంది. వ్యక్తిగతంగా ఆయా సంస్థల వెబ్సైట్ల ద్వారా పేమెంట్స్ చేయాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
పన్ను సమాచార మార్పిడికి జీ20 ఓకే
కెయిర్న్స్: విదేశీ పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట దిశగా జీ20 దేశాల కూటమి మరో కీలక ముందడుగు వేసింది. ఆటోమేటిగ్గా ఆయా దేశాల మధ్య పన్నుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను అమలు చేసేందుకు కట్టుబడాలని నిర్ణయించాయి. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల రెండు రోజుల సమావేశం ముగింపు అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో విషయాన్ని వెల్లడించారు. పన్నుల సమాచారాన్ని జీ20, అదేవిధంగా ఇతర దేశాలు అటోమేటిక్ రూట్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం కోసం ప్రపంచస్థాయి యంత్రాంగాన్ని 2017కల్లా లేదంటే 2018 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని సమావేశం తీర్మానించినట్లు ప్రకటన పేర్కొంది. విదేశాల్లో నల్లధనాన్ని వెనక్కిరప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్‌కు ఈ ఆటోమేటిక్ యంత్రాంగం చాలా ఉపయోగపడనుంది. పన్ను ఎగవేత ఆరోపణలు లేదా నిర్ధిష్టంగా ఏదైనా దేశం కోరితేనే ప్రస్తుతం పన్నుల సమాచారాన్ని ఇతర దేశాలు అందిస్తున్నాయి. దీని స్థానంలో ఆటోమేటిక్ సమాచార మార్పిడి వ్యవస్థను పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) రూపొందించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ చాన్నాళ్లుగా ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్ తరఫున వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్లు జీ20 సదస్సుకు హాజరయ్యారు. కంపెనీలు ఎక్కడైతే లాభాలు గడిస్తున్నాయో... అక్కడే పన్నులు చెల్లించాలన్న వాదనపైనా సమావేశం దృష్టిపెట్టింది. లాభాల తరలింపునకు అడ్డుకట్టవేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికలను 2015కల్లా ఖరారు చేయనున్నారు. ప్రపంచ జీడీపీకి మరో 2 ట్రిలియన్ డాలర్లు జత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మరిన్ని చర్యలను చేపట్టాలని జీ20 సమావేశం పిలుపునిచ్చింది. 2018కల్లా ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మరో 2 శాతం అదనపు వృద్ధిని జతచేసేందుకు కృషిచేయనున్నట్లు పేర్కొంది. అంటే జీడీపీని 2 ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.120 లక్షల కోట్లు) మేర పెంచాలనేది లక్ష్యం. నవంబర్‌లో బ్రిస్బేన్‌లో జరగనున్న జీ20 సదస్సు నా టికి వృద్ధి పెంపునకు తగిన చర్యలు, ప్రణాళికలను రూపొందించనున్నట్లు జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు చెందిన మొత్తం 20 దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 85% వాటా వీటిదే. ప్రపంచ జీడీపీకి 1.8 శాతం అదనపు వృద్ధిని జోడించడం సాధ్యమేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)-ఓఈసీడీ అంచనాలు చెబుతున్నాయని.. మరో 0.2% పెంచడానికి కట్టుబడాలని జీ20 దేశాలు నిర్ణయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3.4%గా ఉండొచ్చు. వచ్చే ఏడాది 4%కి మెరుగుపడుతుందని అంచనా. కాగా, ఐఎంఎఫ్‌లో కోటా, పాలన సంస్కరణలు కూడా జీ20 దేశాలకు ప్రాధాన్య అంశమని సమావేశ ప్రకటన పేర్కొంది. వీటి ఆమోదం కోసం అమెరికాను ఒప్పించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. కోటా సంస్కరణలు అమలైతే భారత్‌కు ఐఎంఎఫ్‌లో ఓటింగ్ హక్కుల వాటా ఇప్పుడున్న 2.44% నుంచి 2.75 శాతానికి పెరుగుతుంది.