వీహెచ్‌పీ యాత్ర కు బ్రేక్
అయోధ్య/న్యూఢిల్లీ/లక్నో: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివాదాస్పద అయోధ్య యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం బ్రేక్ వేసింది. వీహెచ్‌పీ అగ్రనేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 1,700 మందిని అరెస్టు చేసింది. వీహెచ్‌పీ సరయూ ఘాట్ నుంచి అయోధ్య వరకు ‘చౌరాసీ కోసీ పరిక్రమ యాత్ర’ పేరుతో 252 కి.మీ.(84 కోసులు) యాత్రను ప్రారంభించాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ యాత్ర మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందంటూ యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం అరెస్టులు, ఉద్రిక్తత మధ్యనే వీహెచ్‌పీ ఈ యాత్రను అయోధ్యలో ప్రారంభించింది. దీంతో అయోధ్యలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఒక్క ఫైజాబాద్ జిల్లాలోనే 625 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుతామని శాంతి భద్రతల ఐజీ ఆర్కే విశ్వకర్మ తెలిపారు.
భారీ భద్రత, అరెస్టులపై నిరసన..
ఆరు నూరైనా యాత్ర చేసి తీరతామని వీహెచ్‌పీ స్పష్టం చేయడంతో ఆదివారం యూపీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. యాత్ర కోసం అయోధ్య చేరుకున్న తొగాడియాను గోలాఘాట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న సింఘాల్‌ను అక్కడి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సింఘాల్ అయోధ్యకు వెళ్తానని పట్టుబట్టడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టుపై సింఘాల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూపీలో మొఘల్ పాలన సాగుతోందని మండిపడ్డారు. యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు అయోధ్యకు చేరుకోనున్నారని, నిషేధంపై పునరాలోచించుకోవాలని రాష్ట్ర సర్కారును డిమాండ్ చేశారు. సింఘాల్ అరెస్టుకు నిరసనగా విమానాశ్రయం వెలుపల బీజీపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు ధర్నా చేశారు. అణచివేతకు నిరసనగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తొగాడియా చెప్పారు. ‘ఇది రాజకీయ యాత్ర కాదు, మత యాత్ర. దీనిపై నిషేధాన్ని సహించే ప్రసక్తే లేదు’ అని విలేకర్లతో అన్నారు. మరోపక్క.. రామజన్మభూమి ట్రస్టుకు చెందిన నృత్య గోపాల్ దాస్ అయోధ్యలోని తమ ఆలయంలో పదడుగులు వేసి యాత్రను ప్రారంభించారు. తర్వాత పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, యాత్ర కన్వీనర్ స్వామి చిన్మయానందను షాజహాన్పూర్లోగృహనిర్బంధంలో ఉంచారు. అరెస్టయిన వారి కోసం ప్రభుత్వం పలు ప్రాంతాల్లో తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది. కాగా, అరెస్టులపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ నేత వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో ఆరోపించారు. వీహెచ్‌పీ రాష్ట్రంలో అశాంతి రేపడానికి యాత్ర చేపట్టిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. యాత్రపై నిషేధంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చెప్పింది.
యాత్ర రాజకీయ ప్రేరే పితం... అయోధ్య ప్రధాన పూజారి: వీహెచ్‌పీ యాత్రకు సొంతవారినుంచే ఊహించని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ యాత్ర రాజకీయ ప్రేరేపితమని, సాధువులను స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అయోధ్యలోని తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సతేంద్ర దాస్ విమర్శించారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా వీహెచ్‌పీ యాత్ర ముహూర్తాన్ని నిర్ణయించిందన్నారు. శ్రీరాముడు కూడా ఈ సమయంలో (ఆగస్టు-డిసెంబర్) సీతాన్వేషణ యాత్రను వాయిదా వేసుకున్నారని ఉదహరించారు. వీహెచ్‌పీ యాత్రకు మత ప్రాధాన్యం లేదని, రామాలయ నిర్మాణం కోసం ప్రజల దగ్గరకు వెళ్లడమే దాని ఉద్దేశమని అన్నారు. సింఘాల్ ఇటీవల ములాయంను కలుసుకున్నారని, ఆ భేటీ వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదని దాస్ ఆరోపించారు. దాస్ వాదనతో పలువురు పూజారులు ఏకీభవించడం గమనార్హం.