హరిహర సుతయే.. అయ్యప్ప స్వామియే..
పట్టణంలో పెరుగుతున్న అయ్యప్ప భక్తుల సంఖ్య
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని వివిధ భక్త మండళ్లు అయ్యప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు వారితోపాటు ఇతర రాష్ట్రాలవారు కూడా అయ్యప్ప మాలలు ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్య ఉపవాసాలు పాటిస్తున్నారు. శనివారాలు వడి పూజలు చేస్తున్నారు.
శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో...
శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో వెంకటాచల అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మాలధారులు గత పక్షం రోజుల నుంచి ప్రతి శుక్రవారం మహిళలచే లలిత సహస్రనామం, కుంకుమార్చన, శనివారాలు వడిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరి ఒకటో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా గడ్డం లక్ష్మణ్ గురుస్వామి చేతుల మీదుగా మహాపూజ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు మహేశుని శ్రీనివాస్ తెలిపారు.
శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో...
దత్తమందిర్ ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి భక్త మండలి ఆధ్వర్యంలో 18 మంది తెలుగువారు అయ్య మాల ధరించారు. నిత్య పూజలతోపాటు ప్రతి శనివారం వడిపూజ భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురుస్వామి కట్టెకోల విష్ణు చెప్పారు. డిసెంబరు 25న మహాపూజ ఉంటుందని చెప్పారు.
శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో...
ప్రముఖ వరాలదేవి మందిరం ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో 26 మంది తెలుగువారు అయ్యప్ప మాలధారులయ్యారు. శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య పూజలతోపాటు డిసెంబర్ 24న ప్రత్యేకంగా మహాపూజ ఉంటుందని గురుస్వామి సురేష్ తెలిపారు. అదేవిధంగా నయీబస్తీలోని గణేశ్ మందిరంలో శ్రీగణేశ్ తమిళ మిత్ర మండలి ఆధ్వర్యంలో డిసెంబరు 28న మహాపూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వామి మురుగన్ తెలిపారు.