సింధుపై సైనాదే పైచేయి
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేతగా నిలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21–18, 21–15తో టాప్ సీడ్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. గత జాతీయ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సింధునే ఓడించి సైనా టైటిల్ నెగ్గింది. ఓవరాల్‌గా జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం సైనాకిది నాలుగోసారి. గతంలో ఆమె 2006, 2007, 2017లలో విజేతగా నిలిచింది.
ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న సైనా అదే జోరును ఇక్కడా కొనసాగించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో సింధును ఓడించి స్వర్ణ పతకం సాధించిన సైనా ఈసారీ వ్యూహాత్మకంగా ఆడింది. కోర్టు అవతల నుంచి భర్త పారుపల్లి కశ్యప్ అందించిన సలహాలు సైనాకు ఉపకరించాయి. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే స్కోరు 9–10 వద్ద సైనా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సైనా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను 27 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో గేమ్ మొదట్లో మళ్లీ ఈ ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా... స్కోరు 6–7 వద్ద సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–7తో ముందంజ వేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగిస్తూ సింధు ఆట కట్టించి సైనా విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన సైనాకు రూ. 3 లక్షల 25 వేలు ... రన్నరప్ సింధుకు రూ. లక్షా 70 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి.
పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) గెలుచుకున్నాడు. ఫైనల్లో సౌరభ్ వర్మ 21–18, 21–13తో ఆసియా జూనియర్ చాంపియన్, 17 ఏళ్ల లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై గెలుపొందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ వర్మ జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించడం ఇది మూడోసారి. గతంలో అతను 2011, 2017లలో గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలుగు అమ్మాయి కె.మనీషా (ఆర్బీఐ)–మనూ అత్రి (పీఎస్‌పీబీ) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో మనీషా–మనూ అత్రి ద్వయం 18–21, 21–17, 21–16తో టాప్ సీడ్ రోహన్ కపూర్ (ఎయిరిండియా)–కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్) జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట 21–13, 22–20తో ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–శ్లోక్ రామచంద్రన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జంట 21–16, 22–20తో టాప్ సీడ్ జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (ఆర్బీఐ) జోడీపై నెగ్గింది. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.