Badminton rankings
-
క్వార్టర్ ఫైనల్లో భారత్..
చెంగ్డూ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘సి’లో సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 21–15తో హ్యారీ హంగ్‌పై గెలిచి భారత్‌కు 1–0తో శుభారంభం ఇచ్చాడు.రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–17, 19–21, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ జంటపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–16, 21–11తో నదీమ్ డాలి్వపై నెగ్గడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–17, 21–19తో రోరీ ఈస్టన్–అలెక్స్ గ్రీన్ ద్వయంపై గెలిచింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ 21–18, 21–12తో చోలన్ కేయాన్‌ను ఓడించడంతో భారత్ 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గ్రూప్ తొలి మ్యాచ్‌లో భారత్ 4–1తో థాయ్‌లాండ్‌పై గెలుపొందింది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది.ఇవి చదవండి: కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ -
‘ఆడుదాం ఆంధ్రా’.. క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం: సాత్విక్ సాయిరాజ్
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్‌లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్లేయర్స్‌తో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సాత్విక్ సాయిరాజ్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏషియన్ గేమ్స్‌లో మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సాత్విక్ పేర్కొన్నారు. ఇక.. సాత్విక్ సాయిరాజ్ తల్లితండ్రులు కాశి విశ్వనాథ్, రంగమణి సైతం తమ కుమారుడి ఘనత పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టితో కలిసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్ ‘పసిడి’ కల నెరవేరుస్తూ... పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ స్వర్ణం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు తొలిసారి గోల్డ్ మెడల్ అందించి సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. హోంగ్జూలో జరిగిన ఫైనల్లో 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించి ఈ మేరకు చాంపియన్‌గా అవతరించింది సాత్విక్- చిరాగ్ జోడీ. అంతేగాక ఈ అద్భుత విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జంట నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడం విశేషం. చదవండి: ‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రణయ్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కేరళకు చెందిన ప్రణయ్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకొని భారత నంబర్‌వన్‌గా నిలిచాడు. లక్ష్య సేన్ 22వ ర్యాంక్‌లో, కిడాంబి శ్రీకాంత్ 23వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఒక స్థానం పురోగతి సాధించి 11వ ర్యాంక్‌లో నిలిచింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకోగా... పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం రెండు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. -
BWF Rankings: కెరీర్ బెస్ట్.. తొలిసారి టాప్–10లోకి లక్ష్య సేన్
BWF Rankings: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్‌తో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 20 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక మహిళల డబుల్స్‌లో నిలకడగా రాణిస్తోన్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 12 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 34వ ర్యాంక్‌ను అందుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో...
న్యూఢిల్లీ: గతవారం ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ పురోగతి సాధించింది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 11వ ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు చేరుకుంది. రెండోసారి తమ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో టైటిల్ సాధించాక ఈ ఇద్దరు తొలిసారి 9వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత టాప్–10 నుంచి బయటకు వచ్చి...ఫ్రెంచ్ ఓపెన్‌లో రాణించి మళ్లీ టాప్–10లోకి వచ్చారు. -
శ్రీకాంత్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ ర్యాంకును సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను ప్రకాశ్ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్ సాధించినందుకు గర్వకారణంగా ఉందని ఒక ప్రకటనలో ప్రశంసించారు. శ్రీకాంత్ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని మెచ్చుకున్నారు. డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అలెక్సన్ వెనక్కి నెట్టి శ్రీకాంత్ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం గొప్ప విషయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఇలాంటి మరెన్నో విజయాలు, పతకాలను సాధిస్తూ మరింత ఉన్నత శిఖరాలను శ్రీకాంత్ అధిరోహించాలని ఆకాంక్షించారు. అలానే నంబర్ వన్ ర్యాంకును ఎప్పటికీ సుస్థిరంగా ఉంచుకోవాలన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య గురువారం అధికారికంగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 76,895 పాయింట్లతో శ్రీకాంత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్
తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను(పురుషుల విభాగంలో) కైవసం చేసుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ గురువారం విడుదల చేయబోయే జాబితాలో 25 ఏళ్ల శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్ దక్కబోతోంది. మొత్తం 76, 895 పాయింట్లతో శ్రీకాంత్ మొదటి స్థానం కైవసం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ స్థానంలో ఉన్న విక్టర్ అక్సెల్సన్ ప్రస్తుతం 77,130 పాయింట్లతో ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న విక్టర్.. తాజా ర్యాకింగ్స్లో 1,660 పాయింట్లు కోల్పోబోతున్నాడు. దీంతో శ్రీకాంత్ నంబర్ వన్ ర్యాంక్ ఖరారైపోయింది. నిజానికి గతేడాదే శ్రీకాంత్ ఈ రికార్డును దక్కించుకోవాల్సింది. కానీ, గాయం కారణంతో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కాగా, భారత్ తరపున బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్(2015లో) నంబర్ వన్ ర్యాంక్(మహిళ విభాగంలో)ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కగా.. ఆ టీమ్‌లో కిదాంబి, సైనా కూడా ఉన్నారు. -
పోరాడి ఓడిన సిక్కి–ప్రణవ్ జంట
టోక్యో: కెరీర్లో తొలిసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరాలని ఆశించిన సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ భారత జోడీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–14, 15–21, 19–21తో టకురో హోకి–సయాకా హిరోటా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గెలిచిన భారత జోడీ ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ఆరంభం నుంచి ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. 7–8తో ఒక పాయింట్‌తో వెనుకబడిన దశలో జపాన్ జోడీ వరుసగా మూడు పాయింట్లు గెలచి 10–8తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యం 13–9గా మారింది. నాలుగు పాయింట్లతో వెనుకబడిన దశ నుంచి భారత జంట కోలుకోలేకపోయింది. స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఒకట్రెండు పాయింట్ల ఆధిక్యాన్ని జపాన్ ద్వయం చివరిదాకా నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకుంది. సెమీస్‌లో ఓడిన సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంటకు 4,550 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 94 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సింగిల్స్ ఫైనలో లీ చోంగ్ వీ, అక్సెల్సన్ మరోవైపు ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఫైనల్లోకి అడుగు పెట్టారు. సెమీస్‌లో అక్సెల్సన్ 21–16, 21–16తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)పై, లీ చోంగ్ వీ 21–19, 21–8తో షి యుకి (చైనా)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), హి బింగ్జియావో (చైనా) టైటిల్ పోరుకు అర్హత సాధించారు. మారిన్‌తో జరగాల్సిన తొలి సెమీఫైనల్లో గాయం కారణంగా ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) ‘వాకోవర్’ ఇవ్వగా... రెండో సెమీఫైనల్లో హి బింగ్జియావో 21–14, 25–23తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. -
ఏడో ర్యాంకులో సైనా
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నె హ్వాల్ ర్యాంకు మెరుగైంది. తాజాగా విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాం కింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జరిగిన సయ్యద్ మోడి అంతర్జాతీయ గ్రాండ్ ప్రి టోర్నమెంట్లో హైదరాబాదీ స్టార్ టైటిల్ గెలవడంతో ర్యాంకు మెరుగైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో క్రీడాకారిణి పీవీ సింధు ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో నిలిచింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఏకంగా 10 స్థానాల్ని మెరుగుపర్చుకొని 20వ స్థానంలో కొనసాగుతుండగా... ఏపీ సీనియర్ ఆటగాడు కశ్యప్ 18వ ర్యాంకులో నిలిచాడు. అజయ్ జయరామ్ ఒక స్థానం కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. గురుసాయిదత్ 28వ, ప్రణయ్ 39వ, సాయిప్రణీత్ 45వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. సౌరభ్ వర్మ 50వ ర్యాంకులో ఉన్నాడు.