badwel
-
కొడుకు వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని బద్వేలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడికి వైద్యం చేయించేందుకు వచ్చిన ఓ తల్లి అనూహ్యరీతిలో ప్రాణాలు విడిచారు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటడంతో వెంకటదేవి అనే మహిళ అతన్ని తీసుకుని బద్వేలులోని సుమిత్రానగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడిక్కడే ఆమె కుప్పకూలిపోయారు. వెంకటదేవి మరణించినట్టు వైద్యులు తెలిపారు. -
లంకె బిందెలు దొరికాయ్.. సెల్‌ఫోన్ రికార్డ్స్ కలకలం
సాక్షి, కడప : బద్వేలులో లంకెబిందెలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా... బద్వేలు పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న జయరామిరెడ్డి రెండు నెలల కిందట అర్ధరాత్రి మంత్రగాడి సహాయంతో ఒక పురాతన బిందెను ఇంట్లోకి తీసుకెళ్లడం సమీపంలో ఉన్న ఒక మహిళ కంటబడింది. ఏమిటని ఆమె నిలదీయడంతో ఆయన బయటకు చెప్పవద్దంటూ బతిమాలుకున్నారు. తదుపరి ఆమె తన భర్త సుధాకర్‌రెడ్డితో విషయాన్ని చెప్పింది. ఆయన జయరామిరెడ్డితో విషయాన్ని అడిగి బయటకు చెప్పకుండా ఉండాలంటే మాకు ఏమి ఇస్తావని బేరం పెట్టారు. బిందెలను ఓపెన్ చేయడానికి సమయం పడుతుందని చెప్పాడు. ఎవరికి చెప్పకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కథ కొద్ది రోజులు నడిచింది. రెండు నెలలుగా అద్దెకు ఉంటున్న ఇంటికి జయరామిరెడ్డి రాకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. వీటి రికార్డ్స్ ప్రస్తుతం బయటకు రావడంతో పాటు పట్టణంలో వైరల్‌గా మారాయి. దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. పోరుమామిళ్ల మండలంలోని పురాతన ఆలయమైన చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో ఈ గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలో పూర్వకాలంలో రాజులు నివాసం ఉండేవారని, వారి కాలంలోని లంకెబిందె దొరికిందని సమాచారం. దీనిపై పూజారి గరుడాద్రి స్వామి మాట్లాడుతూ తాను శనివారం మాత్రమే ఆలయం వద్ద పూజలు చేసి వెళతానని, సమీపంలో తవ్వకాలు జరిపి, మళ్లీ మట్టితో కప్పెట్టినట్లు ఆనవాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బద్వేలు పట్టణంలో గుప్తనిధుల తవ్వకాల విషయమై కలకలం రేగుతోంది. -
నాడు తొక్కి..నేడు మొక్కుతారా..!
సాక్షి, బద్వేలు : ఉద్యోగ విరమణ తరువాత భవిష్యత్తుకు భరోసా ఇవ్వని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అలుపెరగని పోరాటాలు చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపించిన వేళ సీపీఎస్ రద్దు చేస్తామనడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2004 సెప్టెంబరు నుంచి పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 1.64 లక్షల మంది, జిల్లాలో దాదాపు 15 వేల మంది సీపీఎస్ పరిధిలో ఉన్నారు. 2004 నోటిఫికేషన్ తరువాత జిల్లాలో 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో మూడు వేల మంది ఉద్యోగాలు పొందారు. వీరంతా సీపీఎస్ పరిధిలో ఉన్నారు. నాడు అబద్ధాలు...అరెస్టులు సీపీఎస్ ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వం వారిని తప్పుదోవ పట్టించేందుకు అబద్ధాలు చెప్పింది. తొలుత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఉద్యోగులు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో చేసేది లేక వారి నోళ్లు మూయించేందుకు పోలీసులను ఉపయోగించారు. పలుపర్యాయాలు విజయవాడ, గుంటూరులో జరిగిన ఆందోళనల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి వ్యాన్‌ల్లో కుక్కారు. మహిళలు అని చూడకుండా లాఠీలతో కొట్టించి తరిమించారు. వైఎస్ జగన్ హామీతో ఊరట రాష్ట్రవ్యాప్తంగా రెండు 1.87 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి కీలకమైన సమస్యకు పరిష్కారం చూపకుండా టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభంలో సెప్టెంబరు 6న సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దీంతో చేజారిపోతున్న పెన్షన్ పథకం తిరిగి తమకు అందుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. పాత పథకాన్ని అమలుచేయాలి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తేనే ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం సీపీఎస్ విధానంలో ఉండి పదవీ విరమణ చేసిన వారికి రూ.650 పెన్షన్ రావడం దారుణంగా ఉంది. 35 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందించి, వయస్సు మీద పడిన తరువాత వచ్చే పెన్షన్ షేర్ మార్కెట్‌పై ఆధారపడటం శోచనీయం. – పుల్లయ్య, సీపీఎస్ నాయకులు పోరాటాలను పట్టించుకోలేదు ఉద్యోగ విరమణ తరువాత పింఛన్ పొందేలా రాజ్యాంగం కల్పించిన హక్కుకు విఘాతం కలిగిస్తున్నారు. సీపీఎస్ రద్దు కోసం ఎన్నో పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడేమో టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేది. – వెంకటరెడ్డి, సీపీఎస్ ఉద్యోగి -
చూపుడు వేలు లేకుంటే.!
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడువేలుకు సిరా చుక్క పెడతారు. ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే ఎలా,.. దీనికి ఎన్నికల సంఘం ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. ఎడమచేతికి చూపుడు వేలు లేకుంటే మధ్య వేలుకు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క వేసే అవకాశం కల్పించింది. ఎడమ చేతికి అసలు వేళ్లు లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు అదీ లేకుంటే ఈ తర్వాత ఏది ఉంటే ఆ వేలుకు చుక్క పెడతారు. రెండు చేతులకూ వేళ్లు లేకుంటే వేళ్ల మొదళ్ల మధ్య భాగంలో లేకుంటే చేయిపై రాస్తారు. -
ఓటరు బ్రహ్మాస్త్రం ‘సీ విజిల్’
బద్వేలు: నిజమే.. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు రాజకీయ నాయకులు ఎత్తుగడలు వేస్తుంటారు. డబ్బు, మద్యం ఎర వేస్తారు. భయభ్రాంతులకు గురి చేస్తారు. అధికారాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలనుకుంటారు. ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి ఓటింగ్ ముగిసేవరకు ఇలాంటి ఘటనలూ జరుగుతూనే ఉంటాయి. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ‘సీ విజిల్’ అనే యాప్‌ను రూపొందించింది. ఎక్కడైనా నేతలు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడతారో వాటిని వీడియో, ఫొటోలను సెల్ఫోన్లో చిత్రీకరించి సీవిజిల్ యాప్‌లో పంపిస్తే అది నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో వెళుతుంది. ఫిర్యాదు ఇలా... ఆండ్రాయిడ్ ఫోన్దారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి సీ విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే వీడియో, ఫొటో అనే రెండు అప్షన్లు కనిపిస్తాయి. చుట్టూ జరిగే అక్రమాలను వీడియో రూపంలో గానీ, ఫొటోలుగా చిత్రీకరించి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మద్యం, డబ్బు పంపిణీతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు కట్టడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. యాప్ జీపీఎస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో పిర్యాదు వచ్చిన ప్రాంతం వివరాలు ఎన్నికల సంఘానికి తెలుస్తాయి. జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత నియోజకవర్గంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లేదా సంబంధిత ఆర్ఓకు పంపిస్తారు. వారు 25 నిమిషాల్లోపే సంబంధిత ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టి అక్రమాలను అడ్డుకుంటారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి సెల్‌కు తాము చేసిన కార్యచరణను వివరిస్తూ సమాచారం అందిస్తారు. ఇదంతా వంద నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రజలను భాగస్వాములను చేయడానికే.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలపై నిఘా పెట్టడంలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అవలంభించిన విధానాలు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. త్వరలో రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ అంక్షలు విధిస్తోంది. సీ విజిల్ యాప్‌తో వీటికి అడ్డుకట్ట పడనుంది. అభ్యర్థులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి వాటిపై ఫిర్యాదులు చేయవచ్చు. సీ విజిల్ యాప్ ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిన రోజు నుంచి పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు. సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు తప్పించుకునే అవకాశం ఉండదు. గతేడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అశించిన ఫలితాలను రాబట్టారు. ప్రజల నుంచి ఊహించిన రీతిలో ఫిర్యాదులు అందడంతో ఇకపై ప్రతి ఎన్నికల్లోనూ ఈ యాప్‌ను ఉపయోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ సీ విజిల్‌కు మంచి స్పందన వచ్చింది. మొత్తం 5,291 ఫిర్యాదులు రాగా వీటిలో 3,703 ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మాత్రమే యాప్ పని చేసేటట్లు రూపొందించారు. -
బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
బద్వేలు అర్బన్ : ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగసాని గురుమోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి అందూరి రామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలలో అట్లూరు మండల నాయకులు పాల్గొని.. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ప్రత్యేక హోదా సంజీవని కాదని కారు కూతలు కూసిన చంద్రబాబు, నేడు హోదా కావాలని తన ఎంపీలతో నాటకాలు వేయిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అని అన్నారు. హోదా కోసం తమ ఎంపీలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటం చరిత్రాత్మకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బద్వేలు మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షులు జి.సుందర్రామిరెడ్డి, అట్లూరు మండల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, జయరామిరెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, మాజీ జెడ్పీటీసీ చెవుల రమణయ్య, అట్లూరు మండల నాయకులు మాధవరెడ్డి, ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి, కొల్లు సుబ్బారెడ్డి, క్రిష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, గంగయ్య, సుబ్బయ్య, పెంచలయ్య, చిన్న, బాలయ్య, వెంకటసుబ్బయ్య, హజరత్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు పుత్తా శ్రీరాములు, సింగసాని శివయ్య, సాంబశివారెడ్డి, మున్సిపాలిటీ నాయకులు ఈవై ఎద్దారెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి, ఆర్.శ్రీనివాసులు యాదవ్, వెంకటరత్నం, బిజ్జం రమణ, జయరామ్ యాదవ్, చెన్నక్రిష్ణారెడ్డి, బీమారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, గుజరాత్ యాదవ్, రామచంద్రయాదవ్, ప్రసాద్ నాయుడు, రోశిరెడ్డి, హసాన్, అనిల్, చెన్నయ్య, ఇమ్మానియేల్, సిద్ధువెంకట సుబ్బారెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు. -
ప్రేమ వివాహం.. అయినా వేరే పెళ్లిళ్లు చేశారు!
బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కిరణ్ హాస్పిటల్ వద్ద ఓ ప్రేమ జ౦ట ఆత్మహత్యాయత్న౦ చేసింది. ఖాదర్ వలీ, శాంతి అనేవారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నా మళ్లీ వేర్వేరు పెళ్లిళ్లు చేశారని వారు మనస్తాపం చెందారు. దీంతో ఆస్పత్రి వద్ద ఆదివారం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. -
19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బద్వేల్ (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా బద్వేల్ మండలం పెద్దచెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు నెల్లూరుకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కడప జిల్లా వాసులని పోలీసులు తెలిపారు. -
పంచాయతీరాజ్ ఏఈపై టీడీపీ నేతల దాడి
బద్వేల్ అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించి ఓ పంచాయతీరాజ్ ఏఈపై దాడికి తెగబడ్డారు. అధికార పార్టీకి చెందిన తాము చెప్పినట్లు వినకుండా నియమాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఉద్యోగిని తీవ్రంగా కొట్టారు. బద్వేలు పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న ప్రసాద్‌పై స్థానిక ఎంపీపీ ప్రతాప్ రెడ్డి దాడి చేశారు. ఏఈ కార్యాలయంలో కంప్యూటర్ను పగులగొట్టారు. -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ. 18.70 లక్షలు స్వాహా
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. ఫోర్జరీ సంతకాలు చేసి 18.70 లక్షల రూపాయలను స్వాహా చేశాడు. బ్యాంక్ అధికారులు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.