బద్వేలు: నిజమే.. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు రాజకీయ నాయకులు ఎత్తుగడలు వేస్తుంటారు. డబ్బు, మద్యం ఎర వేస్తారు. భయభ్రాంతులకు గురి చేస్తారు. అధికారాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలనుకుంటారు. ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి ఓటింగ్ ముగిసేవరకు ఇలాంటి ఘటనలూ జరుగుతూనే ఉంటాయి. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ‘సీ విజిల్’ అనే యాప్‌ను రూపొందించింది. ఎక్కడైనా నేతలు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడతారో వాటిని వీడియో, ఫొటోలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సీవిజిల్ యాప్‌లో పంపిస్తే అది నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో వెళుతుంది.
ఫిర్యాదు ఇలా...
ఆండ్రాయిడ్ ఫోన్‌దారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి సీ విజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే వీడియో, ఫొటో అనే రెండు అప్షన్లు కనిపిస్తాయి. చుట్టూ జరిగే అక్రమాలను వీడియో రూపంలో గానీ, ఫొటోలుగా చిత్రీకరించి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మద్యం, డబ్బు పంపిణీతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు కట్టడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. యాప్ జీపీఎస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో పిర్యాదు వచ్చిన ప్రాంతం వివరాలు ఎన్నికల సంఘానికి తెలుస్తాయి. జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత నియోజకవర్గంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లేదా సంబంధిత ఆర్‌ఓకు పంపిస్తారు. వారు 25 నిమిషాల్లోపే సంబంధిత ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టి అక్రమాలను అడ్డుకుంటారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి సెల్‌కు తాము చేసిన కార్యచరణను వివరిస్తూ సమాచారం అందిస్తారు. ఇదంతా వంద నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రజలను భాగస్వాములను చేయడానికే..
వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలపై నిఘా పెట్టడంలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అవలంభించిన విధానాలు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. త్వరలో రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ అంక్షలు విధిస్తోంది. సీ విజిల్ యాప్‌తో వీటికి అడ్డుకట్ట పడనుంది. అభ్యర్థులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి వాటిపై ఫిర్యాదులు చేయవచ్చు. సీ విజిల్ యాప్ ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిన రోజు నుంచి పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు తప్పించుకునే అవకాశం ఉండదు. గతేడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అశించిన ఫలితాలను రాబట్టారు. ప్రజల నుంచి ఊహించిన రీతిలో ఫిర్యాదులు అందడంతో ఇకపై ప్రతి ఎన్నికల్లోనూ ఈ యాప్‌ను ఉపయోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ సీ విజిల్‌కు మంచి స్పందన వచ్చింది. మొత్తం 5,291 ఫిర్యాదులు రాగా వీటిలో 3,703 ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మాత్రమే యాప్ పని చేసేటట్లు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment