
సాక్షి, కడప : బద్వేలులో లంకెబిందెలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా... బద్వేలు పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న జయరామిరెడ్డి రెండు నెలల కిందట అర్ధరాత్రి మంత్రగాడి సహాయంతో ఒక పురాతన బిందెను ఇంట్లోకి తీసుకెళ్లడం సమీపంలో ఉన్న ఒక మహిళ కంటబడింది. ఏమిటని ఆమె నిలదీయడంతో ఆయన బయటకు చెప్పవద్దంటూ బతిమాలుకున్నారు.
తదుపరి ఆమె తన భర్త సుధాకర్‌రెడ్డితో విషయాన్ని చెప్పింది. ఆయన జయరామిరెడ్డితో విషయాన్ని అడిగి బయటకు చెప్పకుండా ఉండాలంటే మాకు ఏమి ఇస్తావని బేరం పెట్టారు. బిందెలను ఓపెన్ చేయడానికి సమయం పడుతుందని చెప్పాడు. ఎవరికి చెప్పకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కథ కొద్ది రోజులు నడిచింది. రెండు నెలలుగా అద్దెకు ఉంటున్న ఇంటికి జయరామిరెడ్డి రాకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. వీటి రికార్డ్స్ ప్రస్తుతం బయటకు రావడంతో పాటు పట్టణంలో వైరల్‌గా మారాయి.
దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. పోరుమామిళ్ల మండలంలోని పురాతన ఆలయమైన చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో ఈ గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలో పూర్వకాలంలో రాజులు నివాసం ఉండేవారని, వారి కాలంలోని లంకెబిందె దొరికిందని సమాచారం. దీనిపై పూజారి గరుడాద్రి స్వామి మాట్లాడుతూ తాను శనివారం మాత్రమే ఆలయం వద్ద పూజలు చేసి వెళతానని, సమీపంలో తవ్వకాలు జరిపి, మళ్లీ మట్టితో కప్పెట్టినట్లు ఆనవాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బద్వేలు పట్టణంలో గుప్తనిధుల తవ్వకాల విషయమై కలకలం రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment