మేడారం.. జనసంద్రం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమక్క–సారలమ్మ జాతర కన్నుల పండుగగా సాగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో ఉప్పొంగుతోంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు బారులుతీరారు. చీర, సారె, నిలువెత్తు బంగారం (బెల్లం), ఎదుర్కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు... ఇలా తీరొక్క రూపాల్లో వనదేవతలకు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మల ప్రసాదం (బెల్లం) దక్కించుకునేందుకు పోటీపడ్డారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం అమ్మవార్లను దర్శించుకోగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం వనదేవతలను దర్శించుకున్నారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా రెండు విడతల్లో సుమారు 2 గంటలకుపైగా దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
వనదేవతలకు చీర, సారె సమర్పించిన సీఎం కేసీఆర్...
వనదేవతల దర్శనానికి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మేడారానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేడారం పూజారులు, జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఆలం రామ్మూర్తి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మను కేసీఆర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని, ఆ తర్వాత సారలమ్మ అమ్మవారితోపాటు పక్కనే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు తెలంగాణ రాష్ట్రం తరఫున చీర, సారె సమర్పించారు. హుండీలో కానుకలు వేశారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క–సారలమ్మ దేవతల ఫొటోను అందజేశారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కూడా వనదేవతలను దర్శించుకొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
జనసంద్రమైన మేడారం....
మేడారం జాతరకు ఈసారి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటివరకు భక్తుల సంఖ్య 1 కోటి 10 లక్షలకు చేరినట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం ముందు వరకు ముందస్తుగా 70 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
క్యూలలో భక్తుల ఇబ్బందులు...
మేడారంలో శుక్రవారం ఉదయం గవర్నర్ల దర్శనం సమయంలో సుమారు గంటపాటు ఆ తర్వాత సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మ«ధ్యాహ్నం 12:35 గంటల నుంచి 1:35 గంటల వరకు అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. దీంతో రద్దీ క్యూలలో పలుమార్లు తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. వీవీఐపీల దర్శనం ముగిసినప్పటికీ భారీ క్యూల వల్ల సాధారణ భక్తుల దర్శనానికి 4–5 గంటల వరకు సమయం పట్టింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.
హెలికాప్టర్లో చక్కర్లు కొట్టిన గవర్నర్లు
సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారం వచ్చిన గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ ప్రత్యేక హెలికాప్టర్లో జాతర పరిసరాల్లో రెండుసార్లు చక్కర్లు కొట్టారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీ, ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
అమ్మల దర్శనం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై తులాభారం
వనదేవతలను దర్శించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేడారం జాతర ప్రకృతితో మమేకమైందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను మొక్కుకున్నట్లు తమిళిసై తెలిపారు.
నేడు వనంలోకి దేవతలు...
అశేష భక్తుల నుంచి తీరొక్క మొక్కులు అందుకున్న వనదేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం శనివారం సాయంత్రం జరగనుంది. తొలుత నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలు ఉంటుంది. ఆలయం దాటిన తర్వాత బయటివారినెవరినీ వెంట రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు.
బంగారం మొక్కు చెల్లించుకునేందుకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
సీఎం కేసీఆర్ పర్యటన సాగింది ఇలా...
►మధ్యాహ్నం 1:06 గంటలకు హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు.
►1:10 గంటలకు వనదేవతల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి కండువా కప్పారు.
►1:14 గంటలకు సంప్రదాయబద్ధంగా ప్రధాన ప్రవేశమార్గం ద్వారా ఆలయ పూజారులు, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు సీఎంకు ఆహ్వానం పలికారు.
►1:16 గంటలకు నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు.
►1:19 గంటలకు సమ్మక్క గద్దె వద్ద, 1:22 గంటలకు సారలమ్మ గద్దె వద్ద చీర–సారె, కానుకలు సమర్పించారు. అనంతరం గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు.
►1:28 గంటలకు గద్దెల ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు.
►1:35 గంటలకు పోలీస్ ఔట్‌పోస్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విడిది ప్రాంతానికి చేరుకొని భోజనం చేశారు.
►2:05 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.
తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ రాకపోకల సమయం
►ఉదయం 9:25 గంటలకు మేడారంలోని హెలిప్యాడ్ వద్ద దిగారు
►9:30 గంటలకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.
►9: 40 గంటలకు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు.
►10:00 గంటలకు తులాభారం
►10:10 గంటలకు సమ్మక్క, 10:15 గంటలకు సారలమ్మ గద్దె వద్ద మొక్కులు చెల్లించారు.
►10:45 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
►11:07 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.
బరువు తగ్గిన కేసీఆర్
నిలువెత్తు బంగారంతో సీఎం కేసీఆర్ తులాభారం. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్
సమ్మక్క–సారలమ్మల దర్శనం సందర్భంగా సీఎం కేసీఆర్ నిలువెత్తు బంగారాన్ని మొక్కుగా సమర్పించిన సమయంలో ఆయన 51 కిలోల బరువు తూగారు. 2018 ఫిబ్రవరి 2న మేడారం దర్శనానికి వచ్చిన సందర్భంగా నిలువెత్తు బంగారం సమర్పించినప్పుడు ఆయన 52 కిలోల బరువు ఉండేవారు. ఈసారి కేసీఆర్ 51 కిలోల బరువు తూగడంతో రెండేళ్లలో ఆయన ఒక కిలో బరువు తగ్గినట్లయింది. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 66 కిలోలు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ 55 కిలోల బంగారాన్ని మొక్కులుగా సమర్పించినట్లు పౌర సమాచార సంబంధాల శాఖ వెల్లడించింది.