డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో మంటలు: ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటన మరవక ముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా ధాను రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో బాంద్రా- డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. మూడు బోగీల్లోకి మంటలు వ్యాపించడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. S-2, S-3, S-4 బోగీల్లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఆరుగురు సజీవ దహనమయ్యారు.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే మూడు బోగీలు దగ్ధమయ్యాయి. డెహ్రాడూన్ నుంచి రైలు ముంబైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ప్రయాణీకులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఓ బోగిలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు బోగిలకు త్వరితగతిన వ్యాపించాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని అధికార ప్రతినిధి వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారని తెలిపారు.
ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. డెహ్రాడూన్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ రోజు తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ఆ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికార ప్రతినిధి వివరించారు. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 022-23011853, 022-23007388 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.