దళిత కార్యకర్తకి సీఎం క్షమాపణలు!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మూడురోజల పంజాబ్ పర్యటనను ప్రారంభించారు. ఆయన బుధవారం లంబీ నియోజకవర్గంలో కీలక ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ నియోజకవర్గమైన ఇక్కడ ఢిల్లీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌ను బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బుధవారం కేజ్రీవాల్ ప్రకటించనున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్న సీఎం కేజ్రీవాల్ మంగళవారం దళిత కార్యకర్త, గాయకుడు బంత్‌సింగ్ జబ్బార్‌కు క్షమాపణలు చెప్పారు. పంజాబ్‌లోని మాన్సాకు చెందిన బంత్‌సింగ్ కూతురు రేప్ బాధితురాలు. బంత్‌సింగ్ ఇటీవల ఆప్‌లో చేరగా.. మరోసభలో ఆయనపై దాడి చేసిన నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఆప్‌లో చేరారు. దీంతో బంత్‌సింగ్ నివ్వెరపోయారు. ఈ విషయం తెలియడంతో ఆప్ ఆ ఇద్దరు నిందితుల్ని వెంటనే పార్టీలోంచి తొలగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కేజ్రీవాల్ బంత్‌సింగ్‌ను వ్యక్తిగతంగా కలిసి సముదాయించారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. ఇది పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకొంటున్నాం. జరిగిన దానికి మేం సిగ్గు పడుతున్నాం. పార్టీలో చేరిన ఆ నిందితుల్ని వెంటనే తొలగించాం' అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు.