చైనా మళ్లీ ఏసేసిందిగా.. ఏకంగా మారుతి జిమ్నీకే ఎసరు
చైనా ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పటికే కొన్ని వాహనాలను కాపీ కొట్టి తయారు చేసినట్లు గతంలో చదువుకున్నాం. అలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇందులో మారుతి జిమ్నీ ఆధారంగా డూప్లికేట్ జిమ్నీ తయారు చేశారు. ఇది చూడటానికి జిమ్నీ మాదిరిగా కనిపించినప్పటికీ జిమ్నీ కాదని చూడగానే తెలిసిపోతోంది.
SIAC యాజమాన్యంలోని 'బౌజన్' కంపెనీ 'బౌజన్ ఏప్' (Baojun Yep) ఎలక్ట్రిక్ ఎస్యువి ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న జిమ్నీ 3-డోర్స్ మోడల్ని పోలి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2023 ఏప్రిల్‌లో జరగనున్న షాంగై ఆటో షోలో ప్రదర్శనకు వస్తుంది. ఇదే ఏడాది 'మే' నెల నాటికి అధికారికంగా విడుదలవుతుంది.
భారతదేశంలో విక్రయిస్తున్న మారుతి జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది, బౌజన్ ఏప్ ఎలక్ట్రిక్ వెర్షన్ డిజైన్ పరంగా కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 303 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా అందుబాటులోకి రాలేదు.
గ్లోబల్ మార్కెట్లో ఎంతోమంది మనసు దోచిన జిమ్నీ డూప్లికేట్ అవతారంలో పుట్టుకొస్తుంది, మరి ఇది ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి..! చైనీస్ తయారీదారులు ఇప్పటికే బజాజ్ పల్సర్, కెటిఎమ్ డ్యూక్, యమహా ఆర్3, కవాసకి నింజా వంటి మోడల్స్ కాపీ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో విరివిగా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు.