Baramullah
-
ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం!
శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలెజిన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఐఈడీతో నింపిన తెలుపు రంగు స్కార్పియో వాహనంతో ముష్కరులు దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కుల్గాం జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ వాహనంతో ఇద్దరు వ్యక్తులు భారీ విస్పోటనానికి వ్యూహం రచించారని, అయితే దాడి ఎక్కడ జరుగుతుందన్న విషయంపై తమకు సమాచారం లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు భద్రతా బలగాలు, పోలీసులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెక్‌పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసు వర్గాలను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక జమ్ము కశ్మీర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, ఒడిశా,చండీగఢ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల్లోని పలు నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో భారత రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఎప్పుడూ సాధారణ ప్రజలను, భారత సైన్యాన్ని టార్గెట్ చేసే ఉగ్రవాదులు ఈ సారి ఏకంగా స్థానిక బీజేపీ నాయకుడు మహ్మద్ అన్వర్‌పైకి కాల్పులకు తెగపడ్డారు. బారాముల్లాలోని ఖాన్మోహ్‌లో జరిగిన ఈ ఘటనలో రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. కాగా అన్వర్‌పైకి కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది వేగంగా స్పందించడంతో సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య బీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో అన్వర్, అతని సెక్యూరిటి స్వల్ప గాయలతో బయటపడగా, రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఉగ్రవాదుల మృతదేహాలను, వారి వద్దనున్న ఆయుధాలను, పేలుడు సామాగ్రీని అధికారులు స్వాధీనపరుచునున్నారు. బారాముల్లా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో శుక్రవారం బారాముల్లా- బన్నిహాల్ మధ్య రైల్వే సేవలను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థానిక గ్రామంలో నాలుగు ఇళ్లు ధ్వంసంకాగా , ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశించింది. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కలకలం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం స్థానికంగా కలకలం రేపింది. జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులు హరితర్ తర్జు ప్రాంతంలో సంచరింస్తున్నారని సమాచారం అందుకున్న జవాన్లు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్పులకు పాల్పడ్డ ఓ ఉగ్రవాదని జవాన్లు హతమార్చినట్లు సమాచారం. ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో నక్కినట్లు జవాన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండో ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఆర్మీ కూంబింగ్ జరుపుతోంది. దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో బారాముల్లా జిల్లాలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.