భారత్ తడబాటు
భారత స్పిన్నర్ జడేజా మిగిలిన మూడు వికెట్లను పడగొట్టిన మన స్పిన్ పిచ్‌పై ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆ తర్వాత అంతకు మించి పట్టు సాధించాడు. ఇది భారత తొలి ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టింది. అలాగే ‘అంపైర్ కాల్’ భారత వికెట్లను ప్రభావితం చేసింది. క్రీజులో ప్రధాన బ్యాటర్ అంటూ లేకుండా చేయడంతో పరుగుల పరంగా టీమిండియా వెనుకబడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించడం ఖాయమైంది.
రాంచీ: మ్యాచ్‌కు ముందు రోజు వికెట్‌ను పరిశీలించిన ఇరుజట్ల వర్గాలు ‘పిచ్‌పై అంచనా కష్టం. ఏ రోజు టర్న్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం’ అని అభిప్రాయపడ్డాయి. అనూహ్యంగా రెండో రోజే పిచ్ పూర్తిగా స్పిన్‌కు స్వర్గధామమైంది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిపోయిన మూడు వికెట్లను జడేజా పడేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ తమ యువ ఆఫ్‌స్పిన్నర్ బషీర్‌తో వరుసగా ఓవర్లు వేయించాడు. అతను 31 ఓవర్లు నిర్విరామంగా బౌలింగ్ చేసి విలువైన వికెట్లను పడేయడంతో ఆతిథ్య భారత్ కష్టాల పాలైంది.
శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (117 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. బషీర్ 4 వికెట్లు పడగొడితే మరో స్పిన్నర్ హార్ట్లీ కూడా 2 వికెట్లు తీసి భారత్ కష్టాల్ని పెంచాడు.
మరో 51 పరుగులు...
రెండో రోజు 302/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ 104.5 ఓవర్లలో 353 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో 14.5 ఓవర్లు ఆడి తొలి రోజు స్కోరుకు 51 పరుగులు జోడించింది. జో రూట్ (274 బంతుల్లో 122 నాటౌట్; 10 ఫోర్లు) అజేయగా నిలువగా... చకాచకా బౌండరీలు బాదిన ఒలీ రాబిన్సన్ (96 బంతుల్లో 58; 9 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో తొలి సారి అర్ధ శతకాన్ని సాధించాడు.
వీరిద్దరు 8వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎట్టకేలకు రాబిన్సన్ను అవుట్ చేయడం ద్వారా జడేజా ఈ జోడీని విడగొట్టాడు. 347 పరుగుల వద్ద ఈ వికెట్ పడగా, మరో ఆరు పరుగుల వ్యవధిలో బషీర్ (0), అండర్సన్ (0) వికెట్లను కూడా జడేజానే తీయడంతో లంచ్‌కు ముందే ఇంగ్లండ్ ఆట ముగిసింది.
రాణించిన యశస్వి
ఈ సిరీస్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. లేదంటే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేది! కెప్టెన్ రోహిత్ (2) మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శుబ్‌మన్ గిల్‌తో జైస్వాల్ జోడి కుదరడంతో తొలి సెషన్లో మరో వికెట్ పడలేదు.
ఇక రెండో సెషన్‌ను సాఫీగా నడిపిస్తున్న తరుణంలో బషీర్ స్పిన్ భారత్‌ను పదేపదే కష్టాల్లోకి నెట్టేసింది. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద గిల్‌ను బషీర్ ఎల్బీగా అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రజత్ పటిదార్ (17) క్రీజులోకి రాగా... జైస్వాల్ 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు.
కానీ మరోవైపు పటిదార్ బషీర్‌కే వికెట్ అప్పగించాడు. టీ విరామానికి ముందు అనుభవజు్ఞడైన ఆల్‌రౌండర్ జడేజా (12; 2 సిక్సర్లు)ను అవుట్ చేయడం ద్వారా బషీర్ భారత్‌ను చావుదెబ్బ తీశాడు. 131/4 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది.
ధ్రువ్ నిలకడ
ఆఖరి సెషన్లో కూడా స్పిన్ హవానే కొనసాగింది. దీంతో భారత్ 47 పరుగుల వ్యవధిలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. ముందుగా జట్టు స్కోరు 150 పరుగులు దాటిన కాసేపటికి యశస్విని బషీర్ బౌల్డ్ చేశాడు. ఇది జట్టును కోలుకోనివ్వలేదు. దాంతో స్వల్ప వ్యవధిలో సర్ఫరాజ్ (14), అశ్విన్ (1)లను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు.
177 స్కోరు వద్ద 7 వికెట్లను కోల్పోయిన దశలో ధ్రువ్ జురెల్ (58 బంతుల్లో 30 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), కుల్దీప్ (72 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) చూపించిన తెగువ భారత్‌ను ఆలౌట్ కాకుండా ఆపగలిగింది. ఇద్దరు 17.4 ఓవర్ల పాటు ప్రత్యర్థి స్పిన్, పేస్‌కు ఎదురునిలిచి అబేధ్యమైన 8వ వికెట్‌కు 42 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు:
ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 353
భారత్ తొలిఇన్నింగ్స్: యశస్వి (బి) బషీర్ 73; రోహిత్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 2; శుబ్‌మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 38; పటిదార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 17; జడేజా (సి) పోప్ (బి) బషీర్ 12; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) హార్ట్లీ 14; జురెల్ బ్యాటింగ్ 30; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్లీ 1; కుల్దీప్ బ్యాటింగ్ 17; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (73 ఓవర్లలో 7 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–112, 4–130, 5–161, 6–171, 7–177. బౌలింగ్: అండర్సన్ 12–4–36–1, రాబిన్సన్ 9–0–39–0, బషీర్ 32–4–84–4, హార్ట్లీ 19–5–47–2, రూట్ 1–0–1–0.