వీరాభిమానులు
ఇద్దరు అభిమానుల వింత కథ
భారత్‌కు సుధీర్ చౌదురి
పాకిస్థాన్‌కు బషీర్ చాచా
ఇద్దరిదీ విభిన్న నేపథ్యం
గమనించారోలేదో... భారత్ ఎక్కడ మ్యాచ్ ఆడినా కనిపించే అభిమాని సుధీర్ చౌదురి. అతడి గురించి భారత్‌లో క్రికెట్ అభిమానులకు అందరికీ తెలుసు. అలాగే పాకిస్థాన్ ఎక్కడ క్రికెట్ ఆడినా కనిపించే అభిమాని బషీర్. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఢాకాలో టి20 ప్రపంచకప్‌కు వచ్చారు. ఇద్దరిదీ భిన్న
నేపథ్యం... ఇద్దరి జీవితాలు ఆసక్తికరం.
ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్
ఎక్కడ క్రికెట్ జరిగినా వెళ్లి చూడటం అంటే సామాన్యమైన విషయం కాదు. డబ్బులు కావాలి, టిక్కెట్లు దొరకాలి. ఇంట్లో వాళ్ల నుంచి తిట్లు తినాలి. ఇలా చాలా అంశాల పాత్ర ఉంటుంది. ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చి అయినా జట్టుతో పాటు వెళ్లి మద్దతు ఇచ్చే అభిమానులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఇద్దరే సుధీర్ చౌదురీ, బషీర్ చాచా. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఈ ఇద్దరు అభిమానులు మంచి స్నేహితులు. వీళ్లే కాదు... శ్రీలంక జట్టుతో పాటు తిరిగే మరో అభిమాని కూడా ఉన్నాడు. ప్రపంచకప్ లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు వీళ్లంతా ఓ రింగ్‌లా ఏర్పడతారు. అసలు వీళ్లకు ఇంత ఓపిక ఎక్కడిది? మామూలుగా వీళ్లకు ఆదాయ మార్గాలు ఏమిటి? భార్యాపిల్లల్ని వదిలిపెట్టి అన్నేసి రోజులు ఎలా తిరుగుతున్నారు..? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ కథనం. సుధీర్, బషీర్ ఇద్దరి దగ్గరి నుంచి ‘సాక్షి’ సేకరించిన సమాచారం.
బషీర్ చాచా...
హైదరాబాద్ అల్లుడు
బషీర్ వయసు 62 సంవత్సరాలు. పాకిస్థాన్‌లోని కరాచీ స్వస్థలం. కానీ భారత్‌లోని హైదరాబాద్ అమ్మాయిని చేసుకున్నాడు. చంచల్‌గూడ ప్రాంతంలో ఇప్పటికీ తన భార్య తరఫు బంధువులు ఉన్నారు. ఏటా ఒక్కసారైనా హైదరాబాద్ వస్తాడు. వికారాబాద్‌లోని తన బంధువుల మామిడి తోటలు ఇష్టమైన హాలిడే స్పాట్.
పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తే అయినా ఎప్పుడో వెళ్లి అమెరికాలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతని సంబంధీకులెవరూ పాక్‌లో లేరు. అమెరికా పాస్‌పోర్ట్ ఉంది. కాబట్టి పాక్ వ్యక్తులకు వీసా లభించని చోటుకు కూడా బషీర్ వెళతాడు.అమెరికాలోని షికాగోలో రెస్టారెంట్ ఉంది. అలాగే కెనడాలోని టొరంటోలో కూడా ఓ రెస్టారెంట్ ఉంది. ఈ రెండు చోట్లా ఫేమస్ ఏంటో తెలుసా..? హైదరాబాదీ బిర్యానీ.
15 సంవత్సరాలుగా పాకిస్థాన్ జట్టు ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా వెళుతున్నాడు. అతను ఇలా తిరగడం భార్యా పిల్లలకు ఇష్టం లేదు. అయినా క్రికెట్ మీద పిచ్చితో ఇలా తిరుగుతున్నాడు. కొడుకులు రెస్టారెంట్ నడుపుతూ భారీగా సంపాదిస్తున్నారు. బషీర్ ఇలా ఖర్చు చేస్తున్నాడు.పాకిస్థాన్ జట్టులోని క్రికెటర్లంతా బాగా క్లోజ్. కానీ ఎవరినీ డబ్బులుగానీ, మ్యాచ్ టిక్కెట్లు గానీ అడగడు. తానే కొనుక్కుంటాడు. టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్-భారత్ మ్యాచ్ టిక్కెట్ 8 వేల టాకాలు (భారత కరెన్సీలో రూ.6800) పెట్టి కొన్నాడు. పాక్ మ్యాచ్‌లు లేని సమయంలో భారత్ మ్యాచ్‌లనూ చూస్తాడు.
పాకిస్థాన్ వెళ్లలేకపోతున్నా అనేది బషీర్ బాధ. అక్కడ భద్రత లేదని, వెళితే ఊరుకోబోమని భార్యాపిల్లలు వారిస్తున్నారు. అయినా క్రికెట్ లేదు కాబట్టి వెళ్లాల్సిన అవసరం రావడం లేదు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ టిక్కెట్‌తో పాటు ఫైనల్ టిక్కెట్ కూడా ఇప్పటికే కొనేశాడు.
సుధీర్ చౌదురి...
సచిన్‌కు ఆత్మీయుడు
31 ఏళ్ల సుధీర్ చౌదురి బీహార్‌లో జన్మించాడు. పెళ్లి చేసుకోలేదు. ఇంత క్రికెట్ పిచ్చి ఉన్నవాడు పెళ్లిచేసుకోవడం అనవసరం అని అతని అభిప్రాయం. 2003 నుంచి భారత జట్టుతో పాటు తిరుగుతున్నాడు. సచిన్ మీద అభిమానంతో మ్యాచ్‌లు చూడటం మొదలుపెట్టాడు. భారత్‌లో ఎక్కడ మ్యాచ్ జరిగినా గతంలో సైకిల్ మీద వెళ్లేవాడు. ఇప్పుడు ట్రైన్ పాస్ ఉంది.
2011 ప్రపంచకప్ గెలిచాక భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్‌తో కలిసి ఫొటో దిగడం అతని జీవితంలో అత్యంత మధురక్షణం {Mికెట్ లేని సమయంలో ఏదో ఒక పని చేస్తాడు. ఏదైనా ఫంక్షన్స్‌లో, ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్‌లో ఉండటం లాంటి పనులు చేస్తాడు. రోజుకు 200 నుంచి 400 రూపాయలు సంపాదించుకుంటాడు. సచిన్ ఆడినంత కాలం మ్యాచ్ పాస్‌లు మాస్టర్ ఇచ్చేవాడు. జట్టు మసాజర్ రమేశ్‌కు మాస్టర్ సుధీర్‌ను అప్పజెప్పాడు. ప్రస్తుతం రమేశ్ టిక్కెట్లు ఇస్తున్నాడు.
సచిన్, ధోని గతంలో అనేకసార్లు డబ్బులు ఇవ్వబోయారట. కానీ వద్దని తిరస్కరించానని చెబుతున్నాడు సుధీర్. వేరే వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని, తన పిచ్చికి అవసరమైన డబ్బు తానే సంపాదించుకుంటున్నానని చెప్పాడు. కేవలం ఉపఖండంలో మ్యాచ్‌లకు మాత్రమే వెళతాడు. భారత్‌లోని నగరాలతో పాటు ఢాకా, కొలంబోలలో ఫ్యాన్స్ నెట్‌వర్క్‌ను సుధీర్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు. దీంతో ఆయా ప్రదేశాల్లో మ్యాచ్‌లకు వెళ్లినప్పుడు బస, ఆహారం ఫ్రీ. తనకు ఆతిథ్యం ఇచ్చినవాళ్లకు మ్యాచ్ పాస్‌లు ఇస్తాడు.సచిన్ ఆడుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లకూ వెళ్లాడు. ఇప్పుడు సచిన్ రిటైరైనందున ఇక ఐపీఎల్ మ్యాచ్‌లు బంద.ఇంగ్లండ్‌లో గతంలో ఓ టోర్నీకి వెళ్లేందుకు స్పాన్సర్ చేసేందుకు సచిన్ ముందుకొచ్చినా.. వీసా దొరక్క వెళ్లలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది ప్రపంచకప్ మ్యాచ్‌లు చూపిస్తానని సచిన్ మాట ఇచ్చాడట.